Bakasura Vadha In Telugu – బకాసుర వధ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ గర్గభాగవతము లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ నీతికథ.

శ్రీకృష్ణలీలలు – బకాసుర వధ

యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు బాలునివలె గోపాలురతో యమునాతీరమున తిరుగుతూ ఆడుచూ ఉండెను. అప్పుడు కైలాస పర్వత మంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద కొంగ అక్కడికి వచ్చెను. మేఘగర్జన వలెనున్న దాని అరుపు విని గోపబాలురు భయభ్రాంతులైరి. ఆ మహాబకము తన ముక్కుతో పరమాత్మను నోటిలోకి వేసుకొని మ్రింగెను.

లోకరక్షకుని రక్షించుటకై దేవేంద్రుడు వజ్రప్రయోగము చేసెను. విధాతదండమును విసరెను. ఆ బకాసురునికి ఏ హానీ జరగలేదు! పరమేశ్వరుడు త్రిశూలముచే దాని రెక్క విఱుగగొట్టెను. వాయుదేవుని వాయవ్యాస్త్రము యముని దండము సూర్యుని వేయిబాణములు చంద్రుని నీహారాష్త్రము ఆ బకాసురునిపై పనిచేయలేదు! ఆగ్నేయాస్త్రముతో అగ్నిదేవుడు ఆ బకుని రొమ్ములను కాల్చెను. వరుణదేవుడు పాశముతో భద్రకాళి గదతో కొట్టగా ఆ బకాసురుడు మూర్ఛనొందెను. కొంతసేపటికి తేరుకున్న బకుని కాలు విఱుగగొట్టెను తన శక్త్యాస్త్రముతో కుమారస్వామి. ఒంటికాలితోనే మింటికెగసి ఆ బకాసురుడు దేవతలను తరిమికొట్టెను!

మహర్షులు వేదవేద్యుడైన శ్రీకృష్ణస్వామిని ధ్యానించగా బకాసురుని ఉదరములోనున్న స్వామి వాడి పొట్ట ఉబ్బునట్లు చేసెను. ఊపిరాడక బకుడు పరమాత్మను బయటకు ఉమ్మివేసెను. తరువాత బకుడు ముక్కుతో పొడవగా నందకిశోరుడు బకుని ముక్కుపుటములను చీల్చెను. మరణించిన బకాసురుని చూచి దేవతలు పరమాత్మపై పుష్పవృష్టి కురిపించిరి. బకునిలోని తేజస్సు కృష్ణపరమాత్మలో కలసెను.

బకాసురుని వృత్తాంతము

హయగ్రీవుడనే రాక్షసుని కుమారుడు ఉత్కలుడు. వాడు తన బలపరాక్రమాలతో దేవేంద్రుని జయించి స్వర్గాధిపతి అయ్యెను. ఇట్లు నూరేండ్లు త్రిలోకాధిపతియై శోభిల్లెను. అన్ని ఏండ్లు దేవేంద్రపదవిని పొందియూ బుద్ధిమాంద్యముచే ఆతడు మహాతెజస్వి అయిన జాజిలి మహర్షి ఆశ్రమము వద్దనున్న సింధూ మహాసాగరమునకు పోయి అక్కడ చేపలను పట్టుచుండెను. అప్పుడు జాజిలి మహర్షి ఉత్కలుని చూచి “ఓయి! నీకిట్టి జీవహింస చేయ తగునా? వంశానుక్రమమున నీకు లభించిన సంస్కారమేమి? నీవు చేయుచున్న పని ఏమి? జీవ హింస మహాపాపమని ఎఱుగవా”? అని మందలించెను. మూర్ఖుడైన ఉత్కలుడు మహర్షి మాటలను విశ్వసించక జీవహింస కొనసాగించుచుండెను. అంతట జాజిలి మహర్షి “కొంగవలె చేపలు పట్టుచుంటివి కావున బకుడవు కమ్ము” అని శపించెను. పశ్చాత్తాపముతో మహర్షిని శరణువేడినాడు ఉత్కలుడు. అప్పుడు మహర్షి “వత్సా! కర్మ ఫలితమును అనుభవింపక తప్పు కదా! పశ్చాత్తాముతో పునీతుడవైన నీకు శ్రీకృష్ణ సందర్శనము కలుగును. ముక్తిని పొందెదవు” అని అనుగ్రహించినాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

అహింసా పరమో ధర్మః ।
ధర్మహింసా తథైవచ ||

ఈ సూక్తికి అద్దంపట్టే కథ బకాసుర వధ. ఇంద్రపదవిని చేపట్టి తన సంస్కారానికి విరుద్ధ్భముగా చేపలను పట్టుకుని ఉత్కలుడు జీవహింస చేసినాడు. అందులకు జాజిలి మహర్షి అతనిని శపించినాడు. కావున మనము జీవ హింస ఎన్నడూ చేయరాదు.

దుష్టుడు లోకహింసా పరాయణుడు అయిన ఉత్కలుని సంహరించి శ్రీకృష్ణపరమాత్మ ధర్మసంస్థాపన చేసినాడు. శ్రీకృష్ణుడు చేసినది ధర్మహింస అయినది. పైన చెప్పిన సూక్తి ప్రకారము అహింస పరమ ధర్మము. అహింస అంతే గొప్పది ధర్మహింస.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment