మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ గురించి తెలుసుకుందాం…
సత్యనారాయణ వ్రత కథ – ప్రథమోధ్యాయః
శ్లో//ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోప శాంతయే //
శ్రీమంతమైన నైమిశారణ్యములో శౌనకాదిమహర్షులు, తమ దగ్గరకు వచ్చిన మహాపురాణవేత్తయైన సూతునికి మర్యాదలు చేసి, యిట్లడిగిరి. పౌరాణిక శేఖరా ! మానవులు కోటిన ఇహలోక, పరలోకములందలి సౌఖ్యములు ఏ వ్రతము చేసిన లభించును ? ఏ తపము చేసిన లభించును ? అదంతయు మాకు చెప్పుము. అని కోరగా సూతుడిట్లనెను. మునులారా ! మీరడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షియైన నారదుడు శ్రీమన్నారాయణు నడిగెను.ఆయన నారదునకు చెప్పిన దానినే మీకు చెప్పెదను, వినుడు.ఒకానొకప్పుడు నారదమహాముని లోకములను అనుగ్రహించు కోరిక గలవాడై వివిధ లోకములు దిరుగుచు భూలోకమునకు వచ్చెను. అక్కడ, తాము చేసిన కర్మములచే నానాదుఃఖములనుభవించుచు, అనేక జన్మములెత్తుచున్న జనములనుజూచి, ఏ యపాయముచే వీరి దుఃఖములు తొలగు నని చింతించి, సర్వలోక పరిపాలకుడగు శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెడలను. అక్కడ, తెల్లని శరీరకాంతి గలవాడును, నాలుగు భుజములు ప్రథమ అధ్యాయం గలవాడును, శంఖము – చక్రము – గద – పద్మము వనమాల వీనిచే అలంకరింపబడినవాడును అగు శ్రీమన్నారయణుని జూచి స్తుతించుట ఆరంభించెను. “మాటలకును మనస్సునకును అందని రూపముగలవాడవును, సృష్టి స్థితి లయములు చేయు అనంతశక్తి గలవాడవును, పుట్టుట – పెరుగుట – నశించుట లేనివాడవును, మొదట సత్వరజస్తమో గుణములు లేనివాడవే అయినను సృష్టి వ్యవహారములో త్రిగుణములు గలవాడవును, అన్నింటికి మొదటివాడవును, భక్తుల బాధలు తీర్చువాడవును అగు నీకు నమస్కారము” నారదుని యీ స్తోత్రమును విని విష్ణువు నారదమునీ తో నిట్లనెను. నారదమునీ ! నీవిక్కడి కేల వచ్చితివి? నీ మన్సులో నేమి కోరిక యున్నది? చెప్పుము. నీవడిగిన వన్నియు వివరింతును. అని నారదుడిట్లనెను. స్వామీ ! భూలోకమున జనులందరును చాల దుఃఖము లనుభవించున్నారు. మృగ పశుపక్షి మనుష్యాది అనేక జన్మములెత్తుచున్నారు.అనేక పాపములు చేసి ఆ పాప ఫలములనుభవించుచున్నారు. తేలికయైన ఉపాయము చేత వారి పాపములన్నియు నశించు మార్గమును దయచేసి ఉపదేశింపుము. అని అడుగగా భగవానుడిట్లనెను, నారదా! లోకములోనివారు సుఖపడవలెనను మంచిబుద్ధితో నీవడిగిన విషయము చాల బాగున్నది. జనులు దేనిచే సంసార భ్రాంతి విడిచి సౌఖ్యము పొందుదురో అట్టి సులభోపాయమును జెప్పెదను, వినుము.
భూలోకమందును, స్వర్గలోకమందును గూడ దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రత మొక్కటి కలదు. నీయందలి వాత్సల్యము చే చెప్పుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. దానిని విధివిధానముగా ఆచరించినవాడు ఈ లోకమున సమస్త సౌఖ్యముల ననుభవించి ఆపైన ముక్తి నొందును. అని చెప్పగా స్వామీ ! ఆ వ్రతవిదానమేమి? ఆ వ్రత మట్లు చేసినచో ఫలమేమి? పూర్వ మెవ్వరైన చేసి ఫలము నొందినారా? ఆ వ్రతమెప్పుడు చెయవలెను? ఇవ్వన్నియు వివరముగా జెప్పుమని యడిగెను. భగవానుడిట్లు చెప్పెను. వ్రతవిష్టత ఈ వ్రతము ప్రజల కష్టములను విచారములను పోగొట్టును. ధనధాన్యములు వృద్ధి నొందించును. సంతానమును, స్త్రీలకు సౌభాగ్యమును ఇచ్చును. సమస్త కార్యములందును విజయమును సమకూర్చును. ఈవ్రతము ఏప్పుడు చేయాలిమాఘమాసమున గాని, వైశాఖమాసమున గాని, కార్తీకమాసమున గాని మరియు ఏ శుభదినమునందైనా గాని యీ వ్రతము చేయవలెను. యుద్ధ ప్రారంభము లందును, కష్టములు కలిగినప్పుడును, దారిద్ర్యము గలిగినప్పుడును అవి తొలగిపోవుటకు కూడ ఈ వ్రతమాచరించవచ్చును. నారదా ! భక్తుని శక్తిబట్టి ప్రతి మాసమందుగాని ప్రతి సంవత్సరమున గాని యీ వ్రతము నాచరించవలెను. ఏకాదశినాడు గాని, పూర్ణిమనాడుగాని, సూర్యసంక్రమణ దినమున గాని యీ సత్యనారాయణ వ్రతము చేయవలెను. .ప్రొద్దుట లేచి దంతధావనాది కాలకృత్యాలు, స్నానాది నిత్యకర్మములు ఆచరించి, భక్తుడు ఇట్లు వ్రతసంకల్పము చేసి దేవుని ప్రార్థింపవలెను. ఓ స్వామీ ! నీకు ప్రీతి కలుగుటకై సత్యనారాయణ వ్రతము చేయబోవుచున్నాను. నన్ననుగ్రహింపుము. ఇట్లు సంకల్పించి, మద్యాహ్న సంద్యావందనాదులొనర్చి సాయంకాలము మరల స్నానము చేసి ప్రదోషకాలము దాటిన తరువాత స్వామికి పూజ చేయవలెను. పూజాగృహములో ప్రవేశించి స్థలశుద్ధికై ఆ చోట గోమయముతో అలికి పంచవర్ణముల మ్రుగ్గులు పెట్టవలెను. ఆ మ్రుగ్గులపై అంచులున్న క్రొత్తబట్టలను పరచి, బియ్యము పోసి మధ్య, వెండిది కాని, రాగిదికాని, ఇత్తడి కాని, కలశమునుంచవలెను. బొత్తిగా పేదవారైనచో మట్టి పాత్రనైనా ఉంచవచ్చును. కాని శక్తి యుండి కూడ లోపము చేయరాదు. కలశముపై మరల అంచులున్న క్రొత్త వస్త్రము నుంచి, ఆపై స్వామిని నిలిపి పూజించవలెను. ఎనుబది గురిగింజల యెత్తు బంగారముతోగాని, అందులో సగముతో గాని, ఇరువది గురుగింజల ఎత్తు బంగారముతోగాని సత్యనారాయణ స్వామి ప్రతిమను జేయించి, పంచామృతములతో శుద్దిచేసి మండపములో నుంచవలెను.
గణపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి అను పంచలోకపాలకులను, ఆదిత్యాది నవగ్రహములను, ఇంద్రాద్యష్టదిక్పాలకులను ఇక్కడ పరివార దేవతులుగా చెప్పబడిరి. కావున వారిని ముందుగా ఆవాహనము చేసి పూజించవలెను. మొదట, కలశలో వరుణదేవు నావాహనము చేసి విడిగా పూజించవలెను. గణేశాదులను కలశకు ఉత్తరమున ఉత్తర దిక్సమాప్తిగా ఆవాహన చేసి, సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములలో ఆవాహన చేసి పూజించవలెను. ఆ పిమ్మాట సత్యదేవుని కలశమందు ప్రతిష్ఠించి పూజచేయవలెను. బ్రాహ్మణ – క్షత్రియ, వైశ్య, శూద్రులనెడి నాలుగు వర్ణాలవారును, స్త్రీలును గూడ ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణాది ద్విజులు కల్పోక్త ప్రకారముగా వైదిక – పురాణ మంత్రములతోను, శూద్రులైనచో కేవలము పురాణ మంత్రముల తోను స్వామిని పూజించవలెను. మనుజుడు, భక్తిశ్రద్దలు గలవాడై ఏ రోజునైనను, పగలు ఉపవాసముండి సాయంకాలమున సత్యనారాయణ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులతోను బంధువులతోను గూడి వ్రతము చేయవలెను. అరటిపండ్లు, ఆవునేయి, ఆవుపాలు, శేరంబావు గోధుమనూక, గోధుమనూక లేనిచో వరినూక, పంచదార వీనినన్నిటిని కలిపి ప్రసాదము చేసి స్వామికి నివేదనము చేయవలెను.
బంధువులతో గూడి సత్యనారాయణ వ్రతకథను విని, బ్రాహ్మణులకు దక్షిణతాంబూలములిచ్చి, వారికిని బంధువులకును భోజనములు పెట్టి స్వామి ప్రసాదమును స్వీకరించి, స్వామికి నృత్యగీతాది మహారాజోపచారములర్పించి తానును భుజింపవలెను. నదీతీరమున ఇట్లు వ్రతము చేసి, స్వామిని స్మరించుచు స్వగృహమునకు చేరవలెను.
ఇట్లు సాంగముగ భక్తి శ్రద్ధలతో వ్రతము చేసినవారికి కోరినవి సిద్ధించును. విశేషించి, కలియుగములో సర్వార్థ సిద్ధికి ఇదియే సులభమైన ఉపాయము. దీనిని మించినదేదియు లేదు. అని శ్రీమన్నారయణుడు, నారదున కుపదేశించెనని సూతుడు శౌనకాది మహామునులకు జెప్పెను.
ఇతి శ్రీ స్కాందపురాణేరేవాఖండే సూత శౌనక సంవాదే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయః
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ద్వితీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ తృతీయ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ చతుర్థ అధ్యాయం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ పంచమ అధ్యాయం