మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమద్భాగవతము నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… సంతృప్తిని మించిన సంపద లేదు.
సంతృప్తిని మించిన సంపద లేదు
సుదాముడు శ్రీ కృష్ణ పరమాత్మకు బాల్యస్నేహితుడు సహాధ్యాయి. ఈతడు భూసురోత్తముడు విరాగి బ్రహ్మవేత్త జితేంద్రియుడు ఉత్తముడు అన్నిటినీ మించి శ్రీ కృష్ణునికి ఆప్తుడు. కాని సుదాముడు చాలా బీదవాడు. చినిగిన బట్టలు కట్టుటచే ఈతనికి కుచేలుడన్న పేరువచ్చెను. అయిననూ కుచేలుడెన్నడూ తనకు ధనములేదని విచారించలేదు. దీనునివలె యాచనచేయలేదు. దైవప్రేరణచే తనకు కలిగినదానితో సుఖముగా జీవించుచుండెను. సదా బ్రహ్మనిష్ఠ యందుండెడివాడు. సంతృప్తి లేని యెంత ధనవంతుడైననూ దరిద్రుడని సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైననూ ధనవంతుడే అనిన సత్యమెఱిగినవాడు.
సుదాముని సతి వామాక్షి. ఈమె పతివ్రతాశిరోమణి. అర్థాంగి అన్న పేరు సార్థకం చేసుకొన్నది. ఒకనాడు సుదామునితో ఇట్లాఅన్నది “నాథా! అవంతీపురమున పరమాత్మ మీరు సాందీప మహర్షి వద్ద సహాధ్యాయులు. శ్రీ కృష్ణస్వామి మీకు ఆప్తులు కూడా. పరమాత్ముని దర్శించిన వారికి సకల క్లేశములు తొలగును కాదా. ఒక పర్యాయము ఆయన కడకు వెళ్ళిరాకూడదా?” అని ఆవేదనను వ్యక్తపఱచినది. తన అర్థాంగి చెప్పిన హితవాక్యాలు విని సుదాముడు “వామాక్షీ! ఆ పరంధాముని దర్శనము నాకు లభించునా? అయిననూ ఫలాపేక్షరహిత చిత్తముతో ఆ భగవానుని దర్శనమునకు పోయెదను. మన హితము ఆ సర్వజ్ఞుడే చూసుకొంటాడు. నేనును నా స్నేహితున్ని చూడాలని చాలా రోజులగా అనుకొంటున్నాను. దైవసన్నిధికి ఏగునపుడు రిక్తహస్తాలతో పోరాదు. నాలుగుగుప్పెళ్లు అటుకులు దొరకునేమో చూచి రమ్ము”. వామాక్షి భర్త అంగవస్త్రంలో అటుకులు కట్టి పంపింది.
పరమాత్మ దర్శనానికి ఉవ్విళులూరుతూ సుదాముడు త్వర త్వరగా నడచి ద్వారకను చేరెను. శ్రీ కృష్ణుడే మందిరములో నున్నాడ ని ద్వారపాలకులను ప్రశ్నించెను. వారు అన్ని మందిరములలో నుండునని చెప్పిరి. పదహారు వేలయెమినిది మంది భార్యలున్నాకూడా ప్రతి ఇల్లాలి మందిరంలో తానే ఉండి శ్రీ రామావతారంలోని ఏకపత్నీవ్రతం అనే ఆదర్శాన్ని నిజం చేసిన శ్రీ కృష్ణస్వామి లీలకు వందనం చేసి సుదాముడు ఒక అంతఃపురం వద్దకొచ్చాడు. అది రుక్మిణీ దేవి మందిరం. సుదాముడు వచ్చాడని తెలియగానే శ్రీ కృష్ణుడు పరుగెత్తి సింహద్వారము కడకేగి ఆనందపారవశ్యంతో సుదాముని కౌగిలించుకొనెను. ఇరువురి కన్నులనిండా ఆనందభాష్పాలు జాలువారాయి. శ్రీ కృష్ణుడు సుదాముని హస్తం పుచ్చుకుని స్వయంగా అంతఃపురం లోనికి తీసుకు వెళ్ళాడు.
రుక్మిణీ దేవి స్వర్ణకలశముతో పవిత్రోదకం తెచ్చింది. శ్రీ కృష్ణుడు తన హస్తములతో సుదాముని పాదములు కడిగి ఆ నీళ్ళు తన శిరమున చల్లుకొన్నాడు. “అతిథి దేవోభవ” అని లోకానికి చాటడానికి శ్రీకృష్ణుడలా చేసెను. అది చూచినవారంతా ఆ జలమును తమ శిరముల పై చల్లుకొన్నారు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు తన పర్యంకంపై సుదాముని కూర్చుండబెట్టి యథావిధి అతిథి సత్కారము చేసెను. మృష్టాన్నములతో భోజనము పెట్టెను. పరమాత్మ తనకు సేవ చేయుట చూడలేక సుదాముడు శ్రీ కృష్ణ స్తుతి చేసెను. తరువాత ఎంతోసేపు వారు ప్రియభాషణములాడిరి. శ్రీకృష్ణుడు సుదాముడు తెచ్చిన అటుకులు తిని “ఇట్టి అటుకులు నా చిన్నతనమున మా అమ్మ నాకు తినిపించేది. మరల ఇప్పుడే తినుట” అని అన్నాడు. మఱునాడు సుదాముడు తన గృహమునకు మఱలెను. శ్రీ కృష్ణుడు సుదామునికి ఘనముగా వీడ్కోలిచ్చెను.
సుదాముడు ఎంత కష్టాలలో ఉన్నా తనను ఏమీ అడుగకుండా వెళిపోవటం చూసి శ్రీ కృష్ణుడు సుదాముని సంతృప్తికి భక్తికి మెచ్చి సుదామునికి అనంత సంపదనిచ్చెను. సుదాముడు దారి అంతా శ్రీ కృష్ణుని తలచుకుంటూ తన ఇల్లు చేరెను. శ్రీ కృష్ణుని దయవల్ల తనకు సకల సంపదలు వచ్చెనని తెలుసుకొనెను. సుదాముడు వామాక్షి ఆ సంపద తమదికాదని తలచి బీదసాదలకు దానములు చేసిరి. ఎన్నెన్ని దానములు చేసినా ఆ అనంతనిధి కరఁగలేదు. అలా అనంత పుణ్యాన్ని ఆర్జించి ఆ దంపతులు కడకు కైవల్యమును పొందిరి.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- సంతృప్తి లేనివాని జీవనం దుఃఖమయం. సంతృప్తి ఉన్న ఎంత బీదవాడైనా ధవవంతుడే. అడిగే అవకాశమున్నా తనకున్నదానితో తృప్తిగా ఉన్న సుదాముని మెచ్చి శ్రీ కృష్ణపరమాత్మ సుదామదంపతులకి మోక్షాన్ని ప్రసాదించాడు.
- స్నేహం యొక్క ఔన్నత్యం ఈ కథలో మనకు బాగా తెలిసింది. ఒక సత్పురుషుని స్నేహం కన్నా ఎక్కువైన ధనం ఏదీలేదు. సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం అద్వితీయం. శ్రీకృష్ణుని చెలిమి సాటిలేని కలిమి.
- ఒక అతిథి పైగా పండితుడు వచ్చినప్పుడు వానిని ఎలా సేవించాలో శ్రీ కృష్ణుడు ఈ కథలో మనకు చూపినాడు. సకల జీవరాశికి మోక్షప్రదాత అయిన శ్రీ కృష్ణుడు సుదాముని కాళ్ళుకడిగి ఆ నీళ్ళు తన నెత్తిన చల్లుకొన్నాడు.
- నిష్కల్మష భక్తి ఎలావుండాలో సుదాముడు మనకు చూపినాడు. నాకే కోరికాలేదు. నాకేది మంచిదో నీకే తెలుసు అనే నమ్మకం భగవంతుని మీద ఉండాలని సుదాముడు చెప్పినాడు.
మరిన్ని నీతికథలు మీకోసం: