Ma Duritamulu Vapi Mammu Gachu Taruda In Telugu – మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా

ఈ పోస్ట్ లో మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన : మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
సంఖ్య : 434
పుట: 292
రాగం: బౌళి

బౌళి

63 మా దురితములు వాపి మమ్ము గాచు టరుదా
శ్రీదేవిరమణుడ శ్రీ వేంకటేశ

||పల్లవి||

అంబరీషు పైకొన్న ఆపదలన్నియు బాపి
వెంబడి గాచే నీచే పెనుచక్రము
అంబరాననున్న ధ్రువు నజ్ఞానమెల్ల బాపి
పంబి నీచేతనుండిన పాంచజన్యము

||మా దురిత||

పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి
నిక్కము మధురనిల్పే నీచే గద
తొక్కి హిరణ్యకశిపు దునిమి ప్రహ్లాదు గాచే
నిక్కి నిక్కి మెరిసేటి నీ ఖడకగము

||మా దురిత||

వెడ రావణుని జంపి విభీషణుని గాచే
చిడుముడి పడక నీచే శాస్త్రము
యెడమీక శ్రీ వేంకటేశ నేడు నన్ను గాచె
బడిబడి నీ నామపఠన నేడిదిగో

||మా దురిత||434

అవతారిక:

ఓ శ్రీదేవివల్లభా! శ్రీవేంకటేశ్వరా! నీకు అన్ని ఆయుధాలు వున్నాయి కదా! ప్రభూ! మా పాపములను బద్దలుకొట్టి మమ్మల్ని కాపాడవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. శ్రీహరి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ, కౌమోదకి గద నందకము అనే ఖడ్గము, శార్జము అనే ధనస్సు యెన్నెన్నో ఘనకార్యాలు చేశాయి ఇదివరలో. ఇప్పుడు ఈ కలియుగంలో మా పాపాలే మా పాలిటి రాక్షసులు. వీళ్ళని నిర్మూలించటానికి నీ ఆయుధాలతో పనిలేదు, నీ నామపఠనం చాలు. అదే బడిబడి (దృఢమైన) దై మమ్మల్ని రక్షిస్తుంది అంటున్నారు. పంబి అంటే అతిశయించి అని అర్థం.

భావ వివరణ:

శ్రీదేవీ వల్లభుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! మా దురితములు (పాపములు) వాపి (నిర్మూలించి) మమ్మున్ కాచుట (రక్షించుట) అరుదా? (అంత అపూర్వమైన విషయమా తండ్రీ!)

ఇదిగో నీచే (నీచేతిలోనున్న) ఈ పెనుచక్రము (గొప్ప సుదర్శన చక్రము) నీ భక్తుడు అంబరీష మహారాజుపై ఆగ్రహించిన దుర్వాసనికి బుద్ధిచెప్పి, పైకొన్న ఆపదలను బాపి వెంటనే రక్షించింది కదా! మరి, నీ వామహస్తముననున్న శంఖము కనిపిస్తున్నదే… దానిపేరు పాంచజన్యము. దానిధ్వని పామరుల అజ్ఞానం మాన్పి నీవైపు త్రోవచూపిస్తుంది. అదిగో అంబరాన (ఆకాశంలో) ధ్రువతారయై కాంతులు జిమ్ముతున్న నీ బాలభక్తుడు ధ్రువుని అజ్ఞానం తొలగించి, నీచేత పంబి (అతిశయించి) వున్నది.

అదిగో నీచేతిలోనున్న “గద” దానిపేరు కౌమోదకము. అది నీ శత్రువులను దంచి నుగ్గాడుతుంది (తుత్తునియలు చేస్తుంది). ఆనాడు నీపక్కలో బల్లెమువలె మాటిమాటికి మధురపై దండెత్తి నీకు చీకాకు కలిగించుచున్న కంసుని మామగారు… జరాసంధుని అనేకసార్లు బలహీనుని చేసిన పిమ్మట నీచేతిలో నిక్కము (స్ఫుటంగా) మెరయుచున్నది. అదిగో నీచేతిలో నిక్కి నిక్కి (తొంగిచూస్తూ) మెరిసే ఖడకగము (ఖడ్గము). దానిపేరు నందకము. ఆనాడు నీవు నృసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి సంహరించి ప్రహ్లాదుని కాచినప్పుడు వాని అనుచరులు మూకుమ్మడిగా నీపై బడితే నీనందకం వారిని చీల్చి చెండాడినది. నేడు నీ చేతిలో మెరుస్తున్నది.

అదిగో సమీపమున నీచేత మెరయు నీ ధనస్సు. దానిపేరు శార్హము (సారంగము) అదే త్రేతాయుగంలో నీవు శ్రీరామచంద్రమూర్తివైనప్పుడు వెద (వేదించు) రావణాసురుని నిర్జించి నీ భక్తుడు విభీషణుని రక్షించి, చిడుముడి పడక (కలతపడకుండా) చేసినది. ఓ శ్రీవేంకటేశ్వరా! నేడు కలియుగంలో ఇదిగో, యెడమీ క (విశ్రాంతికూడా తీసికొనకుండా) నన్ను (నాబోటి ఆర్తులను…) బడిబడి (దృఢముగా) కాపాడుతున్న గొప్ప ఆయుధం. దానిపేరు “ఓం నమో వేంకటేశాయ” – ఆ నామపఠనమే నన్ను అనుక్షణం రక్షిస్తున్నది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment