మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం…
Vinayaka Vrata Katha In Telugu
శ్రీ వినాయక వ్రత కథ
(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.)
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశార ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనము లను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి,సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.
“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ని దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటు వంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానంచేసి, నిత్య కర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మనుచేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ, పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదు లను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజచేయాలి. విప్రులకు దక్షిణతాంబూ లాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదంవలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమ మైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.
కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతంచేయడం వల్లనే శ్యమంతకమణితోపాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.
పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తనభవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి.. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకు డగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవ చ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వర మును ఇవ్వరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.
మరిన్ని వ్రతాలు: