మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమద్భాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్ నీతికథ.
శ్రీ కృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్
అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురు బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు.
బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనే తెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అనుకుని ఆ మాయలయ్యను బెత్తంతో జళిపించింది.
శ్రీకృష్ణుడు భయపడినట్టు నటించి ఱోలు మీద నుంచి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగుతుండగా అతివేగముగా పారిపోయాడు. ఆ తల్లి బాలకృష్ణుని వెనకాల పరుగులెట్టింది. తనను పట్టుకోలేక అలసిపోయిన తల్లిని చూసి జాలిపడి ఆ పరమాత్మ ఆమెకు దొరికిపోయాడు!
పరమయోగీశ్వరులకు సంయములకు మునులకు దొరకని ఆ భగవంతుడు భక్తురాలైన యశోదకు దొరికిపోయాడు. కన్నతండ్రిని పట్టుకున్నదే. కానీ కొట్టడానికి చేతులు రాలేదు ఆ తల్లికి. యశోదాదేవి శరీరము స్వభావముకూడా పువ్వువలె మెత్తనివి. బిడ్డ మీద జాలితో దండించలేక త్రాటితో జోకటికి (ఉలూఖలమునకు కట్టివేయాలనుకొన్నది. ఒక పెద్ద త్రాడు తీసుకువచ్చి ఆ బాలకృష్ణుని గట్టిగా కట్టబోయింది. కాని ఆ త్రాడు రెండంగుళాలు తక్కువయ్యింది.
మరొక త్రాడు దానికి జతచేసినా మళ్ళీ రెండంగుళాలు తక్కువైనది. యశోద ఇంటిలోనున్న త్రాళ్ళన్నీ జతచేసినా ఆ నల్లనయ్య సన్నటి నడుమును చుట్టలేకపోయింది. ముజ్జగాలు దాగివున్న ఆ చిరు బొజ్జను కట్టుట ఎవరితరము? అలసిపోయిన తల్లిపై జాలిపడి నందకిశోరుడు కట్టుబడిపోయాడు. భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు గానీ మౌనులకుగానీ దానపరులకుగానీ యోగీశ్వరులకుగానీ పట్టుబడడుగదా!
యశోదాదేవి శ్రీకృష్ణుని ఇలా జోటికి కట్టివేసి ఇంటిపనులలో మునిగిపోయింది. బాలకృష్ణుడు ఆ జోలు ఈడ్చుకుంటూ పెరట్లో చాలాకాల ముగా శాపగ్రస్తులై మద్దిచెట్లుగా ఉన్న నలకూబర మణిగ్రీవుల దగ్గరకు వెళ్ళి వారిని కరుణించదలచి ఆ రెండు చెట్ల మధ్యనుంచి రోటిని లాక్కుంటూ వెళ్ళాడు. దానితో ఆ యమళ అర్జున వృక్షాలు కూలిపోయినాయి. అందునుంచి దిఙ్మండలము ప్రకాశింపచేయు ఇద్దరు అగ్నితుల్యులగు దివ్య పురుషులు వచ్చి స్వామిని స్తుతించి అతని అనుజ్ఞతీసుకుని కర్తవ్యోన్ముఖులై వెళ్ళిపోయారు.
యమళార్జుమల వృత్తాంతము
నలకూబరమణిగ్రీవులు పరమశివుని ప్రియసఖుడైన కుబేరుని పుత్రులు. వారు చాలా ధనగర్వముతో ఉండేవారు. రుద్రానుచరులై కూడా ఒకసారి వారు అతి పవిత్రమైన కైలాసపర్వతములోని ఒక సుందర ఉద్యానవనములో స్త్రీలతో కూడి వహారము చెసినారు. మదోమత్తులై వారుణి అను మదిరను పానముచేసినారు. వారు పద్మవనములో ఉన్న గంగలో జలక్రీడలాడ సాగినారు. అప్పుడు పరమపూజ్యుడైన నారదమహర్షి వారి పురాకృత సుకృతమువలన అక్కడికి వచ్చాడు. నారదుని చూసి ఆ దేవతాస్త్రీలు లజ్జితులై వెంటనే వస్త్రములు ధరించారు. కానీ మదిర ప్రభావములో ఒళ్ళు మరచిపోయిన ఆ కుబేర పుత్రులు వస్త్రములను ధరించలేదు. ఆ దేవకుమారుల అజ్ఞానమును చూచి నారదుడు ఇలా
అన్నాడు.
“ధనగర్వము ఎంతటి గొప్పవారినైనా నాశనము చేస్తుంది. ధనగర్వితులైన వారు మద్యపానము జూదము స్త్రీ సంభోగము వంటి దుర్వ్యసనములకు లోబడి అనేక పాపకార్యాలు చేయుదురు. నిర్భయులై మనోవినోదముకై పశువులను వధించెదరు. నశ్వరమైన దేహనుము శాశ్వతమైనదని నమ్మి దేహసౌఖ్యమే పరమానందము అనుకొనెదరు.
మద్యపానమత్తులై నగ్నముగా ఉండి ఘోరాపరాధము చేసిన వీరు స్థావరత్వమును పొందుటకు తగియున్నారు. మరల వీరెన్నడూ ఇట్టి అకార్యములు చేయకుండుటకై నా అనుగ్రహమువలన వీరికి పూర్వజన్మ స్మృతి ఉండును. నూరుదివ్యవర్షములు చేసిన తప్పుకు పశ్చాత్తాపము నొంది పునీతులై నా అనుగ్రహముచే కృష్ణభక్తులై దైవత్వమును పొందగలరు”. ఆ కుబేర పుత్రులే యమళార్జునులు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- వస్త్రధారణము యొక్క ప్రాముఖ్యత మనకు ఈ కథ ద్వారా తెలిసినది. ఎప్పూడూ సరిగా వస్త్రములేకుండా ఉండరాదని నారదమహర్షి మనకు చెప్పాడు.
- వారుణి అనే మదిర ప్రభావములో ఉండి తప్పని తెలిసికూడా నలకూబరమణిగ్రీవులు వస్త్రధారణము చేయలేదు. మదిరాపానం వలన మానవుడు తెలియకనే అనేక పాపాలు చేస్తాడు. పంచమహాపాతకాలలో మొదటిది ఈ మదిరాపానమే. అందుకని మనమిట్టి దుర్వ్యసనములకు ఎల్లప్పుడూ దూరముగా ఉండాలి.
- ధనగర్వము ఉండరాదని నారదమహర్షి మనకు ఉపదేసించాడు. శివానుచరులై ఉండికూడా కేవలము ధనగర్వము వలన కుబేర పుత్రులు వారి దైవత్వాన్ని కోల్పోయారు.
- తీర్థాలు పుణ్యక్షేత్రాలు సిద్ధప్రదేశాలు ఎప్పుడు విహార దృష్టితో వెళ్ళరాదని మనకు ఈ కథ ద్వారా తెలిసినది.
మరిన్ని నీతికథలు మీకోసం: