Gouthamudi Enugu In Telugu – గౌతముడి ఏనుగు

Gouthamudi Enugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతముడి ఏనుగు కథ. 

గౌతముడి ఏనుగు

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు..

మరిన్ని నీతికథలు మీకోసం:

Gautama Maharshi Katha In Telugu – గౌతమ మహర్షి కథ

Gautama Maharshi

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

వివిధ పురాణాల లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతమ మహర్షి కథ.

గౌతమ మహర్షి కథ

ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. “న హల్యతి ఇతి అహల్య”. అంటే ఎందులో నూ అఱకొఱలు లేనిది సాటిలేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవ్వడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ట నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్తకాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని ఆతనిని పరీక్షించుటకై “నాయనా! ఈ అతిలోక సుందరి నా పుత్రిక అహల్య.

ఈమెను నీ ఆశ్రమములో వదిలి వెళుతున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళతాను” అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్టికి ప్రీతిచేయుట కంటే అధికమేమున్నది తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించాడు. ఎంతో కాలము గడచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివభక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనికి అర్థాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు.

మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశ్శక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొకప్రాంతానికి వెళుతుంటారు. అలా ఒకసారి గౌతమ ఆహల్య దంపతులు త్ర్యంబకేశ్వరుని సన్నిధి వద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగినారు.

గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతములో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలినవారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తాలా ఒక వైపుకి వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసిన గౌతముడు ఆఱు నెలలు వరుణదేవునికై తీవ్ర తపస్సు చేసినాడు.

గౌతముడి పరోపకారబుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరినాడు. అప్పుడు ఆ వరుణుడు “ఓ మునీంద్ర! కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా! మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబద్ధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు” అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయజలం కోరాడు. వరుణుడు అక్షయజలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు.

అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్ర విజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.

ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్ర వీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపక పోవటమేకాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సర ముతో బాధ పడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనుకాడడు కదా!

గౌతముడు తప్పస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హానిచేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము!

ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. “స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్పు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.

గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు ఆదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.

మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండిత మండలిచే ఆమోద ముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి.

“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథిపై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరిపై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు.

గంగాదేవి కోరిక పై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరినది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

  1. ఈ ప్రపంచానికి ఆధారమైన నాలుగు పుణ్యస్తంభాలు: భూతదయ నిరహంకారం పరోపకారం ఇంద్రియ నిగ్రహమ్. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శపురుషుడు. బ్రహ్మదేవుని పరీక్షలో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని మనకు చూపినాడు. క్షామము నుండి ప్రాణులను కాపాడి తన దయ పరోపకార బుద్ధి చూపినాడు. సకల ధర్మరహస్యాలు తెలిసినా పండితుల వద్దకు వెళ్ళి ప్రాయశ్చిత్త విధానము తెలుసుకొని తన వినయవైభవాన్ని చాటినాడు.
  2. ప్రకృతిని క్షోభించకుండా మానవకళ్యాణము సాధించే విజ్ఞానము భారతీయులది. గౌతముడు భౌతిక విజ్ఞానానికి దైవికశక్తిని జోడించి ప్రజాశ్రేయస్సును కల్పించాడు.
  3. అహల్యాగౌతములు అసామాన్యమైన అతిథిసేవ చేసి మనకు మార్గదర్శకులైనారు. వారు రోజూ పరి కూరలు మొదలైనవి పండించి పండి ఆర్తులకు వడ్డించేవారు.
  4. కృతఘ్నతకు మించిన పాపములేదని పరమశివుడు చెప్పాడు. అట్టి వారి పాపానికి నిష్కృతిలేదని మనకు చెప్పాడు పరమేశ్వరుడు. కావున మనము ఎల్లప్పుడు కృతజ్ఞులమై ఉండాలి.
  5. ఈర్ష అసూయ మత్సరము మానవునిచే ఎట్టి దారుణపాపకృత్యాన్నైనా చేయిస్తాయి. కాబట్టి మనను ఈర్షకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని నీతికథలు మీకోసం: