ఈ పోస్ట్ లో శిన్నెక తేవే శెలువుని తా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శిన్నెక తేవే శెలువుని తా – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 5
కీర్తన: శిన్నెక తేవే శెలువుని తా
సంఖ్య : 268
పుట: 183
రాగం: మేచబౌళి
మేచబౌళి
83 శిన్నెక తేవే శెలువుని తా
వెన్నలు సవిగొను వెన్నుని తా
||పల్లవి||
మూటల్ మాటల్ మూరల్ బారల్
బాటల్ సదివే బాపలు తా
వేటల్ వీపుల్ వేలుపు గుడుపుల్
తేటలు మరగిన దేవుని తా
||శిన్నెక||
వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్లిటి సుద్దుల్తా
పోకులు లోకుల్ పొగడఁగ మనిపెడి
కేకిగరుల తల కిష్టుని తా
||శిన్నెక||
బగ్గుల్ నగ్గుల్ బావుల్ సొరె (ర?) గా
దగ్గర వెరపగు తపసుల తా
సిగ్గుల్ వాపెడి శ్రీ వేంకటపతి-
నగ్గపు సొమ్ములయాతని తా
||శిన్నెక||
అవతారిక:
జానపదుల బాణీలో కొనసాగే అన్నమాచార్యులవారి కీర్తననాస్వాదించండి. ఒక గోపిక ఇంకొక గోపికను శిన్నెక అనిపిలిచి తన చెలికాడైన ‘కిష్టుని’ (కృష్ణుని) తీసికొని రమ్మని వేడుకొంటున్నది. వాడు వెన్నల నారగించేవెన్నుడట. ఆతనిని తెమ్మంటున్నది. ఈ కీర్తనలో తా అని ప్రతిచరణం ముగిసినందువలన ‘తా’ అనునది తాళము కోసం తాలద్యోతకమని తోచుచున్నది. చరణములలో కొన్ని మాటలు ధ్వని ప్రధానమైనవి. కావున చిందేసే ఆటకు ప్రత్యేకించినవే. కీర్తన ప్రతిపదార్థం అసంభవమని నా భావన.
భావ వివరణ:
ఓ శిన్నెకా! (చిన్నక్కా!) శెలువుని (చెలికాడైన ఈ శ్రీకృష్ణుని) తేవే (నాయెదుటకు తీసికొనిరావే). ఈతడెవరో తెలియునా? చిన్నప్పుడు ఇంటింటా వెన్నదొంగతనం చేసి, చవిగొన్న (రుచి మరిగిన) వెన్నడు (శ్రీకృష్ణుడు).
ఈ అల్లరి పిడుగుకు ఆనాడు, మాటలు మూటలుగా వుండేవి. అవి బారులు, మూరలు (బారెడు మూరెడు మాటలు… అంటే… పెద్దగా ఆరిందలా మాట్లాడేవాడు.) బాటలు సదివే బాపలు తా (వేదపండితులమని విఱ్ఱవీగే బ్రాహ్మణులకు హితోపదేశము చేశాడు.) వేలుపు కుడుపులు (దేవతల కివ్వవలసిన నైవేద్యము) ఇవ్వలేదని అలిగిన దేవేంద్రుడి దేవతల వీపులు సాపుచేసి వేటాడినాడట. ఎందుకంటే ఈయన తేటలు మరిగిన దేవుని తా (ప్రసన్నత అతిశయించిన దేవదేవుడట).
ఈ చరణానికి అన్నమయ్య భావన సులభగ్రాహ్యము కాదు. నా భావన నా స్ఫురణయే..)
తొల్లిటి సోకపు సుద్దులు (దేవతల తొలినాటి కష్టములు) తొలగించుటకు కేకిగరులతల కిష్టుడు (నెమలి పింఛమును తలపై ధరించిన శ్రీకృష్ణుడు, లోకులు పొగడగ పోకులు (లీలలు) ప్రదర్శించాడు.
దుర్మార్గులు పెట్టు అంతరాయములు పోయి వెఱపగు తాపసుల (భీతిల్లిన మునుల) దగ్గరయై ప్రశాంతముగానున్నారు. దివ్యాభరణములు ధరించిన శ్రీవేంకటేశ్వరుడు భక్తుల సిగ్గులు బాపెడి పరమపురుషుడు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: