Karena Kim Mam Gruhitum Te In Telugu – కరేణ కిం మాం గృహీతుం తే

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో కరేణ కిం మాం గృహీతుం తే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కరేణ కిం మాం గృహీతుం తే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 6
కీర్తన : కరేణ కిం మాం గృహీతుం తే
సంఖ్య : 171
పుట : 123
రాగం : ఆహిరి

ఆహిరి

24 కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ

||పల్లవి||

జలే తవ సంచరణ మిహాధస్
స్థలే భవనం తవ సంతతం
బలే రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా

||కరేణ||

పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురణవిహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ.

||కరేణ||

స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరే:పతే తే ఖేలాఘటిత.

||కరేణ|| 171

అవతారిక:

సరస శృంగార కీర్తన గీర్వాణిలో వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నా అదృష్టం కొద్దీ ఇది శ్రీమన్నారాయణుని దశావతార కీర్తన. అక్కడక్కడా ప్రతిపదార్థమునకు గాక భావార్ధమునకు ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. నేను తెలుగు దశావతార కీర్తన వివరిస్తే ప్రతిపదార్ధ వివరణకే ప్రాముఖ్యతనిస్తాను. కానీ సంస్కృతంలో ప్రతి పదార్ధ వివరణ నా శక్తికి మించినపని. ఎందుకంటే గీర్వాణిలో నా పాండిత్యం అమావాస్యనాటి చంద్రుడు. అదండీ సంగతి. “ఓ శ్రీహరీ! ఫణీంద్రశయ్యపై సంభోగానందమందుకొనే నీ కరములు నన్ను అనుగ్రహించకుండుట యెందులకు?” – ఇది పల్లవి మరిదింతే…

భావ వివరణ:

ఓ శ్రీహరీ! ఫణిశయ్యా సంభోగా! (ఫణీశుడైన ఆదిశేషుడు శయ్య (పడక) అయి వుండగా, ఆ శయ్యపై సంభోగించుటకు ఆయత్తమైనవాడా!) నీ కరములు నన్ను అనుగ్రహించకుండా యుండుటెందులకు ప్రభూ!

సముద్రమునందు నీయొక్క సంచలన మిట్టిది (మత్స్యావతారము); నీవు అడుగున నీపైన భువనములు వున్నవి (కూర్మావతారము); ఉన్నతమైన బలప్రకటన జరపురూపమొప్పినది (వరాహావతారము); కొండగుహలలో చరించు సింహముఖరూపివి (నరసింహావతరాము);

నీపదములతో భువన ప్రమాణములను కొలిచితివి (వామనావతరాము); గొప్ప మడుగులో (తీర్ధములలో) నీయొక్క ప్రసిద్ధమైన విహారములు (యాత్రలు) జేసితివి (పరుశురామావతారం); ఆనందమునిచ్చు మోహన రూపుడైతివి మునులకు సైతం (శ్రీరామావతారము); నీయొక్క ఔన్నత్యమునకు నన్ను విడనాడితివి (బుద్ధుని అవతారము).

నీయొక్క విజయ చిహ్నమైన తెల్లని గుఱ్ఱపు గిట్టల నడక రతి సల్లాప సంకేతములైనవి (కల్కి అవతారము); ఓ శ్రీవేంకటగిరినాథా! సృష్టిలో నీ ప్రకాశముతో నీయొక్క ఆట నాడించు నీ కరములతో నన్నేల పరిగ్రహించవు తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment