మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజా అనేది అభిమానం, ప్రేమ, భక్తి మరియు అభివృద్ధికి స్థానము. ఇది మనస్సును ప్రశాంతత, ధ్యానం మరియు సమాధానాన్ని అందిస్తుంది. పూజా అనేది ధర్మ, ఆధ్యాత్మికత మరియు సంస్కృతి వ్యాపకంగా సంబంధించిన అమూల్యమైన పద్ధతి. ఈ రోజు మన వెబ్‌సైట్ నందు శ్రీ సాయి దీక్షా విధానము గురించి తెలుసుకుందాం…
Sri Sai Deeksha Or Sai Mala Vidhanam
శ్రీ సాయి దీక్షా విధానము
మానవునికి శాంతి సౌఖ్యములను సమకూర్చేది భక్తి. ఆ సాయినాథుని కృపాకటాక్షములు ఎల్లవేళల తోడుండాలని చేసే ప్రయత్నమే శ్రీ సాయిదీక్ష. ఈ దీక్షను శ్రీ సాయి పుట్టిన రోజగు శ్రీరామ నవమికి ముందు, శ్రీ సద్గురుని గురు పౌర్ణిమగు ఆషాఢ పౌర్ణిమకు ముందు, శ్రీ సాయి పుణ్యతిథి యగు విజయదశమికి ముందు, శ్రీ దత్త జయంతి యగు మార్గశిర పౌర్ణిమకు ముందు మండలము, అర్ధ మండలము, సప్తాహంగా వీలును బట్టి స్వీకరించవచ్చును.
దీక్షకు అవసరమగు వస్తువులు:
రెండు మాలలు. ఒకటి ధారణమాల, రెండవది జపమాల. మాలలలో తులసీ, రుద్రాక్ష, స్పటిక, రక్త చందన రకాలున్నాయి. వీటిలో తులసీమాల శ్రేష్ఠము. తెలుపు రంగు దీక్షా వస్త్రములు, అలంకరణ కొరకు గంధము, విభూతి, కుంకుమ, పూజ కొరకు పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరవత్తులు, గంధము, కర్పూరం, కలకండ (కడి చక్కెర), పన్నీరు, పీచుతో కూడిన నారికేళం, ఊదు, విభూతి చూర్ణం, ప్రమిదలు, గంట, ఏక మరియు పంచ హారతులు, ఉదాని, వత్తులు, మంచి నూనె, సాయి బాబా విగ్రహం లేదా బాబా, గణపతి, దత్తాత్రేయుల చిత్రపటాలు.
మాలాధారణ విధానము:
మాలాధారణ రోజు ఉదయమే తలంటు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దీక్షా దుస్తులు ధరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం పొంది సాయి కాకడహారతికి (ఉ॥ 5-15 ని॥) ముందుగా ఆలయాన్ని చేరి కాకడ హారతి అనంతరం గురు స్వామి లేదా పూజారి చేత మాలధారణ చేయవలెను. తరువాత తాను నివసించు ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసుకొని సాయి విగ్రహం, చిత్ర పటాలు, గురుస్వామి ఇచ్చిన నారికేళం ఉంచి నిత్యం పూజించాలి.
దీక్షా నియమాలు:
- వ్రతి రోజు నూర్యోదయం కన్నా ముందు మరియు సూర్యాస్త మయం తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
- స్నానానంతరం దీక్షా వస్త్రధారణ కాగానే గంధం, కుంకుమ, విభూతి ధరించాలి.
- పీఠం వద్ద శుభ్ర పరచి సాయినాథునికి అభిషేకము చేసి దీపారాధన అనంతరం అష్టోత్తరంతో కూడిన అర్చన గావించి ధూపం చూపించి కలకండ నైవేద్యం సమర్పించి, కర్పూర హారతి యిచ్చి మంత్ర పుష్ప సాష్టాంగ నమస్కారాలతో వూజ నాచరించవలెను.
- మధ్యాహ్నం 12 గం॥లకు మహా నైవేధ్యం చూపి పంచ హారతులతో మధ్యాహ్న హారతి సాయికి ఇచ్చి అనంతరం భోజనం చేయాలి. ఆహారం సాత్వికమై ఉండాలి.
- సూర్యాస్తమయం అనంతరం స్నానాది కార్యక్రమాలు జరిపిన తరువాత ఏక హారతితో ప్రదోష పూజ (సంధ్యా హారతి) ను, రాత్రి 10 గం॥లకు శేజారతి నివ్వాలి.
- దీక్షా సాధకుడు ప్రతి రోజు ఒకే పూట భోజనం చేసి రాత్రికి పాలు, ఫలములు మాత్రమే తీసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. నిరంతరం సాయి నామం జపిస్తు గురు స్వామి ఉపదేశించిన మంత్రమును ఉదయం 108 సార్లు, రాత్రి 108 సార్లు స్మరించాలి.
- తను నిర్వర్తించే వృత్తులను నిర్వర్తిస్తు వీలైన సమయంలో సాయి జీవిత చరితము సాయి లీలామృతము నిత్య పారాయణము చేయాలి.
- భూత దయను కలిగి వుండి, ప్రతి జీవిలో సాయిని దర్శించాలి.
- ఇతరులను సాయిరాం అని గాని, సాయి శరణం అని గాని సంబోధించాలి.
- ప్రతి స్త్రీలోను తల్లిని చూడవలెను.
- వీలును బట్టి ఆలయ దర్శనం చేయాలి. దైవ భక్తి కార్యక్రమాల్లో పాల్గొనాలి.
- తీసుకొనే ప్రసాదము భోజనం పరిశుభ్ర స్థలంలో ఒకే సారి తీసుకోవాలి.
- ఆర్థిక పరిస్థితిని బట్టి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి.
దీక్షలో చేయకూడనివి:
- తెలుపు దుస్తులు తప్ప ఇతర రంగు దుస్తులు ధరించకూడదు.
- క్షౌరము చేయకూడదు, గోళ్ళు తీయకూడదు.
- క్రీములు, నూనెలు, సబ్బులు వాడకూడదు.
- విలాసాలకు, హాస్యానికి, రాజకీయ విషయములకు దూరంగా వుండాలి. (న్యూస్ పేపర్ చదవకూడదు. టి.వి, సినిమాలు చూడకూడదు)
- ధూమపానం, మద్యపానం, మాంసాహారమును విడిచిపెట్టాలి.
- పాదరక్షలు ధరించకూడదు.
దీక్షావిరమణ :
దీక్ష పూర్తయిన మరుసటి రోజు ఉదయం పీఠం వద్ద పూజా కార్యక్రమాలు జరిపి పీఠంను కదిలించి పీఠంపై గల నారికేళమును తీసుకొని దానితో స్వామి వారి పూజా వస్తువులు, నైవేద్యంతో శ్రీ సాయిబాబా మందిరమును చేరి గురు స్వామి లేదా పూజారి చే దీక్షా విరమణ చేయాలి. శాంతిని చేకూర్చు శ్రీ సాయిబాబా దీక్షను కుల మత భేదాలు లేకుండా స్వీకరించిన కార్యసిద్ధి తప్పక జరుగును.
మరిన్ని పోస్ట్లు: