మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఏకచక్రపుర బక వధ.
ఏకచక్రపుర బక వధ
“అమ్మా! ఎందులకు నీవు పుత్రుత్యాగము చేయుచున్నావు? ఎవ్వని బాహుబలము వలన మనము లాక్షాగృహము నుండి బయటపడ్డామో ఎవ్వని శక్తి సామర్థ్యాలవల్ల దుష్టుడైన పురోచనుడు నశించాడో ఎవ్వని బలపరాక్రమాలు మనల్ని ఎల్లవేళలా దుర్యోధనుని బాఱినుండి కాపాడుతున్నాయో ఏ వీరుని అండ చూసుకుని మనము సుఖముగా జీవిస్తున్నామో ఏ మహాబలశాలి కౌరవాదులకు గుండెదిగులు అయ్యాడో ఎవ్వని పై భారం మోపి పోగొట్టుకున్న రాజ్యలక్ష్మిని మఱల పొదుదామనుకుంటున్నామో అట్టి నాగాయుధ బలసంపన్నుడైన భీమసేనుని ఎందులకు త్యాగము చేస్తున్నావు తల్లీ”? అని బకాసురునికి ఆహారముగా వెళుతున్న తమ్ముని చూసి తల్లి అయిన కుంతీదేవిని అడిగాడు ధర్మరాజు.
“నాయనా! ప్రస్తుతము మనము ఈ విప్రోత్తముని ఇంటిలో ఆశ్రయము తీసుకుంటున్నాము. ఆ విప్పుని కుమారుడు బకాసురునకు ఆహారము కాకుండా కాపాడి ఆయన మనపై చూపిన వాత్సల్యానికి కృతజ్ఞతను చూపించాలి. ప్రత్యుపకారం మన కనీస కర్తవ్యము. సాటి వారు బాధలలో ఉన్నప్పుడు ఆదుకోవటం మానవతాధర్మమ్. అదీ కాక ఇటువంటి పండితోత్తముని రక్షించటం మహాపుణ్యదాయకము. లోభం వల్లకానీ తెలియక గానీ మోహము వల్లకానీ నేనీ నిర్ణయము తీసుకోలేదు.
వెయ్యి ఏనుగుల బలమున్న భీమనేనుని పరాక్రమము మనకు తెలియనిది కాదు. హిడింబాసురుని వధించినప్పుడు మనకి అతని శక్తి ఎంతటిదో తెలిసిపోయింది. ఆ భీమసేనుడు పుట్టిన రోజే నా చేయిజారి క్రింద పడినప్పుడు అతని క్రింద ఉన్న రాయి నుగ్గునుగైపోయింది! యుద్ధములో వజ్రని కూడా ఢీకొనే బలమున్నది భీమునికి. కనుక ఇతడు నిస్సందేహముగా బకాసురుని వధించి ఈ ఊరికి ఉపకారం చేస్తాడనే నా నమ్మకము. ఆ పైన శ్రీకృష్ణుని దయ” అని హితబోధ చేసింది మహాసాధ్వి అయిన కుంతీదేవి.
ధర్మజుడు తల్లి మాటలు విని ఎంతో సంతోషించి పుత్రవాత్సల్యంతో తమ్ముని మనసారా దీవించి పంపినాడు. అనుకున్న ప్రకారం భీమసేనుడు ఒక బండీలో అన్నం నింపుకుని ఆ రాక్షసుని స్థావరమునకు వెళ్ళి అతనిని పిలిచి తానే ఆ ఆహారమంతా తినసాగాడు. బకాసురుడు నరార్భకుడు తన భోజనం తినేస్తున్నాడని కుపితుడై గట్టిగా భీముని వీపుపై గుద్దాడు. చలించని భీమసేనుడు ఆహారం తీసుకుంటూనే ఉన్నాడు. మహా క్రోధముతో బకుడు ఒక పెద్ద వృక్షమును పెకిలించి భీమునిపైకి విసరబోయాడు.
ఇంతలో భీముడు భోజనము ముగించి కాళ్ళూ చేతులూ కడుక్కోని ఆచమించి శుచి అయ్యి రాక్షసుడు విసిరిన చెట్టుని పట్టుకుని తిప్పికొట్టాడు! అలా కొంత సేపు వారు రాళ్ళతో చెట్లతో భీకర యుద్ధం చేసి చివరికి ముష్టియుద్ధము చేయసాగారు. అలసిపోయిన రాక్షసుని బోర్లదోసి తన మోకాలిని బకుని వీపుపైన ఉంచి బలముగా ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు భీముడు. బకుడు ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసినాడు. ఆ కేకలు విని బకుని బంధువులు బయటికి వచ్చారు. భయకంపితులైన వారితో భీముడు “ఇక నుంచీ మీరు మనుషులను హింసించటం మానకపోతే మీకూ ఈ బకునికి పట్టిన గతే పడుతుంది” అని హెచ్చరించాడు. వారందఱూ అలాగే ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజునుండి ఏకచక్రపురం లోని ప్రజలు హాయిగా జీవించడం మొదులుపెట్టారు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:
- కుంతీదేవి ధర్మరాజుకు చేసిన హితబోధ మనమెన్నడూ మఱువరాదు. కృతజ్ఞత ఆర్తరక్షణ కనీస కర్తవ్యాలని మనకు ఈ కథ ద్వారా తెలిసినవి.
- ఒక సజ్జనుడు తన బలాన్ని పరోపకారానికి ఎలా ఉపయోగిస్తాడో మనకు ఈ కథలో భీమసేనుని ద్వారా తెలిసినది. దుష్టులైన కౌరవులు తమ బలాన్ని యుక్తిని ప్రజాశ్రయస్సుకు వాడకుండా మత్సరముతో పాండవులను మట్టుపెట్టడానికే ఉపయోగించారు.
మరిన్ని నీతికథలు మీకోసం: