మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… రంతిదేవుడు నీతికథ.
రంతిదేవుడు
పూర్వం రంతిదేవుడను రాజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.
ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్పుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.
ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.
Ranti Devudu Story In Telugu
ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.
ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడున్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.
బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు. బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
దానము తీసుకొనువానికి హితము కలిగించు దానిని ఫలాపేక్షరహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదియేకాక అడిగినవానిలో భగవంతుడిని దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది తనకు లేక పోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ధన్యుడు.
మరిన్ని నీతికథలు మీకోసం: