Naraduni Upadesam Vinandi In Telugu – నారదుని ఉపదేశం వినండి

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… నారదుని ఉపదేశం వినండి నీతికథ.

నారదుని ఉపదేశం వినండి:

(నారదుడి పేరు వినే సరికి చాలామంది ఫకాలున నవ్వుతారు. ఆయన విదూషకుడనీ, కలహ ప్రియుడనీ ఈ అభిప్రాయానికి కారణం యిటీవలి కాలపు నాటకాలు, సినిమాలు మాత్రమే. భారత, భాగవత, రామాయణాలలో కనిపించే నారదుడు దేవముని, భక్తి తత్త్వవేత్త, మహాజ్ఞాని. అటువంటి మహామహునికి విదూ షక రూపం కల్పించిన పుణ్యాత్ములకు నమస్కారం.)

మహాభారతంలో నారద మహర్షి దర్శనం మొదటిసారి సభా పర్వంలో లభిస్తుంది.

ఇంద్ర ప్రస్థంలో ధర్మరాజు మయసభా భవనంలో సింహాసనం మీద ఉండగా ఆ ఉత్సవం చూడడానికి వచ్చాడు నారదుడు.

ఆ మునీంద్రునికి ఎదురేగి స్వాగతం యిచ్చి, అసనంచూపి, అతిథి మర్యాదలు జరిపాడు, పాండవాగ్రజుడు.

అప్పుడా మునీంద్రుడు ఆనందంతో ఆశీర్వదించి:
‘ధర్మనందనా ! నిన్ను సింహాసనంమీద చూడడం సంతోషంగా ఉంది. అయితే యింతకు పూర్వం ఈ సామ్రాజ్యాన్ని పాలించిన నీ తండ్రి తాతలందరూ ఏ విధానాలు అవలంబించారో ఆ మార్గాలను విడనాడ కుండా ఉంటున్నావా? నీ రాజ్యంలో ప్రజలందరినీ సమానదృష్టితో చూసుకుంటున్నావా ? ధనలోభానికి లొంగి కొందరిని ప్రేమతోనూ, మరికొందరిని ద్వేషంతోనూ చూడడం లేదుకదా! ఆదిచాలా అనర్థాలకు దారి తీస్తుంది. చివరకు రాజుకే ముప్పు తెస్తుంది.

ఏ మానవుడయినా, ఉదయంపూట ధర్మకార్యాలు కొనసాగించాలి. మధ్యాహ్న సమయాల్లో ధన సంపాదన మార్గాలు ఆలోచించాలి. రాత్రి పూట కామభోగాలు అనుభవించాలి.

ఈ విధంగా సామాన్యులు నడవాలంటే మహారాజు వారికి మార్గ దర్శకంగా ఉండాలి.

ధనం ఉన్నదే-అది ఎక్కువయితే దురభ్యాసాలకు దారితీస్తుంది. దానికి లొంగుతున్నామంటే సర్వనాశనమే.

పగటిపూట నిద్రపోవడం, రాత్రి వేళల మేలుకొని ఉండడం అనారోగ్య కారణం.

మన మంత్రులు, కార్యనిర్వహణ పక్షులూ, నిర్మల మనస్కులూ, కుశాగ్ర బుద్ధులూ, నిస్స్వార్థ జీవనులూ అయి ఉండాలి సుమా !

ఉద్యోగాలు
వ్యక్తుల విద్య, వివేకంతో పాటు వారి శీల స్వభావాలు పరిశీలించి వారిని తగిన ఉద్యోగాలలో నిరమించాలి.

అధములకూ, మధ్యములకూ ఉన్నత పదవులు ఇచ్చి, ఉత్తము లను దిగువ శ్రేణిలో ఉంచరాదు. అందువల్ల పెద్ద పదవులలో ఎక్కిం చిన వారికి బాధ్యతలు తెలియవు. క్రిందికి దిగిన వారు అవమాన భారంతో ఉండి పాలనా యంత్రాంగాన్ని పాడుచేస్తారు.

మన బాధ్యతలు మనమే నిర్వర్తించాలి. అవి క్రింది వారిమీద విడిచిపెడితే వారు మనలను లోకువ చేసి మరీ క్రిందికి దింపుతారు.

నీ సేవలోని వారికి ఎప్పటి కప్పుడు జీతభత్యాలు సకాలంలో అందకపోతే వారు తిరుగుబాటు తెస్తారు. మన రక్షణకోసం, త్యాగాలు చేసే వారి పోషణ విషయంలో చాలా శ్రద్ధ చూపాలి. అలా దేశ ప్రజా రక్షణ కార్యంలో ప్రాణాలు బలిపెట్టినవా రుంటారు. వారి కుటుంబ పోషణ అంతా మనమే భరించాలి.

అలా చెయ్యకపోతే మళ్ళీ ఏ సేనాపతీ మన కోసం సాహసించడు. దేశ రక్షణ పాడయిపోతుంది. కనక పేనలోని వారి పోషణ ప్రధాన కర్త వ్యం.

మరొక ముఖ్యాంశం.
మన కొలువులో ఎందరో ఉద్యోగులుంటారు. వారిలో కొందరే మేధావులు. వీరు తమ ప్రతిభతో మనకు పేరు ప్రతిష్ఠలు తెస్తారు. అటు వంటి వారికి పెద్ద పెద్ద పదవులు యిస్తూండాలి. అంతే కాని అలాగే ఉంచితే వారి ఉత్సాహం పన్నగిల్లుతుంది. దానివల్ల రాజ్యానికి ముప్పు, అపఖ్యాతి.

అలానే దేశంలో అద్భుత సాహస కార్యాలు చేసేవారూ, మహా విద్వాంసులూ ఉంటారు. వారిని ఘనంగా సన్మానించాలి. విద్యా వంతులూ, ప్రతిభాసంపన్నులూ అయినవారు ఎప్పుడూ కొద్దిమందే ఉంటారు.

అటువంటి వాళ్ళు దేశానికి అలంకారం. అందుచేత వారి పోషణ భారం ప్రభుత్వమే వహించాలి.

దేశానికి రెండు రకాల ప్రమాదాలుంటాయి. అందులో మొదటిది గాలివానలూ, అగ్ని ప్రమాదాలూ, వరదలూ; వీటివల్ల కరువూ కాటకాలూ వస్తాయి. ఇవి ప్రకృతి వల్ల వచ్చే ప్రమాదాలు..

రెండవ రక –
దేశంలో సంస్కారం లేని మూఢులు పెరుగుతుంటారు. వారిలో పశుత్వం ఎక్కువ ఉంటుంది. రాజు బలవంతుడై ధీశాలిగా ఉంటే ఈ మూఢులు మూల మూలల్లో బ్రతుకుతారు. అలాకాక ప్రభువు కూడా మూఢుడైతే వీరు ప్రజలను హింసించి దోచుకు తినేస్తారు. ఒక్కోసారి రాజుకే ధన లోభం పుడితే రాజు పేరుమీద వీరే దోపిడి ఆరంభిస్తారు. అందుచేత అధికారంలోకి వచ్చేవాడు ఈ మూర్ఖుల సంఖ్య పెరగకుండా చూడాలి. చూడనివాడు పదవికి నీళ్ళు వదులుకోవాలి. పైగా నేరాలు చేసేవారిని ఎప్పటికప్పుడు కఠినంగా దండించకపోతే దేశంలో దొంగ తనాలూ, దొమ్మీలూ, హత్యలూ పెరిగిపోతాయి. ఏ సమయంలోనూ ద్రోహులను దండించకుండా విడువరాదు. విద్రోహుల మీద కనికరం చూపడం కంటే తెలివితక్కువ పని లేదని నువ్వూ వినే ఉంటావు ధర్మ నందనా.

దేశ ప్రజలకు అగ్ని ప్రమాదాల బాధ రాకుండా రాజు కాపాడాలి. అలానే వారి ఆరోగ్యానికి అవసరమైన సదుపాయాలూ, చక్కని మంచి నీరు దొరికే ఏర్పాట్లు ప్రభువే చెయ్యాలి.

దేశంలో వికలాంగులూ, ఆనాథులూ ఉంటారు. వీరం వరి రక్షణ, పోషణలూ ప్రభువే చూడాలి.

చివరగా ప్రజలనుంచి పన్నులు వసూలు చేసే వారిని సరయిన వారినే వెయ్యాలి. మంచి గంధపు చెట్లను కట్టెల కోసం పొడిచే మూర్ఖుల వలె పన్నులు పిండరాదు. పూలమాల కట్టేవాడు పూల తీగ కందకుండా పూలు కోసుకునేటట్లు మనం పన్నులు వసూలు చేసుకోవాలి.

దేశ దేశాల నుంచి మన దేశానికి వ్యాపారంకోసం వర్తకులు వస్తారు. వారిని పీడించి అధికంగా పన్నులు గుంజితే వారు మళ్ళీరారు. అలాకాక వారు పన్నులు ఎగగొట్టకుండా కూడా జాగ్రత్త పడాలి సుమా!

దేహం ఆరోగ్యంగా ఉండాలంటే శుచిగా వండిన ఆహారం మితంగా తీసుకోవాలి. దేహారోగ్యంతోపాటే మనస్సుకూడా నిర్మలంగా ఉండా అంటే అనుభవ సంపన్నులయిన విద్వాంసులతో, సత్పురుషులతో రోజూ కొంత సేపు సత్కాలక్షేపాలు చెయ్యాలి.

ధర్మనందనా ! ఇవన్నీ నీకు తెలుసు. అయినా చెప్పడం మా విధి అన్నాడు వారదుడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment