Satyanarayana Vrata 5th Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ – పంచమోధ్యాయః

మునులారా! మీకు మరియొక కథ వినిపించెదను. వినుడు. పూర్వము తుంగద్వజుడను రాజుండెను. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుచు ధర్మముగా పాలించుచుండెను. ఒకప్పుడాతడు వేటకు వెళ్ళి అనేక మృగములను జంపి, అలసి ఒక మారేడు చెట్టు క్రింద విశ్రాంతికై ఆగి, ఆ ప్రక్కనే కొందరు గొల్లవారు సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి కూడ ఆ సమీపమునకు వెళ్ళక తాను రాజునను గర్వముతో స్వామికి నమస్కరింపక నిర్లక్ష్యము చేసెను. వ్రతము పూర్తైన తరువాత ఆ గోపాలురు ప్రసాదము దెచ్చి రాజు నెదుట ఉంచి స్వీకరింపుడని ప్రార్థించి తిరిగి వెళ్ళి తాము కూడ ప్రసాదమును స్వీకరించిరి. రాజు అహంకారముతో వారు పెట్టిన ప్రసాదమును అక్కడనే విడిచి వెళ్ళిపోయెను. అందువల్ల రాజునకు నూరుమంది కొడుకులును, ధనధాన్యములను, ఐశ్వర్యములను నశించి చాల దుఃఖములు కలిగెను. సత్యదేవుని ప్రసాదమును తిరస్కరించి వచ్చినాను గనుక, ఆయన కోపము వల్లనే నాకీ యనర్ధము కలిగినది. ఆ గొల్లలు సత్యదేవుని పూజించినచోటుకే మరల వెళ్ళి నేనును ఆ దేవునారాధించెదను. అని మనసులో నిశ్చయించుకొని ఆ గోపాలురు ఉన్నచోటు వెదుకుకొనుచు వెళ్ళెను. రాజు గోపాలురును జూచి మీరు జేసిన వ్రతమేదో చెప్పుడని యడిగి, వారితో గలసి భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతము యథావిధిగా చెసెను. సత్యదేవుని అనుగ్రహము వలన మరల ధనదాన్యాధిక సంపదలను పుత్రులను పొంది రాజ్య సుఖములనుభవించి, చివరకు సత్యలోకమును బొందెను. పరమోత్తమమైన యీ సత్యనారాయణ వ్రతమును చేసిన వారును, ఎవరైనా చేయచుండ చూచువరైనను, కథను విన్నవరైనను, సత్యనారాయణ స్వామి యనుగ్రహము వలన ధనధాన్యాది సంపదలను, పుత్రపౌత్రాది సంతతిని పొంది ఇహలోకమున సర్వసౌఖ్యాలను అనుభవించి పరమున మోక్షము నొందుదురు. ఈ వ్రతమును భక్తిశ్రద్దలతో చేసినచో, దరిద్రుడు దనవంతుడగును. బందింపబడినవాడు విముక్తుడగును. బయటి శత్రువుల వలనగాని, అంతశ్శత్రువులైన కామక్రోధాధుల వలన గాని, జనన మరణరూపమైన సంసారము వలన గాని, భయమందినవాడు ఆ భయమునుండి విముక్తుడగును. కోరిన కోరికలన్నియు లభించుటచే ఆనందించి, చివరకు సత్యలోకమునకు చేరును. ఇది నిశ్చయము. ఓ మునులారా మానవులను సర్వదుఃఖములనుండియు విముక్తులను జేయగల్గిన ప్రభావముగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును, ఆచరించి ఫలమును బొందినవారి కథలను మీకు వివరించినాను. విశేషించి ఈ కలియుగములో, సమస్త దుఃఖములు తొలుగుటకును, సర్వసౌఖ్యములు కలుగుటకును, తుదకు మోక్షము నిచ్చుటకును ఈ సత్యనారాయణ వ్రతమును మించినది ఏదియు లేదు. కలియుగమున కొందరు దేవుని సత్యమూర్తియనియు, కొందరు సితేశ్వరుడనియు, కొందరు సత్యనారాయణుడనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచెదరు. ఎవ్వరే పేరుతో బిలిచినను పలికెడి దయామయుడైన ఆ సత్యదేవుడు అనేక రూపములు ధరించి భక్తుల కోరికలు తీర్చెడివాడై కలియుగమున వ్రతరూపుడై ప్రకాశించుచుండును. వ్రతము చేయుచున్నప్పుడు చూచినను, వ్రతకథను విన్నను, సత్యనారాయణ స్వామి అనుగ్రహము వలన సర్వపాపములును నశించును.

తి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే పంచమోధ్యాయః

శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము సమాప్తము.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం

Leave a Comment