మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…
శ్రీ సత్యనారాయణ వ్రత కథ – ద్వితీయోధ్యాయః
శ్లో // అధాన్యత్సంప్రవక్ష్యామి కృతం యేన పురాద్విజాః,
కశ్చిత్కాశీపురేమ్యేహ్యా సీద్విప్రోతి నిర్ధనః
క్షుత్తృ డ్భ్యాం వ్యాకులో భూత్వా నిత్యాంబభ్రామ్ భూతలే //
సూతుడు మరల ఇలా చెప్పుచున్నాడు. మునులారా ! పూర్వమీ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను వినుడు. కాశీనగరమున అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు నిత్యము ఆకలిదప్పులతో అలమటించుచు తిరుగుచుండెను. శ్రీ సత్యనారాయణ స్వామి, దుఃఖపడుచున్న బ్రాహ్మణుని జూచి కరుణ గలవాడై తానొక బ్రాహ్మణ వేషము దరించి వచ్చి, ‘ఓ విప్రుడా ! ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేమి? నీ కథనంతను జెప్పుము. వినవలెనని యున్నది’ అనెను. విప్రుడిట్లు చెప్పెను. ఓ మహానుభావా ! నేనొక బ్రాహ్మణుడను. అతి దరిద్రుడను. బిక్ష కొరకు ఇంటింటికి తిరుగుచున్నాను. నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు చెప్పుము అని నా దరిద్రము నశించెడి ఉపాయము నీకు తెలిసినచో నాకు యమ నీకు తెలిసినచో నాకు చెప్పుము అని ప్రార్ధించెను.
అంత వృద్ధబ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణుడా ! సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతమున్నది. అది చేసినవారికి సర్వదుఃఖాలు తొలగిపోవును. నీవును ఆ వ్రతము చేయు మనుచు దాని విధానమును భోధించి అంతర్థానము చెందెను. ఆ బ్రాహ్మణుడు, రేపే నేనా వృద్ధబ్రాహ్మణుడు చెప్పిన వ్రతము చేసెదనని సంకల్పించి, దానినే తలచుకొనుచు రాత్రి నిద్దురగూడ పోలేదు. అతడు ప్రొద్దున్నే లేచి, ఈ రోజున సత్యదేవుని వ్రతము చేసెదనని మరల సంకల్పించుకొని భిక్షకై బయలుదేరెను. ఆ రోజున స్వామి దయవలన అతనికి చాల ద్రవ్యము లభించెను. బంధువులను గూడ పిలిచి, దానితో అతడు సత్యనారాయణ వ్రతము చేసెను. ఆ వ్రతము యొక్క ప్రభావము చేత అతడు దారిద్ర్యము మున్నగు సర్వ దుఃఖములనుండి విముక్తుడై, సమస్త సంపదలతో తులతూగెను. అది మొదలుగా అతడు ప్రతిమాసమునందు ఈ వ్రతమును ఆచరించి సర్వపాప విముక్తుడై తుదకు మోక్షము నొందెను. ఆ బ్రాహ్మణుడు చేసినట్లు ఏ మానవుడైనను ఈ సత్యనారాయణ వ్రతము చేసినచో, అతని సర్వదుఃఖములును నశించును. సూతుడు, మునులారా ! మీరడిగిన కథ చెప్పినాను. ఇంకేమి చెప్పమందురు ? అని యడిగెను. శౌనకాది ఋషులు, మహాత్మా ! ఆ బ్రాహ్మణుని వలన తెలిసికొని యెవ్వడీ వ్రతమాచరించెనో చెప్పుము. మాకు వినవలెనని యున్నది అని యడిగిరి. సూతుడిట్లు చెప్పనారంబించెను. మునులారా! ఒకనాడా బ్రాహ్మణుడు తన వైభవము కొలది బందువులను బిలిచికొని వ్రతము చేయుటకు ప్రారంభించెను. అంతలో అక్కడి కొక కట్టెలమ్ము కొనువాడువచ్చి కట్టెల మోపు బయట దింపి విప్రుని ఇంటికి వచ్చెను.
అతడు చాల దప్పిక గలవాడై యుండియు ఓపికగా బ్రాహ్మణుడు చేయు వ్రతమును పూర్తిగా చూచి, తుదకు ఆయనకును దేవునుకును నమస్కరించి, మహానుభావా ! నీవు చేసిన పూజయేమి? దీనివలన కలుగు ఫలమేమి ? వివరముగా జెప్పమని యడిగెను. బ్రాహ్మణుడిట్లు చెప్పెను. ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినచో ధనధాన్యములు, సర్వసంపదలు కలుగును. ఇట్లు ఆ విప్రుని వలన ఆ వ్రతమును గూర్చి తెలుసుకొని మంచి నీరు త్రాగి, ప్రసాదమును స్వీకరించి తన యూరికి బోయెను. అతడు సత్యదేవుని మనసులో ధ్యానించుచు, ఈ కట్టెల మోపును రేపు అమ్మెదను. అమ్మగా వచ్చిన ధనముతో సత్యదేవుని వ్రతము చేసెదను, అనుకొని మరనాడు కట్టెల మోపు తలపై పెట్టుకొని నగరములో ధనికులుండు ఇండ్లవైపు వెళ్ళెను. అతడానాడు స్వామి యనుగ్రహముచే కట్టెలమ్మి రెట్టింపు లాభము నొందెను. దానికి సంతోషించి, అరటిపండ్లు, పంచదార, ఆవునేయి, ఆవు పాలు, శేరుంబావు గోధుమనూక, పూజాద్రవ్యములు అన్నియు దీసుకొని ఇంటికి వెళ్ళెను. వెళ్ళి, బందువులునందరిని బిలిచి సత్యదేవుని వ్రతమును యథాశక్తిగా చేసెను. ఆ వ్రతము చేసిన ప్రభావముచే అతడు ధనములతోను, పుత్రులతోను సర్వసమృద్ధిగలవాడై యీ లోకమున సౌఖ్యములననుభవించి చివరికి సత్యలోకమును పొందెను.
ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ద్వితీయోధ్యాయః
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం