మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. పూజ ఒక పరిపూర్ణ ఆరాధన విధానము, భగవంతుని పూజించడానికి ఉపయోగపడే ఒక ప్రముఖ ధార్మిక పద్ధతి. పూజ అనేది ఆదర్శ స్థలంలో, దేవాలయలో లేదా ప్రతిష్ఠిత స్థలంలో భగవంతుని ప్రతిమను పూజించేందుకు నిర్వహిస్తారు. పూజా విధానంలో అనేక అంశాలు ఉంటాయి, కొన్ని పండగలను జరుపుతుంది, మరియు ఆచరణలను పాటిస్తారు. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు సరస్వతీ ప్రార్థన గురించి తెలుసుకుందాం…
Saraswathi Prarthana Lyrics
సరస్వతీ ప్రార్థన
శ్లో॥ 1
యాకుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యాశ్వేతపద్మాసనా।
యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవై స్సదా పూజితా
సామాంపాతుసరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా॥
సీ॥ మల్లెలు, చంద్రుండు, మంచు, ముత్తెపు దండ వలె శోభమెరిసెడి వాణియీమె ధవళ కాంతుల నొప్పి ధరియుంచు నీ తల్లి శుభ్ర వస్త్రంబును శోభగూర్ప ఉత్తమ వీణియ నొప్పు హస్తంబుల తెల్లకమలమె ఆ దేవి పీట బ్రహ్మ విష్ణువులును పరమేశ్వరుడు తాము నుతియింతురీమెను నోరు పండ.
తే॥ జడము నెలకొన, తాను, అజ్ఞానమందు
దాని పూర్తిగా తొలగించు తల్లియీమె
దేవి భగవతి విద్యల దేవి ఈమె
ఓ సరస్వతి రక్షించు ఉన్నతముగ.
తా॥ మల్లెపూలు, చంద్రుడు, మంచుకొండ, ముత్యాలదండ, వలె మెరిసి పోతున్న తెల్లటికాంతినిచ్చు శుభ్రమైన తెల్లని వస్త్రములు శోభకలిగిస్తుండగా, ఉత్తమమైన వీణియను చేతులలో ధరించి తెల్లటి పద్మమున కూర్చుని ఆ త్రిమూర్తులు తమ నోరుపండునట్లు నుతించుచుండగా, అజ్ఞాన జనితమైన జడత్వమును ఆమె సంపూర్తిగా తొలగ చేయగలదు. అట్టి భగవతీ విద్యలరాణి, ఓ సరస్వతీ నన్ను చక్కగా రక్షించుము తల్లీ!
శ్లో॥ 2
శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
సర్వదా సర్వదాSస్మాకం, సన్నిధి స్సన్నిధిం క్రియాత్॥
తే॥ వాణి! శరదృతు పద్మము వంటి నీదు
పద్మ వదనపు దర్శన భాగ్యమిమ్ము
కోర్కెదీరిచి పండిత గురువులకును
ఎల్లవేళల సన్నిధి నీయుగాక.
తా॥ ఓ సరస్వతీ! శరత్కాల పద్మమువంటి నీ ముఖము యొక్క దర్శన భాగ్యము కల్పించుము. నీవు మా కోరికలను తీర్చుదానవు. ఎల్లవేళల పండితులకు గురువులకు నీ సన్నిధి దొరుకుగాక.
శ్లో॥ 3
సరస్వతి! నమస్తుభ్యం, వరదే! కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా||
తే॥ ఎల్లయెడల సరస్వతి ఈయవమ్మ
వరములను నాకు వలయు రూపమును దాల్చు
వాణి! ఓయమ్మ! పద్మ సంభవుని రాణి!
విద్య మొదలిడ సిద్ధిని వేడెదమ్మ!
తా॥ ఓ సరస్వతీ! నాకు ఎప్పుడూ కోరిన వరములిచ్చి కరుణించుము. కావలసిన రూపమును ధరించగల ఓ వాణీ! నలువరాణీ విద్యను ఆరంభము చేయుటకు ముందు ఓ తల్లీ సిద్ధించు కృపను వేడెదను.
శా || 4
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబు శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా.
తా॥ ఈ జగత్తుకంతటికీ మోహనరూపివైన ఓ సరస్వతీదేవీ తెల్లటి పద్మముల వంటి కన్నులుగల భగవతీ! పూర్ణచంద్ర బింబము వంటి ముఖముగల ఓతల్లీ! నిన్ను ధ్యానించి పుస్తకమును నాచేత ధరించితిని. నీవు నామనసున నిలిచి విరివిగా మంచిమాటలను, శబ్దములను శోభకలుగునట్లుగా పలుకుము. నామాట యందు ప్రీతిపూర్వకముగా నుండుము.
ఉ.
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందర వేణికి రక్షితామర
శ్రేణికిఁ దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుక వారిజ పుస్తకరమ్య పాణికిన్
తా॥ ఇసుక తిన్నెలవంటి పిరుదులు, తుమ్మెద రెక్కల వంటి ముంగురులు గలిగి పద్మసంభవుడైన బ్రహ్మను ఆకర్షించు కంఠస్వరము గలిగి, జపమాల, రామచిలుక, పద్మము, పుస్తకము ధరించిన సుందర హస్తములుగల ఓ వాణీ! నేలపై నెన్నుదురు తాకునట్లు వంగి నమ్రతతో నేను నీకు నమస్కరించెదను.
ఉ.
కాటుక కంటినీరు చనుఁ గట్టుపయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
హాటకగర్భురాణి నిను నాకటికిన్ గొనిపోయి యల్లక
ర్ణాటకిరాత కీచకులకమ్మ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ
తా॥ కైటభాసుర సంహారి ఆ శ్రీమహావిష్ణువు యొక్క ప్రియమైన కోడలివైన నా తల్లీ! సరస్వతీ నీ కాటుక కన్నులనుండి కారిన కన్నీరు నీ కుచద్వయముపై పడునట్లు రోదించెదవెందుకు? స్వర్ణగర్భుడైన ఆ బ్రహ్మ సతీమణీ! నిన్ను నా క్షుద్బాధ తీర్చుకొనుటకు తీసుకొనిపోయి అక్కడ యున్న ఆ కర్ణాట కిరాత కీచకులకు అమ్ముకోను. త్రికరణశుద్ధిగా చెప్పు నామాట నమ్ము.
ఉ.
అంబ నవాంబుజోజ్జ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్న దీపికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్తివివిక్తనిజ ప్రభావ భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి నన్ గృపఁ జూడు భారతీ.
తా॥ తల్లీ! నూతన పద్మము వలె ప్రకాశించు హస్త పద్మములు గల దాన, శరచ్చంద్రుని వెన్నెల వలె ఆడంబరమైన సుందర రూపముగల దేవీ, ధరించిన నగలయొక్క రత్నదీపముల వంటి వెలుగులు ముద్దిడుచున్న దిక్కులుగల అమ్మా వేదవిదితమైన సహజ సిద్ధ ప్రభావముగల దాన, భావగగన వీధిలో యధేచ్ఛగా విహరించు సరస్వతీ మాతా! నన్ను దయజూడుము.
ఉ.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేనరజతాచలకాశ ఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానఁగ నెన్నఁడు గల్గు భారతీ||
తా॥ ఓ సరస్వతీ దేవీ! శరత్కాల మేఘము (తెల్లగా) వలెను, చంద్రుని వలెను, కర్పూరము వలెను, పటిక వలెను, హంసవలెను, మల్లెల దండవలెను, మంచువలెను, సముద్రపు నురగవలెను, మంచుకొండ వలెను, ఆదిశేషుని వలెను, తెల్ల మందారము వలెను, పాల సముద్రము వలెను, తెల్లని పద్మము వలెను, ఆకాశ గంగవలెను, శుభకరమైన తెలుపు రంగుతో స్వచ్ఛముగా శోభించు నిన్ను నామనస్సున ఎప్పుడు చూడగల్గుదునో కదా!
మరిన్ని పూజా విధానాలు:
- శ్రీ హనుమాన్ పూజా విదానం
- సాయిబాబా పూజా విధానం
- శ్రీ వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
- శ్రీ రాఘవేంద్రస్వామి జప విధానము
- శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ట
- గాయత్రీ నిత్య పూజా విధానము