Ennadu Parushyapu Matalaadaradu In Telugu – ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

Ennadu Parushyapu Matalaadaradu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు కథ. 

ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు

నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు. హవిస్సులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు. కామ క్రోధాది అరిషడ్వర్గాలను జయించి సహస్ర దివ్యవర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక్క ఏడాది వాయుభక్షణ చేసి తరువాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు. అటు తరువాత ఒక్క ఏడాది సముద్రమధ్యములో ఒంటికాలుమీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యనిధి ప్రభావంవల్ల దివ్యవిమానములో దేవలోకానికి వెళ్ళాడు.

అక్కడ దేవర్షుల పూజలందుకొని బ్రహ్మలోకం చేరాడు. అక్కడ అనేక కల్పములు ఉండి బ్రహ్మర్షుల చేత పూజలందుకొన్నాడు! ఆ తరువాత ఇంద్రలోకాని వచ్చాడు. ధర్మాత్ముడు మహాతపశ్శక్తి సంపన్నుడు అయిన యయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయముగా వచ్చి అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరించాడు. మహావిభవోపేతుడైన ఇంద్రుడు ఆ యయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు “ఏమి తపస్సు చేశావయ్య మహానుభావా? నువ్వు సామాన్యుడవు కావు! శతసహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా?”.

సాక్షాత్ దేవేంద్రుడంతటివాడు ఇలా పొగిడేసరికి యయాతి ప్రారబ్ధవశాత్తు ఇలా పారుష్య వాక్యాలు అన్నాడు “ఓ అమరేంద్రా! సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సాటిరావు”. “ఔరా! ఇంత గొప్పవాడయ్యికూడా గర్వమును వీడలేదు కదా!” అని అనుకొని ఇంద్రుడు యయాతితో “మహనీయులైన మహర్షుల తపస్సులను గర్వముతో కించపఱచినావు. లోకశ్రేయస్సుకై తమ జీవితాలను ధారపోసిన ఆ మహనీయులనెన్నడూ అవమానించరాదు. ఓ యయాతి! ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకొన్న తపశ్శక్తి అంతా అంతరించిపోయింది. ఇక నీకు ఈ లోకములో ఉండటానికి అర్హతలేదు. అధోలోకానికి పో” అని శపించాడు.

తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపముతో శరణువేడి యయాతి “ఓ దేవేంద్రా! ఏ క్షణాన నేను పూజ్యులైన మహర్షులను అవమానించానో ఆ క్షణమే నా శక్తి అంతా కరిగిపోయింది. నన్ను అధోలోకాలకు పంపకు. నాకు సత్సంగత్యం లేకుండా చేయకు. సత్ భువనములో సత్పురుషుల సాంగత్యములో నన్ను ఉండనివ్వు” అని ప్రార్థించాడు. పశ్చాత్తాపముతో కుమిలిపోతున్న యయాతిని కరుణించి దేవేంద్రుడు యయాతికి సద్భువనములో నివసించుటకు అనుజ్ఞ ఇచ్చాడు.

సద్భువనములో ఉండి ఆ యయాతి అచిరకాలములోనే అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు. అహంకారమును పూర్తిగా విడిచి మహాతేజోమయుడయ్యాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దౌహిత్రులైన అష్టకుడు ప్రతర్దనుడు వసుమంతుడు ఔసీనరుడు మరియు శిబి సద్భువనమునకు వచ్చిరి. అనంతపుణ్యసంపదతో వెలిగిపోతున్న యయాతిని పూజించి “స్వామి! మీరెవరు” అని అడిగారు. యయాతి తన కథను చెప్పి “నాయనలారా! ఎంత కొంచెమైనా గర్వము ఎన్నడు ఉండరాదు. గర్వముతో నేను పారుష్యవాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను. మీరెన్నడు అట్టి తప్పుచేయవద్దు. వాక్పారుష్యము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది” అని హితవు చెప్పాడు. యాయాతిని తమ తాతగారిగా గుర్తించి నమస్కరించి ఆయనవద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

  1. గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కాలుగచేస్తాయి. ఒక్కచిన్న పారుష్యవాక్యము వలన తన తపశ్శక్తినంతా పోగొట్టుకున్నాడు యయాతి.
  2. ఎన్నడూ ఉత్తములను అవమానించరాదు. మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని అని యయాతి వారిని అవమానించాడు.
  3. ఒక సజ్జనుడెన్నడూ తప్పుచేయడు. పొరబాటుగా చేసినా దానికి పశ్చాత్తాపము చెంది ఆ తప్పు నెన్నడు మళ్ళీ చేయడు. సజ్జనుడైన యయాతి తను చేసిన తప్పును దౌహిత్రుల వద్ద చెప్పుకొని ఆ తప్పు చేయవద్దని హితవు చెప్పాడు.
  4. ఒక మనిషి యొక్క ఉద్ధారణకు సత్సంగత్యం చాలా అవసరము. ఈ విషయం తెలిసిన యయాతి సత్సంగత్య భాగ్యము కలిగించమి ఇంద్రుని కోరుకున్నాడు.

మరిన్ని నీతికథలు మీకోసం:

Gouthamudi Enugu In Telugu – గౌతముడి ఏనుగు

Gouthamudi Enugu

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీమహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… గౌతముడి ఏనుగు కథ. 

గౌతముడి ఏనుగు

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు..

మరిన్ని నీతికథలు మీకోసం: