Satyanarayana Vrata 4th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – చతుర్థోధ్యాయః –

తరువాత సాధువు శుభశకునములు చూచి, విప్రులకు దానధర్మములు చేసి ప్రయాణం సాగించెను. సాదువు కొంతదూరము ప్రయాణించెను. సత్యదేవునికి సాధువును పరీక్షించు కోరిక గలిగి, సన్యాసి వేషముతో వచ్చి సాధూ! నీ పడవలలో నున్నదేమి? అని యడిగెను. ఆ వైశ్యులు ధనమదముగలవారై, అడిగిన ఆ సన్యాసిని జూచి, పరిహసించి, ఇందులో నున్నదేమైన అపహరించుటకు చూచుచున్నావా? ఇందులో మాత్రమేమున్నది? ఆకులు తీగలు తప్ప? అని చెప్పిరి. సన్యాసి రూపుడైన ఆ దేవుడతని మాటలు విని ‘తథాస్తు’ అని పలికి కొంతదూరములో నది యొడ్డుననే నిలుచుండెను. సన్యాసి అటు వెళ్ళగానే సాధువు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలు ఆకులలములతో నిండియుండుట చూచి ఆశ్చర్య పడి, దుఃఖముతో మూర్చపోయెను.తెలివి వచ్చిన తరువాత ధనములు అట్లయినందుకు చాల విచారించెను. అప్పుడల్లుడు సాదువును జూచి, మహాత్ముడైన సన్యాసిని పరిహసించినాము. అతడు కోపముతో శపించి పోయినాడు. ఆయనయే మరల మనలను రక్షింపగలడు. ఆయనను శరణు వేడినచో మన కోరికలు తీరును అని చెప్పెను. అల్లుని మాటలు విని సాధువు వెంటనే సన్యాసి దగ్గరకు బోయి భక్తితో నమస్కరించి వినయవిధేయతలతో ఇట్లనెను. స్వామీ ! అజ్ఞానముచే నేను పలికిన మాటలను మన్నించి నన్ను క్షమింపుము. అని పదే పదే మ్రొక్కుచు ఏడ్చెను. గోలున ఏడ్చుచున్న సాదువును జూచి స్వామి, ఏడువవద్దు. నీవు నా పూజ చేయుదునని ప్రతిజ్ఞ చేసి, అశ్రద్ధ చేత మరచినావు. దుష్టబుద్దీ! నా శాపము చేత నీ కీ కష్టాలు కలుగుచున్నవని యిప్పటికైనా గ్రహించితివా? అనెను. స్వామి మాటలు విని సాధువు చేతులు జోడించి, ఓ పుండరిక నేత్రా ! బ్రహ్మాదిదేవతలే నీ మాయను దాటలేక సతమతమగుచున్నారు. నీ గుణములను రూపమును తెలిసికొనలేకున్నారు. మానవమాత్రుడను, అజ్ఞానిని. ఆపైన, అనీ మాయలో చిక్కుకొని, నీ అనుగ్రహమునకు దూరమైనవాడను. నిన్ను నేనెట్లు తెలిసికొనగలను? నా యపరాధమును క్షమింపుము. నిన్నెప్పుడును మరువక నా శక్తి కొలది నిన్ను పుజించెదను. శరణాగతుడైన నన్ను అనుగ్రహించి, నాధనములు నాకిచ్చి రక్షింపుము. అని ప్రార్థించెను. భక్తితో సాధువు చేసిన స్తోత్రమునుకు స్వామి సంతోషించి అతడు కోరిన వరమిచ్చి అక్కడనే అదృశ్యుడయ్యెను. సాదువు నావ దగ్గరకు వచ్చి అది ధనములతోను , వస్తువులతోను నిండి యుండుట చూచి, సత్యదేవుని దయవలన నా కొరిక తిరనదనుచు, పరివారముతో గలసి స్వామిని పూజించి తన నగరమునకు ప్రయాణము సాగించెను.

సాధువు తన ధనములను జాగ్రత్తగా కాపాడుచున్న అల్లుని జూచి, అల్లుడా ! చూచితివా? రత్నపురమునకు జేరినాము. అనుచు తమ రాకను తెలియజేయుటకై ఇంటికొక దూతను పంపెను. ఆ వార్తాహరుడు నగరమునకు బోయి సాధువు భార్యను జూచి నమస్క రించి, ‘అమ్మా! మన షావుకారుగారు అల్లునితోను, బందుమిత్రులతోను మన నగరమునకు వచ్చినారని’ చెప్పెను. దూత చెప్పినమాట విని సాధువు భార్య తాను చేయుచున్న సత్యవ్రతమును త్వరగా పూర్తిచేసి కుమార్తె తో ఇట్లనెను. నేను వెళ్ళుచున్నాను. నీవు కూడ త్వరగా నీతండ్రిని, భర్తను జూచుటకు రమ్ము. అనగా, తల్లిమాటలు విని కళావతి వ్రతమును ముగించి ప్రసాదమును భుజించుట మరచి భర్తను చూచుటకు వెళ్ళెను. అందుకు సత్యదేవుడు కోపించి ఆమె భర్తను పడవతో నీళ్ళలో ముంచివేసెను. తీరమందున్న జనులందురును పరమదుఃఖముతోనున్న కళావతిని జూచి దుఃఖము నొందిరి. ఉన్నట్లుండి పడవ మునిగిపోయినందుకు ఆశ్చర్యమును గూడ పొందిరి. కళావతి దుఃఖితురాలైన కుమార్తెను జూచి దుఃఖించుచు భర్తతో ఇట్లనెను. మన అల్లుడు పడవతో ఇట్లేల మునిగిపోయినాడు? ఇది ఏ దేవుని మాయవల్ల జరిగినది ? అని పలుకుచు కుమార్తెను ఒడిలోనికి దీసుకొని దుఃఖించెను కళావతీ తన భర్త అట్లు మునిగిపోయినందుకు విచారించుచు, అతని పాదుకలతో పాటు సహగమనము చేయుటకు సిద్దపడెను. తన కుమార్తె అవస్థ జూచి సాధువు చాల విచారించెను. అక్కడివారు కూడా బాదపడిరి. అప్పుడు సాధువు ‘ఇది యంతయు సత్యదేవుని మాయయై యుండును. స్వామి నన్ననుగ్రహించినచో నా వైభవము కొలది సత్యదేవ వ్రతము చేసెదనని చెప్పుచు ఆ దేవునికి అనేక సాష్టాంగనమస్కారములు చేసెను. సాధువుపై ప్రసన్నుడైన సత్యదేవుడు అతనితో ‘ఇట్లు చెప్పెను. ఓ సాధూ ! నీ కుమార్తె సత్యవ్రతము చేసి ప్రసాదము పుచ్చుకొనకుండ భర్తను జూచుటకు వచ్చినది. అందుచేతనే ఆమె భర్త కనబడకుండా పోయినాడు. ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని వచ్చినచో ఆమె భర్త మరల జీవించును. ఆకాశమునుండి వినవచ్చిన ఆ వాక్యమును విని కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదము పుచ్చుకొని త్వరగా తిరిగివచ్చి నీటిపై తేలుచున్న పడవలోని భర్తను జూచి సంతోషపడెను. అప్పుడామె తండ్రితో, తండ్రీ ! మన యింటికి పోవుదుము. ఇంక ఆలస్యమెందుకు ? అనెను. కుమార్తె మాటలు విని సాదువు సంతోషపడి,తన వారందరితో గలసి ఆ నదీతీరమునందే సత్యనారాయణ వ్రతము చేసి, తరువాత తన యింటికి చేరెను. ప్రతి పూర్ణిమనాడును ప్రతి సూర్య సంక్రమణనాడును సత్యనారాయణ వ్రతము యధావిధిగా చేయుచు ఆ సాధువు ఇహలోకమున సమస్త్రైశ్వర్యములు అనుభవించి చివరికి సత్యదేవుని సన్నిదానము చేరెను.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే చతుర్థోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Leave a Comment