మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.
నీతికథలు
శ్రీ గర్గభాగవతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్ కథ.
శ్రీకృష్ణ లీలలు – శకటాసుర భంజనమ్
“ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలారా వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట చూచివత్తమమ్మ సుదతులారా”
అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ వ్రజభామలందఱూ చిన్ని కృష్ణుని చూడ వచ్చారు. బాలకృష్ణుని కురులు ముడిచి పరిమళ పుష్పములతో అలంకరించారు. ఆ చిన్ని శిశువు నుదుట కస్తూరి దిద్ది కాటుక పెట్టారు. చెవి పోగులు పులిగోరు చంద్రహారము బాలునికి ధరింపచేశారు. బోసి నవ్వులొకిస్తున్న జగన్నాథుని బుగ్గన గడ్డముపై చుక్కలు పెట్టారు. చేతులకు కడియాలు ముంజేతులకు మురుగులు మొలకు బంగారుత్రాడు కట్టారు. బాలుని రూపములో ఉన్న శేషశాయికి నీరాజనాలిచ్చి “ఉయ్యాలా బాలునూచెదరు” అంటూ బాలుని బండీ క్రిందనున్న పసిడి తొట్టిలో పడుకోబెట్టి లాలి పాటలు పాడారు. వ్రజభామలు ఎన్నో కానుకలు పిండివంటలు మొదలగునవి ఇచ్చారు.
ఈ కోలాహలంలో కంసప్రేరితుడైన శకటాసురుడు వాయు రూపములో వచ్చి పరమాత్మపై బండిని పడద్రోశాడు. ముద్దులొలికిస్తూ చిన్నికృష్ణుడు ఆ శకటమును (బండిని) తన్నాడు. రివ్వున బండీ ఎగిరి శకటునిపై పడి ఆతని తల వ్రక్కలయ్యెను. బండిపైనున్న క్షీర దధి భాండములు క్రింద పడి పగిలెను.
అలికిడి వినిన వ్రజభామలు కలవరుముతో చూడగా బాలకృష్ణుడు కేరింతలుకొట్టుచూ ఆడుకుంటున్నాడు. ఈ లీలను చూచిన గోపబాలురు జరిగిన సంగతి వ్రజభామలకు చెప్పిరి. ఆశ్చర్యపడి నందనందునకు ఎఱ్ఱని నీటితో దిష్టితీసి భూసురులచేత వేదాశీర్వచనములు చేయించి లోకరక్షకునకు రక్షకట్టిరి.
శకటాసురుని వృత్తాంతము:
హిరణ్యలోచనుని పుత్రుడైన ఉత్కచుడు చాలా క్రూరుడు. ఒకసారి అతడు తన స్వాభావికమైన క్రూరత్వముచే లోమశ మహర్షి ఆశ్రములోనున్న వృక్షలతాదులను పెఱికివేశాడు! ఆతని క్రూరబుద్ధిని చూసి ఆ మహర్షి “ఓరీ! పాము కుసుసము విడిచినట్టు నీవు ఈ దేహము విడువుము” అని శపించినాడు. పశ్చాత్తాపముతో మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఉత్కచుడు. “పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు. అయిననూ నీవు చేసిన కర్మకు శిక్ష తప్పదు. ద్వాపరమున శ్రీకృష్ణ పరమాత్మ నిన్ను విధించును. ఆ పురుషోత్తముని పాద స్పర్శతో నీకు శాపవిముక్తి కలుగుతుంది” అని శాపావశానం చెప్పాడు లోమశ మహర్షి. ఆ ఉత్కచుడే శకటాసురుడు.
ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం
క్రూరత్వం కడు దుష్టస్వభావము అసురలక్షనము. తోటి మానవులు జంతువులతోనే కాక వృక్షములతో కూడా మైత్రీభావముతో ఉండవలెనని మనకు ఈ కథ ద్వారా తెలిసినది. మన శాస్త్రాల ప్రకారం ఒక చెట్టును ఊరికే నఱకడం మహాపాపమ్. అవసరార్థం ఒక వృక్షమును నఱికితే దానికి బదులు నాలుగు వృక్షములు నాటమని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్కచుడు ఊరికే ఎన్నో వృక్షములను పెఱికివేసి ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు.
మరిన్ని నీతికథలు మీకోసం: