Sri Venkateswara Sri Alamelmanga Thoda In Telugu – శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : శ్రీ వేంకటేశ్వరుడు శ్రీయలమేల్మంగతోడ
సంఖ్య : 240
పుట 150
రాగం: సాళంగనాట

సాళంగనాట

11 శ్రీవేంకటేశ్వరుఁడు శ్రీయలమేల్మంగతోడ
కోవిదుఁడై విహరించీ కోడతిరుణాళ్లు

॥పల్లవి||

వెల్లవిరిగా వీధుల వెన్నెలలు గాయఁగా
చల్లని పూవులవాన జడి మించఁగా
వొల్లనే సతులు దన్ను వుగ్గళించి పొగడఁగా
కొల్లలాడీ వలపులు కోడతిరుణాళ్లు

||శ్రీవేం||

ఆటల పాటలవాఁడు అండనే వినిపించఁగా
పాటించి యారగింపులు పైపైఁ జేయఁగా
గాఁటముగ వీడెములు గందములు నందుకొంటా
కోటిభోగాలు భోగించీ కోడతిరుణాళ్లు

||శ్రీవేం||

చేరి పన్నీరు కప్రము శిరసునఁ గులుకఁగా
వూరక యిందరు కొలువులు సేయఁగా
యీరీతి శ్రీవేంకటేశుఁ డిందరుసతులఁ గూడి
కోరికలు వెదచల్లీ కోడలిరుణాళ్లు.

||శ్రీవేం||240

అవతారిక:

‘కోడతిరుణాళ్ళు’ అంటే వసంతోత్సవ అని అర్థం. శ్రీవేంకటేశ్వరుడూ ఆయన దేవేరి అలమేల్మంగ వసంతోత్సవంలో పాలుపంచుకొంటున్నారట. ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు అన్నమాచార్యులవారు. స్వామి వసంతాలు చల్లుటయేకాదు శృంగారవనంలో కోవిదుడై విహరిస్తున్నాడట. అంటే ఆరితేరినవాడై వసంతాలాడుతూ విహరిస్తున్నాడన్నమాట. అసంఖ్యాకమైన సుందరాంగులతో ఆ శ్రీవేంకటేశ్వరుడు కోరికలు వెదచల్లే కోడతిరునాళ్ళు ఆడుతున్నాడట. ‘కప్రము’ అంటే కర్పూరము అని అర్థం. పన్నీరు కర్పూరము బాగా కలిపి తలమీద పోసేవారట ఆ రోజుల్లో.

భావ వివరణ:

శ్రీవేంకటేశ్వరుడు శృంగారపురుషుడు. తన దేవేరి అలమేల్మంగతో ఆయన కోవిదుడై (ఆరితేరిన నేర్పరివలె) కోడతిరుణాళ్ళు (వసంతోత్సవము) జరుపుకొంటూ విహరించీ (విహరించుచున్నాడు.). ఆ వైనం తిలకించండి.

ఆ తిరువీధులలో వెన్నెల వెల్లివిరిసి కాస్తున్నది. ఎవ్వరూ చల్లకనే పూవులవాన జడి (జల్లు) లాగా కురుస్తున్నది. ఆ వసంతోత్సవంలో పాల్గొంటున్న స్త్రీలందరూ తనను వుగ్గిళించి పొగడగా (తన పక్షాన ఉత్తేజ పరుస్తూ పొగుడుతుంటే) ఆ దేవదేవుడు ఆమె వలపులను కొల్లలాడీ (అపహరించాడు). స్వామి కోడతిరుణాళ్ళు అంత చూడ ముచ్చటగా వున్నది.

కొంతమంది అక్కడ ఆడుతున్నారు (నృత్యం చేస్తున్నారు). కొంతమంది మధురంగా గానం ఆలపిస్తున్నారు. వారు అండనే (ఇంటిలోనే) వున్నారు, మరి అంత జోరుగా వసంతాలాడితే ఆలిసిపోయి ఆకలివేస్తుంది కదా! స్వామి అప్పుడు పాటించి (ఆదర పూర్వకంగా కాసేపు విశ్రాంతినిచ్చి పైపై ఆరగింపులు (తేలికపాటి ఆహారం) తీసికొనినాడు. గాటముగా (అధికముగా) వీడెములు తాంబూలములను స్వీకరించాడు. గంధము పూతలు గ్రహించాడు. కోటి భోగాలు (అసంఖ్యాకమైన భోగములను) భోగించాడు. ఆ వసంతోత్సవం కన్నుల పండువగా వున్నది.

ఆహా!! ఎంత అద్భుతమైన దృశ్యమది!! వారి (స్వామివారు ఆయన దేవేరి) శిరసున (తలలమీద) చేరి (స్త్రీలందరూ కలిసి) పన్నీటిలో కలిపిన కప్రము (కర్పూరమును) గులకగా (కుమ్మరించగా వీరంతా స్వామివారి కొలువుకూటమిలో చేరారు. ఈ విధంగా శ్రీవేంకటేశ్వరుడు ఇంతమంది సతులగూడి (సుందరాంగులతో కూడి) వసంతాలాడుతుంటే స్వామిపై కోరిక కలుగనిదెవరికి చెప్పండి. ఆ విధంగా ఆ మనోహరుడు కోరికలు వెదచల్లుతుండే కోడతిరుణాళ్లు ఆడుతున్నాడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment