Sravana Mangala Gowri Vratham (Puja, Katha) In Telugu – శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం (Mangala Gowri Puja). ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రావణ మంగళగౌరీ వ్రత విధానము గురించి తెలుసుకుందాం…

Sravana Mangala Gowri Vratham (Puja, Katha) In Telugu

శ్రావణ మంగళగౌరీ వ్రతకల్పం

పూజా సామాగ్రి

  • పసుపు
  • కుంకుము
  • పండ్లు
  • పూలు
  • తమలపాకులు
  • ఒక్కలు
  • అగరబత్తులు
  • కర్పూరం
  • గంధం
  • అక్షతలు
  • కొబ్బరికాయ
  • నేతి దీపము
  • తైలదీపము
  • వస్త్రము (ప్రత్తితో తయారు చేయవచ్చు)
  • నాలుగు తోరములు
  • 5 జ్యోతులు
  • కత్తి
  • ఇనుపకాడ
  • నానబెట్టిన శనగలు

నైవేద్యము

కొబ్బరి, పండ్లు, పిండి వంటలు

పూజా మంటపము

పసుపుతో గౌరిని, వినాయకుడిని చేసి రెండు తమలపాకుల మీద ఉంచాలి. అవే అన్ని మంగళవారములు వాడచ్చు. నీళ్ళు, ఉద్దరిణ, హరివాణం.

సాంప్రదాయ పద్ధతులు

1. ప్రాతః కాలం లేచి ఏర్పాట్లు చేయాలి.
2. స్నానము చేసాక 100 గ్రా. బియ్యం పిండి, 10 గ్రా. బెల్లం, నీళ్ళు కలిపి గట్టి ముద్ద చేయాలి (పిష్టము). దాన్ని 5 భాగాలు చేయాలి. 5 ప్రమిదలు చేసి నెయ్యి వేసి వత్తులు వేసి దీపం వెలిగించాలి.
3. దారం మూరెడు తీసుకుని 5 వరసలు తీసి, దానికి 5 గ్రంధులు (ముడులు) వేయాలి. ముడులలో పూవులు పెట్టచ్చు. 4 తోరాలు ఇలా (1 అమ్మవారికి 2 మీకు 3 కాటుక చేసే కత్తికి 4 మొదటి వాయనం ఇచ్చే స్త్రీకి) చేయాలి.
4. తల్లికి మొదటి వాయనం ఇవ్వాలి. కుదరని పక్షంలో ఎవరైన ముత్తైదువకి ఇవ్వాలి. దక్షిణ, పసుపు, కుంకుమ రవికె గుడ్డ యిచ్చి వీలుంటే భోజనం పెట్టాలి.
5. మొదటి సంవత్సరం 5 గురికి తర్వాత 10 మందికి ఇలా పెంచు కుంటూ పోవాలి. కుదరక పోతే ఐదుగురికే ప్రతి ఏడు ఇవ్వచ్చు.
6. వాయనం ఇచ్చే స్త్రీని గౌరీగా భావించి పాదాలకు పసుపు రాసి శెనగలు, పళ్ళు, పూలు, తాంబూలం కాటుక ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందాలి.
7. నెయ్యి జ్యోతులు (పిష్టము) సాయంత్రంలోగా తినాలి. మీరు తినలేక పోతే 5 సువాసినులకు వాయంనంతో కూడా యిచ్చి వాళ్ళని తినమనవచ్చు.
8. 5వ సంవత్సరం పూర్తి అయ్యాక ఉద్యాపనకి 32 అరిసెలు ఒక కొత్త పాత్రలో పెట్టి రవికె గుడ్డ వాసన కట్టాలి. పసుపు, కుంకుమ, మంగళ సూత్రాలు మట్టెలు పెట్టి ఎవరైనా పెళ్ళిలో కొత్త పెళ్ళికూతురుకి వాయనం ఇవ్వాలి.
9. మొదటి మంగళవారము పుట్టింట్లో చేసుకోవాలి. కుదరని పక్షంలో వాళ్ళింట్లోనే చేసుకోవచ్చు. పూజలో పెట్టిన దక్షిణ సొమ్మును ఎవరైనా బ్రాహ్మణుడికి గాని, కుదరని పక్షంలో ఏదైనా గుడిలో హుండీలో గాని ‘పరమేశ్వరి అర్పణం’ అని వేయాలి.

ఆచమనము

ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని మూడుమారులు ఆచమనము చేసి ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్ష జాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః.

ఉత్తిష్టంతు భూతపిశాచా య ఏతే భూమికారకాః,
ఏతేషా మవిరోధేన దేవికర్మ సమారభే. (అక్షతలు వెనుక వేసుకోవలెను)

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం – శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయే – త్సర్వవిఘ్నోపశాంతయే.
అయం ముహూర్తః సుముహూర్తోస్తు.

ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీవాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శ్రీశచీపురందరాభ్యాం నమః, శ్రీఅరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః

తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవః
విద్యాబలం దైవబలం తదేవః
లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి.

ప్రాణాయామం

ఓం భూర్భువః సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్, దేవి సవిత: ప్రసూవ, సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణ మపి.

ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా.
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా,
బ్రహ్మణి మ ఆత్మామృతత్వాయ
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాపిధాన మసీ, ఉత్తరాపోశనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధానమ నీయం సమర్పయామి.

యత్ర యోగేశ్వరః కృష్ణో – యత్ర పార్థో ధనుర్ధరః,
తత్ర శ్రీ ర్వీజయో భూతి – ధ్రువా నీతి ర్మతి ర్మమ.
స్మృతే సకలకల్యాణ – భాజనం యత్ర జాయతే,
పురుషస్త మజం నిత్యం – ప్రజామి శరణం హరిమ్.

సర్వదా సర్వకార్యేషు – నాస్తి తేషా మమంగళమ్,
లాభ స్తేషాం జయ స్తేషాం కుత స్తేషాం పరాభవః,
యేషాం హృదిస్థో భగవా – స్మంగళాయతనం హరిః.
ఆపదా మపహర్తారం – దాతారం సర్వసంపదామ్,
లోకాభిరామం శ్రీరామం – భూయో భూయో నమామ్యహమ్.

సంకల్పం

విష్ణు ర్విష్ణు ర్విష్ణు రితి సంస్కృత్య. పంచాశత్కోటి విస్తీర్ణమహీమండలే జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య… దిగ్భాగే, నద్యో ర్మధ్యప్రదేశ్ స్వగృహీ సమస్త దేవతాగోబ్రాహ్మణ హరిహర చరణసన్నిధౌ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే అష్టావింశతితమే కలియుగే, ప్రథమపాదే, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ………. నామ సంవత్సరే …………….. ఆయనే ………… ఋతా……………… మాసే ………………. పక్షే…………… తిధౌ………… వాసరే ……… …… శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శ్రీమతః ……..గోత్రస్య ……………. శర్మణః ధర్మపత్ని శ్రీమతిః గోత్రవతీ ……..నామధేయవతి, అహం యావజ్జీవసామంగల్య సిద్ధ్యర్ధ్యం మమ ……………. మమోపాత్తదురితక్షయద్వారా వివాహప్రథమవర్షాది పంచవర్ష పర్యంతం శ్రీమంగళగౌరీవ్రతం కరిష్యే | అదృశ్రీ మంగళగౌరీ దేవతాప్రీత్యర్ధ్యం సంభవద్భిర్దవ్యైః సంభవతా నియమేన ధ్యానావాహనది షోడశాపచారపూజాం కరిష్యే!॥ అని సంకల్ప మొనర్చి నీటిని విడువవలెను.

సంకల్పం (తెలుగులో)

నేను అనేక జన్మలనుండి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపములు హరించి పోవుటకు ఈశ్వరుని ప్రీతి కొరకు, శుభప్రదమైన ఈ ముహూర్తమందు శ్రీమహావిష్ణువు ఆజ్ఞ చేత సృష్టి కార్యము నిర్వహిస్తున్న ఇప్పటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క జీవితకాలంలోని రెండవ సగభాగం లో జరుగుతున్న శ్వేత వరాహకల్పమందు, అందులో వైవస్వత మన్వంతరము నందు, అందులో 28వ మహా యుగములోని కలియుగంలోని 4 భాగాలలోని మొదటి నాలుగవ భాగమందు ఈ విశ్వంలోని జంబూద్వీపమందున్న భరతవర్షమునందు భరత ఖండమందు, మేరు పర్వతమునకు దక్షిణ దిక్కునందు శ్రీశైల క్షేత్రమునకు …………….. దిక్కునందు, (కృష్ణా, గోదావరి, కావేరి) …………………. జీవనదుల మద్యనున్న భూభాగమందు, వసతి గృహమందు, (స్వగృహమైతే స్వగృహమందు) చాంద్రమాన ప్రకారంగా ఇప్పటి …………………….. సంవత్సరంలో దక్షిణాయనమందు, వర్షఋతువులోని శ్రావణ మాసంలో శుక్లపక్షము (పౌర్ణమి ముందైతే) కృష్ణపక్షము (అమావాస్య ముందైతే) మంగళవారమందు శుభమైన ఈ రోజున ………………….. గోత్రం, ………………. పేరు నాయొక్క, నాకుటుంబ సభ్యుల యొక్క అన్ని పాపములు నశించుటకు మాకందరికి క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యములు సిద్ధించుటకు, ధర్మము, ధనము, కోరికలు, మోక్షము అనే నాలుగు పురుషార్ధములు సిద్ధించుటకు ప్రత్యేకించి నేను నా జీవిత పర్యంతము పసుపు కుంకుమలతో సుఖముగా జీవించుటకు, మంచి ప్రవర్తన కలిగిన కుమార్తెలు, కుమారులు, మనుమలు, మనుమరాళ్ళు కలుగుటకు, శ్రావణ మంగళ గౌరి ప్రీతి కొరకు, నాశక్తి మేరకు నేను ఏర్పాటుచేసిన పూజా ద్రవ్యములతో, యథా శక్తిగా శ్రీసూక్తమంత్రములతో, కలశములోని శ్లోకములతో అమ్మవారికి 16 ఉపచారములతో కూడిన పూజను, ఆ పూజ తర్వాత కథా శ్రవణమును చేయుచున్నాను. ఏ విఘ్నములు లేకుండా పూజ జరుగుటకై వినాయకుని పూజచేస్తున్నాను.

కలశపూజ

తదంగం కలశారాధనం కరిష్యే, కలశం శుద్ధోదకైః గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య – (పరిశుద్ధమైన నీరు నింపిన కలశమును గంధముతోడను, అక్షతల తోడను అలంకరించవలెను. అలంకరించిన పూవును నీటిలో వేసి (మధ్యవేలు పక్కవేలుతో పూవు పట్టుకొని నీటిలోకదుపుతూ క్రింద శ్లోకమును పఠించవలెను. అనంతరము కుడిచేతి వ్రేళ్ళతో కలశమందలి జలమును తాకుచు ఈ క్రింది శ్లోకములను శ్రద్ధగా పఠించవలయును.)

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః,
మూలే తత్ర స్థితో బ్రహ్మా – మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే – సప్తద్వీపా వసుంధరా.
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే – కలశాంబు సమాశ్రితాః,
గంగే చ యమునే కృష్ణా – గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి – జలేస్మి స్సన్నిధిం కురు॥

ఆయాంతు శ్రీమంగళగౌరీ పూజార్ధం మమ దురితక్షయ కారకాః.
కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య

ఈ విధముగా చదివి కలశములోని జలమును పూజాద్రవ్యములపై చల్లి, తరువాత తన తలపై చల్లుకొనవలయును. అనంతరము పసుపుతోగాని, స్వర్ణముతోగాని సిద్ధము చేసికొనిన గౌరీదేవిపై కలశోదకమును చల్లవలెను

అథగణపతిపూజా

మంత్రః: గణానాం త్వా గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తమం,
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత,
ఆ న శ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్.

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయో రర్ఘ్యం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, ఓం ఆపో హిష్టామయోభువ స్తాన ఊర్జే దధాతన, మహేరణాయ చక్షసే.
యో వ శ్శివతమో రస స్తస్యభాజయతేహ నః,
స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
అభివస్తా సువసనా న్యరాభిధేనూ స్సుదషూః పూయమానః,
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవ సోమ.
శ్రీ మహాగణాధిపతయే నమః, వస్త్రయుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజేపతే ర్యత్సహజం పురస్తాత్,
ఆయుష్య మగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం,
యజ్ఞోపవీతం బల మస్తు తేజః,
శ్రీ మహాగణాధి పతయే నమః,
యజ్ఞోపవీతం సమర్పయామి,
గంధద్వారాం దురాధరాం,
నిత్య పుష్టాం కరీషిణీం,
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపవ్వాయే శ్రియమ్.

శ్రీ మహాగణాధిపతయే నమః, దివ్యశ్రీచందనం సమర్పయామి.

ఆయనే తే పరాయణే, దూర్వా రోహంతు పుష్పిణీః,
హ్రదాశ్చ పుండరీకాణి, సముద్రస్య గృహే ఇమే.
శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి.

పుష్పైః పూజయామి

ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్న రాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

ధూపాదయః

శ్లో॥ వనస్పత్యు దృవైర్ణివ్యై, ర్నానాగంథై స్సుసంయుతః, ఆమ్రేయ స్పర్వదేవానాం, ధూపాయం ప్రతిగృహ్యతామ్.
శ్రీ మహాగణాధిపతయే నమః, ధూపమాఘ్రాపయామి,
సాజ్యం త్రివర్తిసంయుక్తం, వహ్నినా యోజితం ప్రియం, గృహాణ
మంగళం దీపం, త్రైలోక్య తిమిరాపహమ్.
భక్త్యా దీపం ప్రయచ్ఛామి, దేవాయ పరమాత్మనే,
త్రాహి మాం నరకా దోరా దివ్య జ్యోతి ర్నమోస్తుతే.
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి, ధూపదీపానంతరం
శుద్దాచమనీయం సమర్పయామి.

నైవేద్యం

(నైవేద్యమును సమర్పించుచు ఈ క్రింది మంత్రమును చదువవలెను.) ఓం భూర్భువ స్సువః – ఓం తత్ సవితు ర్వరేణ్యం; భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. (ఋతం త్వా సత్యేన పరిషించామి – అని రాత్రి చెప్పవలెను.)
శ్రీమహాగణాధిపతయే నమః, నైవేద్యం సమర్పయామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి, ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోశనం సమర్పయామి – హస్తా ప్రక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్ధాచమనీయం సమర్పయామి.

శ్లో॥ పూగీఫలై స్వకర్పూరై, రాగవల్లీదలై ర్యుతం
ముక్తా చూర్ణసమాయుక్తం, తాంబూలం ప్రతి గృహ్యతామ్
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి.
గణానాం త్వా గణపతిగ్ం హవామహే,
కవిం కవీనా ముపమశ్రవ స్తవం.
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత,
ఆ న శ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్.
శ్రీ మహాగణాధిపతయే నమః
సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ త్సమర్పయామి,
యస్య స్మృత్యా చనామోత్తా శ్రీ తపః పూజా క్రియాదిషు,
న్యూనం సంపూర్ణతాం యాతి, సద్యో వందే త మచ్యుతమ్.
మంత్రహీనం క్రియాహీనం, భక్తిహీనం గణాధిప,
య త్పూజితం మయా దేవ, పరిపూర్ణం తదస్తు తే.

అనయా ధ్యానావాహనాదిషోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్యవిఘ్ను మస్త్యితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు. శ్రీగణాధిపతిప్రసాదం శిరసా గృష్ణమి.

శ్లో॥ సహస్రపరమా దేవీ, శతమూలా శతాంకురా,
సర్వగ్ం హరతు మే పాపం, దూర్వా దుస్స్వప్న నాశనీ,
గణపతిం యథాస్థాన ముద్వాసయామి. యజ్ఞేన యజ్ఞమయజంత
దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్,
తేహ నాకం మహిమాన స్పచంతే,
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః.

పంచలోకపాలకపూజా

ఆచమ్య, పుర్వోకై వంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ ప్రతాంగం గణపత్యాదిపంచలోకపాల కపూజాం, ఆదిత్యాది నవగ్రహపూజాం, ఇంద్రాద్యష్టదిక్పాల కపూణాం చ కరిష్యే.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముప క్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ స్పతి, ఆ న శ్శృణ్య మ్నాతిభి స్సీదసాదనమ్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రపరివార సమేతం గణపతిం లోక పాలక మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం బ్రహ్మా దేవానాం, పదవీః కవీనా, మృషి ర్విప్రాణాం మహిషో, మృగాణాం, శ్యేనో గృధ్రాణాగ్ం స్వదితిర్వనానాగ్ం, సోమః పవిత్ర మత్యేతి రేషన్. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బ్రహ్మాణం లోకపాలక మావాహయామి, స్థాపయామి పూజయామి.

ఓం ఇదం విష్ణు ర్విచక్రమే, త్రేధా విదధే పదం, సమూఢ మస్యపాగ్ం సురే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం విష్ణుం లోకపాలక మావాహయామి, స్థాపయామి, పూజయామి.

ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసీ, వోచేమ శంతమగ్ం హృ దే. సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం రుద్రం లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి.

ఓం గౌరీ మిమాయ సలిలాని తక్ష త్యేకపదీ ద్విపదీ సా చతుప్పదీ, అష్టాపదీ నవపదీ బభూవుషీ, సహస్రాక్షరా పరమేవ్యోమన్. సాంగం సాయుధాం సవాహనాం స శక్తిం పతి పుత్ర పరివారసమేతాం గౌరీం లోకపాలికా మావాహయామి, స్థాపయామి పూజయామి.

గణేశాది పంచలోకపాలకదేవతాభ్యోనమః, ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూప మాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.

గణేశాది పంచలోకపాలక దేవతాప్రసాద సిద్ధి రస్తు.

తదుపరి ఇక్కడ గౌరి దేవి పూజ చేయవలెను

శ్రీ గౌరి దేవి పూజ

అథాంగ పూజా

  • ఉమాయై నమః – పాదౌ పూజయామి
  • గౌర్యై నమః – జంఘే పూజయామి
  • పార్వత్యై నమః – జానునీ పూజయామి
  • జగన్మాత్రే నమః – ఊరూ పూజయామి
  • జగత్ప్రతిష్ఠాయై నమః – కటిం పూజయామి
  • మూల ప్రకృత్యైనమః – నాభిం పూజయామి
  • అంబికాయై నమః – ఉదరం పూజయామి
  • అన్నపూర్ణాయై నమః – స్తనౌ పూజయామి
  • శివ సుందర్యై నమః – వక్షః పూజయామి
  • మహాబలాయై నమః – బాహూ పూజయామి
  • వరప్రదాయై నమః – హస్తా పూజయామి
  • బ్రహ్మవిద్యాయై నమః – జిహ్వాం పూజయామి
  • శాంకర్యై నమః – ముఖం పూజయామి
  • రుద్రాణ్యై నమః – కర్ణా పూజయామి
  • సర్వమంగళాయై నమః – లలాటం పూజయామి
  • సర్వేశ్వర్యై నమః – శిరః పూజయామి
  • శ్రీ మంగళ గౌర్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి

అక్షతలను, పువ్వులను జల్లుచు తల్లి మంగళగౌరీ దేవిని పూజించుచుండవలెను.

అష్టోత్తరశతనామావళీ

శ్రీ మంగళగౌరీ అష్టోత్తరశతనామావళిః 
శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

శ్లో॥ హ్రీంకారేశ్వరి ! తప్తహాటకకృతే స్థాలీసహసైరృృతం
దివ్యాన్నా మృతసూపశాకభరితం- చిత్రాన్నభేదం తథా
అన్నం తే మధుశర్కరాదధియుతం – మాణిక్యపాత్రే స్థితమ్
మాషాపూవనసహస్రకంచ సఫలం నైవేద్య మావేదయే.

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః మహానైవేద్యం సమర్పయామి అని చదువుచు కళాశాంతర్గత జలమును తన కుడిదిక్కుగా చల్లుకొనవలెను. అనంతరము ఏయే పదార్ధములు నైవేద్యముగా పెట్టుచుండిమో ఆయా పదార్థములపై పువ్వులతో కలశమునందలి నీరుజల్లవలెను. వానిచుట్టు వీరు త్రిప్పవలెను. ‘అమృతమస్తు’ అనుచు కలశోదకమును పళ్ళెములో వేయవలెను. ‘అమృతోపస్తరణమసి’ అని శ్రీ మంగళ గౌరిదేవికి పదార్థములు సమర్పించవలెను.

ఓం ప్రాణాయ స్వాహా – ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా – ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా ॥
అని చెప్పి ఎడమచేయి ఆనించి కుడిచేతిలో ఒక పువ్వునుంచుకొని శ్రీశ్రీ మంగళగౌరీదేవికి నైవేద్య మొసగవలెను.
మధ్యే మధ్యే ఉదకం సమర్పయామి.
అమృతాభిధానమసి, ఉత్తరపోశనం సమర్పయామి.
హస్తా ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ్యాచమనీయం సమర్పయామి అని అయిదుసార్లు ఒక పువ్వుతో ఉదకము జల్లవలెను.

హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ముఖమండనార్ధం తాంబూలం సమర్పయామి.
అనుచు వివిధ సుగంధ ద్రవ్య పరిమళ సంయుతమైన తాంబూలమును మంగళగౌరి చెంత నుంచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీదేవతాయై నమః
ఆనంద నీరాజనం సమర్పయామి.
అని హారతి వెలగించి మహిమాన్వితశక్తి అయిన దేవికి చూపించుచు మంగళహారతి పాడవలెను.

మంగళహారతి

చల్లని చూపులతో ఎల్లవారల బ్రోచు మంగళగౌరికి జయమంగళం
ఎల్లవేళల బ్రోచే ఉల్లమునగల అమ్మ మంగళగౌరికి శ్రీమంగళం
శ్రద్ధతో పూజించి భక్తితో ప్రార్ధించ
వెంటనే దయచూపు దేవి మా అంబికకు

||జయ||

వృద్ధులూ, పిన్నలూ అందరూ హృదయాల ధ్యానించు గారికి

||జయ||

సర్వశోకమ్ములూ సర్వవిధ బాధలూ
పూజించ తొలగించు మాతల్లి గారికి
సర్వవేళల గాని ఏ వేళను గాని పూజించ మేలేయు తల్లి మా గారికి
పాపములనెల్ల పటాపంచలుగ జేయుచూ
కరుణనే వర్షించు దయామతల్లికి

||జయ||

లోపములు పూజలో ఏపగిది జరిగినా కోపపడనీ తల్లిమంగళగౌరికీ

॥జయ॥

హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
అని పువ్వులను దేవికి అర్పించి నమస్కారము చేయవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
ఛత్రం సమర్పయామి అని పుష్పములు సమర్పించవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
చామరై ర్వీజయామి – అని చామరముతో వీచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
గీతం శ్రావయామి – అని మధురముగా పాడవలెను
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
నానావిధరాజోపచారాన్ సమర్పయామి
అని కొన్ని పువ్వులను దేవిచెంత నుంచవలెను.
హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః
నమస్కారాన్ సమర్పయామి.

అని తల్లిని మనస్సున ధ్యానించుకొనుచు నమస్కారము నొనరించవలెను.

శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి।
తత్పర్వం క్షమ్యతాం దేవి! కాత్యాయని। నమో స్తుతే॥
సర్వం శ్రీ శ్రీ మంగళగౌరీ దేవ తార్పణమస్తు.

అనయా మయా కృతయా పూజయా శ్రీమంగళగౌరీదేవి సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు – అని జలాక్షతలను విడుచుట చేయవలెను.

తరువాత బెల్లము, శనగలు, రవికె గుడ్డ, పువ్వులు, పండ్లు తగు దక్షణ మొదలగువానితో నింపబడిన వెదురు బుట్టవంటి దానిని బ్రాహ్మణునకు భక్తి శ్రద్ధలతో దానమీయవలెను.

తరువాత, ముందు గౌరిదేవికి నివేదించిన శనగలు మొదలైన వానిని గ్రహించి …..

కాత్యాయనీ శివా గౌరీ సావిత్రీ సర్వమంగళా సువాసినీభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు ॥
అనుచు ముత్తయిదువులకును, తన మాతృదేవతకును వాయనముల నియవలయును.

అనంతరము 16 వత్తులు గల ఆవునేతి దీపాలు వెలుగజేసి తరువాత కథ వినవలెను. కాటుక ధరించి దేవీ ప్రసాదముగు పూవును తలయందును, కుంకుమను నుదుటను ధరించవలెను.

శ్రీమంగళగౌరీ పూజావిధానము సంపూర్ణము 

శ్రీ శ్రావణమంగళగౌరీ వ్రత కథ

ఒకప్పుడు సూత మహాముని శౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవి కుపదేశించిన మంగళగౌరీ వ్రత కథయు, పూజావిధానమును, ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు.

“ద్రౌపదీ! పరాశక్తియే మంగళగౌరీగ పేరు పొందింది. ఏ స్త్రీల పైనైతే మంగళగౌరీ దేవి కటాక్షము ఉంటుందో వారికి వైధవ్యము ఉండదు. సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి. ఈ పూజను శ్రావణ మాసములో వచ్చే మంగళవారములు చేయాలి.

మంగళగౌరిదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోను ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ భాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు.

త్రిపురాసురుని చంపటానికి వెళ్ళే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మను వంశజుడైన ‘మండు’ డనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావము వల్లనే చాలా కాలము భూలోకములో సర్వసంపదలతో రాజ్యమేలాడు.

అతనికి అటువంటి గౌరీదేవిని పూజించి, వైధవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను. చాలా కాలము కిందట మాహిష్మతీ నగరాన్ని జయపాలుడనే రాజు పాలించుచుండెను. అపైశ్వర్యములు ఉన్నా పిల్లలు లేరు. అందు కోసం అతను బాధపడని రోజు లేదు, చేయని పూజలు లేవు. నోచని నోములులేవు. మొక్కని దేవుడు లేడు, చేయని పుణ్యకార్యము లేదు. కాని ఫలితం మాత్రం శూన్యం.

చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి, ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చుని ‘భవతీ భిక్షాం దేహి’ అని పిల్చాడు. కాని జయపాలుని భార్య పళ్ళెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు. ఇలా వరసగా మూడు రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ‘ఓ భార్యామణీ! అతడు ప్రతిరోజూ మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చో! అతను రాగానే వేయచ్చు’ అన్నాడు.

ఈ సలహా బాగుందనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదింకా! అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పళ్ళెంతో ఎదురెళ్ళినా ఆ సన్యాసి ‘పుత్ర పౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు! అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కాని, భిక్షకాని స్వీకరించము’ అన్నాడు. అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకోమని బతిమాలింది. అందుకా సన్యాసి ‘నేను చెప్పబోయేది శ్రద్ధగా విని వీభర్తకు చెప్పు నీకోరిక తీరుతుంది’ అన్నాడు.

‘నీ భర్తను తూర్పువైపు ఒంటరిగా వీల వస్త్రం ధరించి, వీలం గుఱ్ఱం పైన వెళ్ళమను. అతని గుఱ్ఱం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వనును. అక్కడ ఒక బంగారు దేవాలయముంటుంది. అందులోని భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్థాన మయ్యాడు. జయపాలుడు కూడా స్వామి చెప్పినదంతా తూచా తప్పకుండా పాటించి భవాని దేవాలయమున భవానిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవాని ప్రత్యక్షమయి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి! ‘వైధవ్యము కల కూతురు కావాలా ? అల్పాయుష్కుడు, సజ్జనుడైన కొడుకు కావాలా ?’ అంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడాదేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడిచెట్లు మీది ఫలాన్ని అతని భార్య కిమ్మని చెప్పి అంతర్ధాన మయింది. జయపాలుడు ఆశకొద్దీ దాని మీదున్న పండ్లవ్నీ కోసాడు. కాని అన్నీ మాయమయి ఒక్కటే మిగిలింది. గణపతికి అలాకోసి నందుకు కోపం వచ్చి నీ ఈ చర్యవల్ల నీకు పుట్టబోయే కొడుకు పదహారో ఏటనే పాము కాటువల్ల మరణిస్తాడని శాపం ఇచ్చాడు.

ఫల ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ‘శివుడు’ అని నామకరణ చేసారు. అతన్ని అల్లారుముద్దుగా పెంచు కుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్షు తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య తన ముద్దుముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగి రమ్మని కోరింది. ‘ఈశ్వర వరప్రసాదుడు’ కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు.

తల్లి ఎందుకో దుఃఖిస్తూండటం చూసి శివుడు కారణమడిగాడు. తల్లి అతని జన్మ వృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ‘నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను. నువ్వు చింతపడకు. నాకు తోడుగా మామయ్యని పంపు. కాశీకి పాయి విశ్వేశ్వరుని వేడుతాము’ అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజూ పూజచేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు.

త్రోవలో వాళ్ళు ప్రతిష్ఠాన పురము చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలుకోస్తూంటే అందులో ఒకమ్మాయి సుశీల అనే అమ్మాయిని ‘ముండ’ ‘రండ’ అని తిట్టింది. దానికా సుశీల మా అమ్మ మంగళ గౌరీ వ్రతం చేస్తుంది. కాబట్టి మా వంశంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని కోపంగా అంత వరకూ కోసిన పూలనునేల మీదికి విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్లమీదకి చేరిపోయాయి.
ఈ వింత చూసిన శివుడు ‘ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది. ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును” అనుకున్నాడు.
సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజచేసి ‘ఓ దేవదేవా! మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి!’ అని వేడుకున్నారు. అలా వేడుకుని గుడి బయటకి రాగానే కనిపించిన స్పురద్రూపి యైన శివుడ్ని చూసి, అతని పేరు ‘శివుడు’ ని తెలుసుకొని ఆ పరమ శివుడే ఈ శివుడ్ని పంపారని భావించి, అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్ళి జరిపించారు. వాళ్ళపెళ్ళిలో సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్యాపన చేసింది.

తర్వాత భార్యా భర్తలు భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి ముత్తయిదువు రూపంలో సుశీలకి కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు. ఈ రాత్రితో అతని ఆయువు మూడింది. నేను చెప్పినట్లు చేయి. కాసేపటికి ఒక కృష్ణసర్పము అతని కాలేయటానికి వస్తుంది. నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు. ఆ పాము ఆ కుండలో కెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి, మీ అమ్మకు దానిని వాయనంగా ఇయ్యి. నీ భర్తకి గండం గడుస్తుంది! అన్నది.

సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లే జరిగింది. కాళ్ళపారాణి ఇంకా ఆరని పాదం, తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగా నున్న కుండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపడిపోయింది. అతను చూసుకోలేదు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారక ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధికోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపాయాడు, భార్యకి ఏవివరం చెప్పకుండానే. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఖిన్నురాలై అతని చేతినుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది.

ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిధిమర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకి రోజూ కాళ్ళు కడుగు తుండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. దోవలో అతనికి, తను చనిపోతునట్లూ అప్పుడు మంగళగౌరియు, యమదూతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్ఠాన పురం కొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతుండగా గుర్తుపట్టి, అతనే తన భర్త అని తల్లిదండ్రులకి చెప్పింది. తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవకృపవల్ల ఆ కాళ్ళపారాణి ఆరని కాలిగుర్తు అతని తొడమీద కనబడింది. శివుడు కూడా తను ఎందుకుఅలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు.

పుట్టింట్లో మంగళగౌరీ నోము నోచుకుని, భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల. అన్నాళ్ళుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లితండ్రులు అంధులై పోయారు. సుశీల మంగళ గౌరీ నోములో పట్టిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది. కొడుకుని తిరిగి కళ్ళారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్షు ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు.

దానికంతా కారణం తాను నోచిన నోములేనని మంగళగౌరీ కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు. ఆపురుషుడికి మంచి ఆయుష్షు లేకపోయినా అతన్ని చేసుకున్న భార్యాశిరోమణి చేసిన పుణ్యకార్యాలవల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం వెల్లడి అవుతోంది.

ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు. ఓ ద్రౌపదీ! మంగళగౌరీ వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసికొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు.

వ్రత ఉద్యాపనం

ఈ వ్రతం పెళ్ళి అయిన సంవత్సరం నుంచి ప్రారంభించి, అయిదు సంవత్సరాలు చేయాలి అయిదవ సంవత్సరం ఆఖరి శ్రావణ మంగళ వారమున పగటి వేళ మంగళగౌరిని యథావిధిగా పూజించాలి. దంపతులు ఉపవాసం ఉండాలి. రాత్రివేళ మంటపము మొదలైనవి పెట్టి, అక్కడ 16 కలశాలు పెట్టాలి. అందులో ఉమా మహేశ్వరులని, బ్రహ్మని, విఘ్నేశ్వరుని, స్కందుని, శేవీ పురందరులని, సప్త మాతృకలను, సావిత్రిని, లక్ష్మీనారాయణులని, సర్వ దేవతలను, నవగ్రహములను పూజించాలి. శక్తి లేకపోతే 5 కలశాలే చాలు. లేదా 2 పెట్టినా చాలు. మర్నాడు స్నానం చేసి బెల్లము, జీలకఱ్ఱ, పరమాన్నము, నెయ్యి, రావి సమిధలు, గరికపోచలతో హోమము చేయాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్ర్యంబకే దేవి ! నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవిజ్ఞాన సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధనా శ్శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ అను మంత్రమే ప్రధానము. 6 పాత్రలలో, మంగళ ద్రవ్యాలతో ముల్లై దువులకు వాయనములు ఇవ్వాలి.

16 వత్తుల దీపములు పదహారింటిని వెలిగించాలి. ముత్తైదు వులను, దంపతులను భోజన చందన తాంబూలాది సత్కారములతో పూజించి ఆనంద పరచాలి. ఇది చాలా మహిమగల వ్రతము. ఈ నోము నోచుకున్న వారందరూ మంగళగౌరి కృపతో ‘యావజ్జీవ మాంగల్య సౌభాగ్య పుత్ర పౌత్ర ఆయురారోగ్యములతో వర్థిల్లుగాక.’ ప్రతి సంవత్సరం మొదటి మంగళవారం చేసిన పసుపు గౌరిని, గణపతిని అన్ని వారాలకి వాడచ్చు. అన్ని వారాలు అయ్యాక ‘మహాగణపతయే సర్వమంగళ రూప మంగళ గౌర్యై ఉద్యాపన సమర్పయామి’ అని ఉద్యాపన చేయాలి.

మరిన్ని వ్రతాలు:

Leave a Comment