ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అతడితడా వెన్నలంతట దొంగిలినాడు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 4
కీర్తన : అతడితడా వెన్నలంతట దొంగిలినాడు
సంఖ్య: 6
పుట 4
రాగం: లలిత
లలిత
5 అతఁడితఁడా వెన్న లంతట దొంగిలినాఁడు
యేతులకు మద్దులు రెండిలఁ దోసినాఁడు
||పల్లవి||
యీతఁడా దేవకిగన్నయింద్రనీలమాణికము
పూతకిచన్ను దాగి పొదలినాఁడు
యీతఁడా వసుదేవుని యింటలో నిధానము
చేతనే కంసునిఁ బుట్టచెండు సేసినాఁడు
||అత||
మేటియైనగొంతిదేవిమేనల్లుఁ డీతఁడా
కోటికిఁ బడెగెగాను కొండ యెత్తెను
పాటించి పెంచే యశోదపాలి భాగ్య మీతఁడా
వాటమై గొల్లెతలను వలపించినాఁడు.
||అత||
ముగురువేలుపులకు మూలభూతి యీతఁడా
జిగి నావులఁ బేయలఁ జేరి కాచెను
మిగుల శ్రీవేంకటాద్రిమీఁదిదైవ మితఁడా
తగి రామకృష్ణావతార మందె నిప్పుడు
||అత||
అవతారిక:
ఈ వెన్నలు దొంగిలించే గొల్లపిల్లవాడు ఆ తిరుమలేశుడా!! రెండు మద్ది చెట్లను ఇతడు వుద్ధతితో తోసినాడు అంటున్నారు అన్నమయ్య. ఈ కీర్తనలో వాడిన భాష తెలుగునుడికారములతో బహు పసందుగా వుంది. ఈయన కంసుని పుట్టచెండుసేసినాడు అంటున్నారు. అంటే బంతిలా ఆడుకొన్నాడన్నమాట. అదేవిధంగా “కోటికి బడెగె గాను కొండయెత్తెను” అంటే జగత్ప్రసిద్ధుడై గోవర్ధనము అనే కొండను యెత్తినాడు అని అర్థం చెప్పుకోవాలి. ముగురు వేల్పులకు మూలభూతి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలకారణమైన పరమపురుషుడు ఈ బాలుడు అని | కీర్తిస్తున్నారు. ఇప్పుడాయన యెత్తినది రామకృష్ణావతారమట. అంటే?
భావ వివరణ:
ఆహా! యేమిటీవింత!! అతడు (ఆదిదేవుడైన పరమాత్మ) ఇతడా (ఈ బాలుడా). వీడు వెన్నలనన్నింటినీ రేపల్లెలో దొంగిలించినాడు. ఏతులకు (ఉద్ధతితో) తమ పెరటిలో బహుకాలమునుంచివున్న రెండు మద్ది చెట్లను ఇల తోసినాడు (నేలపై పడతోసినాడు).
ఈతడు ఆ దేవకీదేవి గర్భవాసము నుండి జన్మించిన ఇంద్రనీల మాణిక్యము. మానవకాంతగా వచ్చిన పూతన అనే రాక్షసి చనుబ్రాలు తాగి పొదలినాడు (వర్ధిల్లినాడు). ఈతడు ఆ వసుదేవుని ఇంట వెలసిన నిధానము (పాతర వంటి నిధి). తన మేనమామయైన కంసుని చేతనే (ప్రాణాలతో) పుట్టచెండుసేసినాడు (బంతి ఆట ఆడుకొన్నాడు).
ఈ బాలుడే పెరిగి పెద్దవాడై పాండవుల తల్లి గొంతిదేవికి (కుంతీదేవికి) మేనల్లుడై అత్తా అనిపిలిచి ఆమెకు అభయమొసగినాడు. ఇతడే “కోటికిన్ |పడెగెగాను కొండయెత్తెను” (జగత్ ప్రసిద్ధమైన గోవర్ధనపర్వతమును యెత్తి | తన చిటికిన వ్రేలిపై నిలబెట్టాడు). పాటించి (ఆదరించి) పెంచిన తల్లి యశోదాదేవికి ఇతడు భాగ్యమై, మరు జన్మలో కూడా వకుళాదేవియైన ఆమెకు బిడ్డ శ్రీనివాసుడై అమ్మా అని పిలిచాడు. గోపికలను వాటమై (మరిగి) వలపించుకొనినాడు.
ఈతడు, ఆ ముగ్గురు వేలుపులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, | మహేశ్వరులకు) మూలభూతి మాలకారణమైన పరమపురుషుడు. అయినా జిగి (వెలుగులు జిమ్మి) ఆవులను పెయ్యలను కాచినాడు. మిగుల (అధికుడై మిగిలిపోయి) శ్రీవేంకటాద్రిపైని వేంకటేశ్వరుడు కూడా ఇతడేనా? అవునయ్యా! నిజము. ఇప్పుడు బలరామకృష్ణుల అవతారమెత్తిన ఈ బాలుడే ఆ పరమాత్మ.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ