Kapotha Kapothi Katha In Telugu – కపోత కపోతి కథ

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… కపోత కపోతి కథ.

కపోత కపోతి కథ

అడవిలో వేటకోసం వెళ్ళిన ఓ బోయవాడు కుండపోతగా వర్షం పడటంతో ఓ చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు మీద ఓ పావురాల జంట కాపురముంటున్నాయి. ప్రొద్దుననగా వెళ్ళిన కపోతి తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది కపోతం. ఆ పావురం అలసి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామాను చూసి భయపడింది. “ఎప్పుడో ప్రొద్దుననగా వెళ్ళింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో? నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా? అది లేని నా జీవనం శూన్యం శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతులోనో చిక్కలేదు. కదా” అని బాధపడింది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టిందికానీ చలి మృత్యుదేవతలా ఆ వనాన్ని కబళించింది. పావురం యొక్క శోకం విని ఆడ పావురం “ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ”! అని అన్నది. “హతవిధి! ఈ వలలో చిక్కుకున్నావా” అని బిగ్గరగా ఏడ్వసాగింది. మగ పాపురం.

“శరీరాలు శాశ్వతాలు కావు. మంచి ఒక్కటే మిగిలివుండేది. ఎల్లప్పుడూ మనకు తోడు పుండేదదే. ఆర్హుడైనవాని శరణుజొచ్చిన వాని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలంటారు. పాపం! ఈ బోయవాడు ఆర్హుడై మన గూటి దగ్గరకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి ఐన ఈతని సంగతి చూడు” మని ఆడ పావురం అమృత వాక్యాలు పలికింది.

వెంటనే ఆ బోయవాని ముందు నిలిచి ఆ కపోతశ్రేష్ఠుడిలా అన్నాడు “అయ్యా! నీవు బాగా అలసినట్టున్నావు. నేనేమి సేవ చేయగలనో చెప్పండి”. బోయవాడు “ఓ పావురమా! నీవెంత దయగలదానవు! చలితో నా శరీరం గడ్డకట్టుకు పోతున్నట్టుంది. ఈ చలినుండి నన్ను కాపాడు” అన్నాడు. పావురం వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలు తెచ్చి చలిమంట చేసింది. ఆ పావురం చేసిన సహాయానికెంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి తగ్గిన బోయవాడు “గువ్వా! ఎంతో ఆకలిగా వుంది” అన్నాడు. కొంతసేపాలోచించి “అయ్యా! పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదుకదా. “పరోపకారార్థం ఇదం శరీరం” అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేదీ ఇవ్వలేను. దీన్ని తీసుకుని మీ క్షుద్బాధ తీర్చుకోండి” అని బోయవాడు ఆశ్చర్యపోయి చూస్తుండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది పావురము.

ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయం అయ్యింది. “ఆహా! ఈ పావురము ఎంత గొప్పది! నా ఆకలి తీర్చుటకు తన శరీరాన్ని భార్యాపిల్లల్ని ప్రలోభాన్ని విడిచి శరీరం తృణప్రాయంగా ఎంచి ఆహుతిచ్చింది. ఏమి త్యాగం! ఏమి దయ! రూపంలో చిన్నదే ఐనా గుణంలో మేటిది. ఇక నేను హింస చేయను. మోహం విడుస్తాను” అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటినీ విడిచి పెట్టాడు. వెంటనే అగ్ని దగ్గరకు వెళ్ళి ఆ ఆడ పావురం ఇలా ఏడ్చింది “నీవు లేనిది క్షణమైనా మనజాలను. నాకెవరు దిక్కు? బ్రతుకులోను మరణంలోను నీతోనే ఉంటాను”. అగ్ని ప్రదక్షిణం చేసి శరీరత్యాగం చేసింది ఆ కపోతి. ఇంతలో ఓ దివ్య విమానము వచ్చి ఆ పావురాల జంటను ఊర్ధ్వలోకాలకు తీసుకొని వెళ్ళడం పూర్వ జన్మసుకృతం వలన ఆ బోయవాడు చూడగలిగాడు. కడకు అతడూ దివ్యత్వం పొందాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం:

దయ కరుణ పరోపకారం త్యాగం అనే పదాలకు నిర్వచనం చెప్పాయి పావురాలు. తనకు హాని చేసిన వేటగాడి సైతం కాపాడమని “అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడె ధన్యుడు సుమతీ” అని హితబోధ చేసింది. ఆకలిగొన్న వాడికి తన శరీరాన్నే ఆహారంగా సమర్పించిన పావురం యొక్క త్యాగం అద్వితీయం.

మరిన్ని నీతికథలు మీకోసం:

Leave a Comment