Naruda Yitadu Adinarayanudu Gaka In Telugu – నరుడా యీతడు ఆదినారాయణుడు గాక

ఈ పోస్ట్ లో నరుడా యీతడు ఆదినారాయణుడు గాక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

నరుడా యీతడు ఆదినారాయణుడు గాక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : నరుడా యీతడు ఆదినారాయణుడు గాక
సంఖ్య : 497
పుట: 336
రాగం: సాళంగనాట

సాళంగనాట

4 నరుఁడా యీతఁడు ఆదినారాయణుఁడు గాక
ధరణిఁ గీరితి కెక్కె దశరథసుతుఁడు

||పల్లవి||

యీతఁడా తాటకిఁ జంపె నీ మారీచసుబాహుల
నీతఁడా మదమణఁచె నిందరుఁ జూడ
యేతులకు హరువిల్లు యీతఁడా విరిచి యట్టె
సీతఁ బెడ్లియాడెను యీ చిన్న రాముఁడా

||నరుఁ||

చుప్పనాతి ముక్కుగోసి సోదించి దైత్యులఁ జంపి
అప్పుడిట్టె వాలినేసినాతఁ డీతఁడా
గుప్పించి కోఁతుల నేలి కొండల జలధిగట్టి
కప్పి లంక సాధించె నీ కౌసల్యానందనుఁడా

||నరుఁ||

రావణాదులను జంపి రక్షించి విభీషణుని
భావించయోధ్య నీతఁడు పట్ట మేలెను
శ్రీవేంకటేశుఁ డితఁడే సృష్టి రక్షించె నితఁడే
యీవల మాపాలనున్న యీ రామచంద్రుఁడా

||నరుఁ||

అవతారిక:

విశిష్టా ద్వైతమత ప్రచారకుడై అన్నమాచార్యులవారు వూరూరా తిరిగి తన కీర్తనలను వినిపించి మరీ విష్ణుతత్త్వం ప్రబోధించారు. ఆ రోజుల్లో రామాలయంలేని వూరు వుండేదికాదు. ఏవూరికెళ్తే ఆవూరి శ్రీరామునిపై కీర్తన చెప్పేవారు. ప్రతి కీర్తనలోనూ రామకథను ఆద్యంతం గానం చేయడం ఆయన ప్రత్యేకత. బహుశా ఆ వూరిలో సంస్కృత పండితులెక్కువమంది వుంటే కీర్తన గీర్వాణిలో చెప్పేవారేమో. అందుకనే అన్నమయ్య సంస్కృత కీర్తనలు యెక్కువగా శ్రీరామునిపైనా నృశింహునిపైనా వున్నాయని నాకు అనిపిస్తుంది. అందుకే… ఓ నరులారా! ఈతడు ఆదినారాయణుడు దశరథసుతునిగా ధరణిలో కీర్తిని పొందాడు… అంటున్నారు.

భావ వివరణ:

ఓ నరులారా! ఈతడెవరనుకొన్నారు? ఆదిదేవుడైన ఆదినారాయణుడు. గాక (అయితే) ధరణిన్ కీరితికెక్కె (భూలోకంలో పేరుపొందినది మాత్రం) దశరథ సుతుడైన శ్రీరామచంద్రమూర్తి అనే సుమా! (మరి ఆయన చేసిన ఘనకార్యాలు అట్లున్నవి).

ఈయన తాటకి అనే రాక్షసిని సంహరించాడు. ఇందరుజూడ (విశ్వామిత్రుని యాగమును చూచుటకు వచ్చిన ఇంత మంది చూస్తుండగా) ఈయన దాని కొడుకులైన మారీచ సుబాహుల మదమును అణచినాడు. ఈచిన్నారి రాముడు, ఏతులకు (ఉద్ధతితో) శివధనస్సును విరిచి అట్టే (అవలీలగా) సీతను పెండ్లాడినాడు.

ఈయన లక్ష్మణుని ప్రేరేపించి ‘చుప్పనాతి’ అని పేరువడ్డ శూర్పనఖ ముక్కు చెవులను కోయించినాడు. సోదించి (వెదకి సోదించి (వెదకి వెదకి) రాక్షసులను సంహరించినాడు. ఆ తరువాత రావణాసురునివంటి వాని మదమణచిన వాలిని ఒక్క అమ్ము వేసి మట్టుబెట్టాడు. ఆ మహానుభావుడే ఈ చిన్నారి రాముడా!! కుప్పించి యెగిరే కోతులను ఒక సేనగా నడిపించిన నాయకుడా!! అవునయ్యా! ఈ కౌసల్యానందనుడే జలధిగట్టి (సముద్రముపై సేతువును నిర్మించి రావణునిపై దండెత్తి స్వర్ణలంకను సాధించినాడు.

ఆనాడావిధంగా రావణుని సంహరించాక ఆ లంకను రావణుని తమ్ముడైన విభీషణునికే పట్టము గట్టిన ధర్మమూర్తి ఈయన. తమ కోసల రాజధాని అయోధ్యా నగరానికి పట్టాభిషిక్తుడై పరిపాలించాడు. ఆనాటి త్రేతాయుగానంతరం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై తదనంతరం ఈ కలియుగంలో ఇతడే కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడై ఈ సృష్టిని రక్షిస్తున్నాడు. ఈ శ్రీరామచంద్రడే మా పాలనున్నాడు (మా పాల దైవమై వున్నాడు).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

  1. శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
  2. వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
  3. దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
  4. ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
  5. బోధింపరే యెరిగిన బుధులాల పెద్దలాల
  6. దాసోహమనుబుద్ధిదలచరు దానవులు
  7. నారాయణుడ నీనామమె మంత్రించివేసి

Leave a Comment