Satyanarayana Vrata 3rd Story In Telugu – శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు.  ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…

శ్రీ సత్యనారాయణ వ్రత కథ తృతీయోధ్యాయః 

మరల సూతుడిట్లు చెప్పసాగెను. మునులారా ! ఇంకొక కథను జెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజుండెను. అతడు సత్యవాక్పాలకుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు. అతడు ప్రతిదినము దేవాలయమునకు బోయి దైవదర్శనము చేసి, బ్రాహ్మణులుకు ధనమును ఇచ్చెడివాడు. అతని భార్య సౌందర్యవతి, సాధ్వి. ఆమెతో గలిసి రాజొకనాడు భద్రశీలానదీ తీరమున సత్యనారాయణ వ్రతమాచరించెను. ఇంతలో అక్కడికి సాధువను ఒక వర్తకుడు, అనేక వస్తువులతోను, ధనముతోను నిండిన నావను ఒడ్డున నిల్పి, వ్రతము చేయుచున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగెను. ఓ మహారాజా ! ఇంత భక్తిశ్రద్ధలతో మీరు చేయుచున్న యీ వ్రతమేమి? దయచేసి నాకు వివరింపుడు. వినవలెననియున్నది. సాధువిట్లడగగా ఆ రాజు, ‘ఓ సాధూ ! పుత్రసంతానము కావలెనను కోరికతో నేను మా బందుమిత్రులను బిలుచుకొని సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను, అని చెప్పెను. రాజు మాటలు విని సాధువు, మహారాజా ! నాకును సంతానము లేదు. ఈ వ్రతము వలన సంతానము కలుగుచున్నచో నేనును దీని నాచరించెద ననెను. తరువాత సాధువు వర్తకము పూర్తిచేసుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సంతానప్రదమైన యీ సత్యదేవుని గూర్చి చెప్పి, మనకు సంతానము కలిగినచో ఆ వ్రతము చేసెదనని పలికెను. సాధువు భార్య లీలావతి ధర్మప్రవృత్తి గలదై భర్తతో ఆనందముగా గడిపి గర్భవతియై సత్యదేవుని అనుగ్రహమువలన పదవ నెలలో ఒక బాలికను గనెను. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె వృద్ధి చెందుచుండగా తల్లిదండ్రులామెకు కళావతి అని పేరు పెట్టిరి. ఆ సమయములో లీలావతి భర్తను జూచి, సంతానము గలిగినచో వ్రతము చేయుదమంటిరిగదా ! పుత్రిక కలిగినది కదా! ఇంకను వ్రతము మాట తలపెట్టరేమి? అని అడిగెను. అందుకు భర్త, లీలావతీ ! మన అమ్మాయి వివాహములో వ్రతము తప్పక చేయుదును. అని యామెను సమాధానపరిచి వర్తకమునకై నగరమునకు బోయెను. కళావతి తండ్రి యింటిలో పెరుగుచుండెను.

అట్లు యుక్తవయసు వచ్చిన కుమార్తెను జూచి సాధువు తన మిత్రులతో ఆలోచించి, వరుని వెదుకుటకై దూతను పంపెను. వర్తకునిచే పంపబడిన ఆ దూత కాంచనగరమునకు బోయి, అక్కడ యొగ్యుడైన వైశ్యబాలకుని జూచి పెండ్లి చూపులకై తీసుకొని వచ్చెను. సుందరుడైన ఆ వైశ్యబాలును జూచి సాధువు తన కుమార్తె నిచ్చి పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి చేసెను. సాధువు తన దురదృష్టము చేత ఆ పెండ్లి వేడుకలలో బడి సత్యదేవుని వ్రతము సంగతి మరిచిపోయెను. అందుచే ఆ స్వామి చాలా కోపించెను. తరువాత కొంతకాలమునకు వ్యాపారమునందు దక్షతగల ఆ సాధువు అల్లునితో గలిసి వాణిజ్యమునకై బయలుదేరెను. అతడు నౌకలలో సముద్రతీరమున నున్న రత్నసానుపురమును జేరుకొని అక్కడ అల్లునితో గూడి వ్యాపారము సాగించుచుండెను. తరువాత వ్యాపారమునకై వారిద్దరును చంద్రకేతు మహారాజు నగరమునకు బోయిరి. అంతటి, వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసి మరచి పోయిన ఆ సాధువును జూచి, స్వామి కోపించి, దారుణము, కఠినము అయిన మహాదుఃఖ మతనికి కలుగుగాక యని శపించెను.

ఆనాడే రాజ దనాగారములో ఒక దొంగ ప్రవేశించి ధనము దోచుకొని పారిపోవుచుండెను. రాజభటులు తరుముచుండగా వాడీ వర్తకులున్నవైపు పరుగెత్తెను. ఆ దొంగ, తన్ను తరుముకొని వచ్చుచున్న రాజభటులను జూచి భయపడి దనమును వర్తకులముందు గుమ్మరించి పారిపోయెను. రాజభటులక్కడికి వచ్చి, రాజదనముతో ఎదుట కనబడుచున్న ఆ వర్తకులను బందించి రాజునొద్దకు తీసుకొనిపోయిరి. ఆ భటులు సంతోషముతో వీరిని దీసుకొనిపోయి, మహారాజా ! ఇద్దరు దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ దొంగలను బట్టి తెచ్చినాము. విచారించి శిక్షింపుడు అనిరి. రాజు వారి నేరమును విచారణ చేయనక్కరలేదనచు, కారాగారమున బందింపుడనెను. వారు వర్తకులను కారాగృహమున బందించిరి. సత్యదేవుని మాయచేత వర్తకులెంత మొరపెట్టుకున్నను వారి మాటలెవ్వరును పట్టించుకొనలేదు. రాజు వారి ధనమును తన ధనాగారమున చేర్పించెను.

ఆ దేవుని శాపముచే ఇంటి దగ్గర సాధువు భార్య కూడ కష్టాలపాలయ్యెను. ఇంటిలోని ధనమునంతను దొంగ లపహరించిరి. లీలావతి మనోవ్యథచే రొగగ్రస్తురాలయ్యెను. తినుటకు తిండి దొరకక ఇంటికి దిరిగి బిచ్చమెత్తుకొనసాగెను. కుమార్తెయైన కళావతి కూడ బిచ్చమెత్తుటకు పోసాగెను. ఒకనాడు సాయంకాలం వేళ, కళావతి ఒక బ్రాహ్మణునింటికి మాధవకబళమునకు బోయెను. అక్కడ ఆయన సత్యనారాయణ వ్రతము చేయుచుండగా చూచి, కథయంతయు విని, తమకు మేలు కలుగునట్లు వరమిమ్మని స్వామిని కోరుకొనెను. స్వామి ప్రసాదమును గూడ పుచ్చుకొని కళావతి, రాత్రి ప్రొద్దు పోయి యింటికి చేరెను. అప్పుడు తల్లి ఆమెతో ఇట్లనెను. అమ్మాయీ ! ఇంత రాత్రి వరకు ఎక్కడనుంటివి? నీ మనస్సులో ఏమున్నది? అని యడిగెను. వెంటనే కళావతి, అమ్మా! నేనొక బ్రాహ్మణుని యింటిలో సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచుచు ఉండిపోయితిని. ఆ వ్రతము కోరిన కోరికలు తీర్చునట గదా ! అనెను. ఆ మాటవిని సాధుభార్య, తామా వ్రతము చేయకపోవుటచేతనే ఇట్టి దురవస్థ కలిగినదని గ్రహించి, వ్రతము చేయుటకు సంకల్పించి, ఆ మరునాడు యథాశక్తిగా వ్రతము చేసెను. వ్రతాంతమునందు, స్వామీ !
నా భర్తయును అల్లుడును సుఖముగా తిరిగి యింటికి చేరునట్లు అనుగ్రహింపుము. వారి తప్పులను క్షమింపుము అని ప్రార్థించెను. లీలావతి చెసిన యా వ్రతముచే సంతోషించబడిన సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనబడి, నీవు బంధించిన వారిద్దరును దొంగలు కారు, వర్తకులు. రేపు వారిని విడిపించి వారి ధనమును వారికిచ్చి పంపుము. లేనిచో నిన్ను సమూలముగా నాశనము చేసెదనని చెప్పి అదృశ్యుడయ్యెను. మరునాడు ఉదయమున రాజు సభలో తనకు వచ్చిన కలను చెప్పి, ఆ వర్తకులను చెరసాలనుండి విడిపించి తెండని భటుల కాజ్ఞాపించగా వారట్లే ఆ వైశ్యులను సభలోనికి దెచ్చి రాజా ! వైశ్యులిద్దరిని తెచ్చినామని విన్నవించిరి.

ఆ వైశ్యులిద్దరును చంద్రకేతు మహారాజుకు నమస్కరించి వెనుకటి సంగతులు తలచుకొనుచు ఏమియు పలుకలేక నిలుచుచుండిరి. రాజప్పుడా వైశ్యులను జూచి ఆదరముతో, వర్తకులారా ! మీకీ కష్టము దైవ వశమున కలిగినది. ఇప్పుడా భయములేదని ఓదార్చి, వారి సంకెళ్ళను తీయించి క్షౌరము మున్నగు అలంకారములు జేయించెను. (మండనం ముండనం పుంసాం = పురుషులకు క్షౌరము అలంకారము.) వస్త్రాద్యలంకారములనిచ్చి, మంచి మాటలతో వారిని సంతోషపరచవలెను. ఇది వరకు వారివద్దనుండి తీసికొన్న ద్రవ్యమును రెట్టింపు ద్రవ్యమిచ్చి, ‘ఓ సాదూ! ఇంక మీ యింటికేగుమని ఆ రాజు చెప్పగా వారు సెలవు తీసుకొని బయలు దేరిరి’.

ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే తృతీయోధ్యాయః

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం

Leave a Comment