ఈ పోస్ట్ లో ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన : ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
సంఖ్య : 43
పుట: 29
రాగం: భైరవి
భైరవి
64 ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు
||పల్లవి||
పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె ఉన్నది
వరుసల మఱచిన వారికి మాయ
||ఎవ్వరి||
వేదాంత సారము విష్ణుభక్తియిది
ఆదిమునులమత మయినది
సాధించువారికి సర్వసాధనము
కాదని తొలగినకడుశూన్యంబు
||ఎవ్వరి||
చేతి నిధానము శ్రీ వేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము
||ఎవ్వరి||
అవతారిక:
ఎవరి అదృష్టం యెలావుంటుందో యెవరు చెప్పగలరు? అని పాడుతున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “దవ్వు చేరువకు తానే గురుతు” అంటే, యెవ్వడు ఆయనకు దూరమైనవాడో, యెవరు దగ్గరవాడో తానే తెలిసినవాడు. ఇంకెవరికీ తెలియదు అని అర్థం. ఆనాడు శిశుపాలుడి తల నరికాడు కాని వాడు ఆయన నమ్మిన ద్వారపాలకుడు. “బావా! యెప్పుడు వచ్చితీవు” అని ధుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలుకరిస్తాడు. కాని తొడలు విరగకొట్టించి చంపించాడు. మరి మనబోటి వారేం చేయాలి? సత్ప్రవర్తనతో, శరణాగతితో, స్థిరభక్తితో, ఆ ఏడుకొండలవాడిని సేవించడం. అట్లా చేయనివారి గతి యేమిటి? భవసాగరంలో కొట్టుమిట్టాడటమే.
భావ వివరణ:
ఓ ప్రజలారా! ఎవ్వరి భాగ్యం (అదృష్టము) యెట్లా వుంటుందో, యెవ్వరు చెప్పగలరు? “దవ్వు చేరువకు తానే గురుతు” (ఆ సర్వేశ్వరునకు ఎవ్వరు దూరమో? ఎవ్వరు దగ్గరవారో? ఎవరు చెప్పగలరు?)
భగవన్నామసంకీర్తనము పరమమంగళకరమైనది. అది నరులకే కాదు సురులకు (దేవతలకు) కూడా శుభప్రదమైనది. ఇరవుతో నెరిగిన (సమూలంగా తెలిసికొంటే), అది యెదుటనే వున్నది. అంటే దాని ఫలితం ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. వరుసల మరచిన (దేవుడెవరు జీవుడెవరు అనే క్రమము మరచినచో) వారికి మాయ (వారు మాయకు లోనై తామే అధికులమని హిరణ్యకశిపునివంటి భ్రష్ఠులైపోతారు).
వేదము విష్ణువును కీర్తిస్తుంటే… వేదాంతము యొక్క సారము విష్ణు భక్తిని ప్రతిపాదిస్తున్నది. ఆదికాలమునాటి మునులయొక్క మతము కూడా విష్ణుభక్తియే. సాధనతో విష్ణుభక్తిని పెంపొందించుకొంటే వారికి సర్వమూ సాధ్యమవుతాయి. విష్ణుని కాదని తొలగిన (దుర్యోధనుడు తనకి కృష్ణుడు వద్దు, కాని కృష్ణుని యాదవ సేన కావాలని కోరుకున్నాడు) కడు శూన్యము (ఏదీ దక్కదు) మిగులుతుంది.
శ్రీవేంకటేశ్వరుడు చేతిలోవున్న నిధానము (నిధివంటివాడు.) ఏతలజూచిన (ఏవిధంగా చూచినా) ఇందరికి (ఈ జీవకోటికి) నీతియు (ధర్మవంతమైనది) ఆ దేవదేవుని శరణాగతియే. నిజసేవకులకు (అసలైన హరిదాసులకు) ఇదియే దిక్కు మరి పాతకులకు (పాపాత్ములకు) అది భవసాగరమున (సంసార సాగరంలో) మునక. ఇంతవరకు అందులో మునిగినవాడు తేలలేదు. తేలడు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: