Atadepo Mayelika Atade Jaganmula In Telugu – ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : ఆతడేపో మాయేలిక ఆతడే జగన్మూల
సంఖ్య : 109
పుట: 73
రాగం: మాళవి

మాళవి

2 ఆతఁడేపో మాయేలిక ఆతఁడే జగన్మూల-
మాతఁడే శ్రీవేంకటాద్రియందు మీఁదిదైవము

||పల్లవి||

కమలవాసినియైన కాంతఁ బెండ్లాడినాఁ (నవాఁ?)డు
కమలములో బిడ్డఁ గన్నవాఁడు
కమలాప్తునిలోనఁ గలిగి మెరయువాఁడు
కమలనాభుఁడేపో కలుగుమాదైవము

||ఆతఁ||

జలధి బంధించి లంక సంహరించినవాఁడు
జలధిచొచ్చినదైత్యుఁ జంపినవాఁడు
జలధిసుతునకు వరుస బావైనవాఁడు
జలధిశయునుఁడేపో చక్కని మాదైవము

||ఆతఁ||

కొండ గొడుగుగనెత్తి గోవులఁగాచినవాఁడు
కొండవంటి రాకాసిఁ గొట్టినవాఁడు
కొండలకు నెక్కుడైనగురుతు శ్రీవేంకటాద్రి
కొండరూపు దానేపో కోరిన మాదైవము

||ఆతఁ||

అవతారిక:

అన్నమాచార్యులవారి ఈ కీర్తన అర్థం కావాలంటే పురాణాలమీద మంచి పట్టు వుండితీరాలి. ఆతడే జగన్మూలమైన శ్రీవేంకటాద్రిమీది దైవము అని కీర్తిస్తున్నారు. ఈ స్వామి కమలాప్తుడైన సూర్యునిలోని వెలుగై దీప్తించువాడు. ఈయన జలధిసుతునకు బావగారు అంటున్నారు. మరి ఆబావమరిది యెవరో? ఈయన కొండవంటి రాకాసిని కొట్టినవాడట. మరి ఆ రాకాసియెవరో? శ్రీవేంకటాద్రి కొండరూపు తానేపో అంటున్నారు. అంటే ఏంటి? భావవివరణ చదివితే అన్నీ పూసగుచ్చినట్లు అర్థమవుతాయి మరి.

భావ వివరణ:

ఆతడే (ఆ శ్రీవేంకటేశ్వరుడే) పో మాయేలిక (ప్రభువు). అతడే జగమునకు మూలకారణము. ఆతడే శ్రీవేంకటగిరిపై వెలసిన దైవము.

ఆతడెటువంటివాడో తెలియునా? కమలములో వసించు కాంతను బెండ్లాడినవాడు. కమలములో బిడ్డను (బ్రహ్మదేవుని) గన్నవాడు (కన్నతండ్రి). కమలాప్తుడైన సూర్యునిలో గలిగి (నెలకొని) వెలుగులు జిమ్మేవాడు. అటువంటి కమలనాభుడే పో మాకున్న దైవము.

ఇంకా చెప్పాలంటే, ఆయన జలధిని బంధించినవాడు (సేతువును సాగరముపై నిర్మించిన శ్రీరాముడు). లంక (లంకిణి) అను రాక్షసిని సంహరించినవాడు (చంపించినవాడు). ఆయనే జలధి జొచ్చిన దైత్యుని | (వేదములను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుని) చంపిన శ్రీమన్నారాయణుడు కూడా ఆయనే. జలధిసుతునకు (క్షీరసాగర | మథనమున పుట్టిన చంద్రునికి) వరుస బావ (అతని యొక్క సోదరి శ్రీలక్ష్మిని పెండ్లాటుచేత వరుసకు బావ) అయినవాడు. అటువంటి | క్షీరసాగరముపై పవ్వళించు స్వామియే పో మా దైవము.

ఇంతేకాక తన శ్రీకృష్ణావతారమున ఈయనే కొండను (గోవర్ధన పర్వతమును) గొడుగువలె చేతబట్టుకొని గోవులను, గోకులమును రక్షించినాడు. ఈతడే కొండవంటి రాకాసిని (రాక్షసి పూతనని) గొట్టినవాడు | (చనుబాలు త్రాగు నెపముతో సంహరించినవాడు). కొండలకు నెక్కుడైన (కొండలలో అత్యంత శ్రేష్ఠమైన) శ్రీవేంకటాద్రిపైన కొండరూపములో వున్నాడు (ఆ వేంకటాద్రి పడుకొని వున్న స్వామి శిరస్సును స్ఫురింపజేస్తుంది). తానేపో (ఆ శ్రీవేంకటేశ్వరుడే పో) మా దైవము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment