Nivu Jagannathumdavu Ne Noka Jivumda Ninte In Telugu – నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే

ఈ పోస్ట్ లో నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
సంఖ్య : 169
పుట: 113
రాగం: భైరవి

భైరవి

50 నీవు జగన్నాథుఁడవు నే నొక జీవుఁడ నింతే
నీవలె ననుభవించ నేనెంతవాఁడను

||పల్లవి||

వైకుంఠ పదమేడ వడిఁగోర నెంతవాఁడ
యీ కడ నీ దాసుఁడనౌ టిది చాలదా
చేకొని నీ సాకారచింత యేడ నే నేడ
పైకొని నీ డాగుమోచి బ్రదికితిఁ జాలదా

||నీవు||

సొంపుల నీ యానందసుఖమేడ నే నేడ
పంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నేఁ దెలియ నెంతవాఁడ
యింపుగా నీకథ వినుటిదియే చాలదా

||నీవు||

కైవల్యమందు నీతో కాణాచి యాడనాకు
శ్రీ వేంకటాద్రిమీఁది సేవ చాలదా
యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున
భావించి నిన్నుఁ బొగడే భాగ్యమే చాలదా

||నీవు||

అవతారిక:

“ప్రభూ! నీవు పరమాత్మవు, జగన్నాథుడవు. మరి నేనో? ఒక జీవుడను. ఈ సృష్ఠిలో సర్వమూ నీదే. నీవలె అన్నీ అనుభవించే హక్కు నాకెక్కడిదయ్యా!” అని వినమృలై కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు. నీ కైవల్యం పొందగలిగే అర్హత నాకున్నదా స్వామీ? పోనీలేవయ్యా! ఈ తిరుమలో నీసేవాభాగ్యం దక్కితే చాలు నాకు. నీవు నాకిచ్చిన ఈ కొద్దిపాటి విజ్ఞానంతో నిన్నే భావించి నిన్నే కీర్తిస్తూ బ్రతుకుతాను అది చాలునాకు అంటున్నారు. ఇక మనమైతే, అట్లాంటి కోరిక కోరుకోవాలనే కోరిక కలుగని కొరగాని కొరకరాని కొయ్యను నేను.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీవు జగన్నాథుడవు. పరమాత్మవు. మరి నేనో, ఒక జీవుడను, నీవు సర్వ భోక్తవు. నీవలె అనుభవించుటకు నేనెంతవాడను ప్రభూ! నీవు వైకుంఠము 9నీయగల సమర్థుడవె. కాని నీవు వైకుంఠమెక్కడ నేనెక్కడ? దాన్ని కోరే అర్హత నాకున్నదా? అయితే అయిందిలే స్వామీ! ఇక్కడ నీదాసుడను అనిపించుకొంటే నాకదే పదివేలు. కొంతమంది నిన్ను సాకారంగా ప్రత్యక్షం చేసికొనవలెనని కోరుకుంటారు. కానీ నేనెక్కడ నీసాకార దర్శనమెక్కడ! ఏదో ఈ వైష్ణవదీక్షలో నీతిరునామము, ఒంటిపై శంఖచక్ర చిహ్నములు నాకుచాలునయ్యా! ఇట్లా పైకొని (నా శరీరంపై దాల్చిన) వాటితో బ్రతికితే అది చాలు నాకు.

సొంపైన నీ బ్రహ్మానందానుభవంతో కలిగే సుఖము నాకు సాధ్యమా తండ్రీ! అదెక్కడ నేనెక్కడ? కానీలే- నాకు నీ వైష్ణవ సల్లాపములు (ప్రవచనములు) చాలును. ఇంపైన విజ్ఞానము (భగవంతుని గురించి జ్ఞానము) కోటికొక్కడికి దక్కుతుంది దాన్ని తెలుసుకోవటానికి నేనెంత వాడను ప్రభూ! ఏదో నీకథాశ్రవణంతో నా బ్రతుకును గడిపేస్తాను నాకది చాలును.

కైవల్యము అంటే నీతో వుండిపోయే భాగ్యం పొందటమే. | ఆమోక్షస్థానమే చిరకాల వాస స్థానము (కాణాచి) అదెక్కడ, నేనెక్కడ? ఇదిగో నీవేంకటాద్రి మీద నీసేవ నాకుండగా అనవన్నీ నాకెందుకయ్యా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఇకపై నీవు ఇచ్చిన ఈ విజ్ఞానంతో భాలించి నిన్ను కీర్తిస్తూ బ్రతికేస్తాను. నాకు ఆ భాగ్యం చాలు. ఇంకేదీ వద్దుగాకవద్దు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment