Kadisi Yatamdu Mam Mumgacumgaka In Telugu – కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
సంఖ్య 445
పుట : 299
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

3 కదిసి యాతఁడు మమ్ముఁగాచుఁగాక
ఆదె యాతనికె శరణంటే నంటి నేను

॥పల్లవి||

యెవ్వని వుదరమున నిన్నిలోకములుండు.
యెవ్వని పాదము మోచె నిల యల్లను
యెవ్వఁడు రక్షకుఁ డాయ నీ జంతుకోట్లకు
అవ్విభునికి శరణంటే నంటి నిప్పుడు.

॥కదిసి||

సభలో ద్రౌపదిఁగాచె సర్వేశుఁ డెవ్వఁడు
అభయహస్త మొసంగె నాతఁ డెవ్వఁడు
ఇభవరదుఁ డెవ్వఁడు యీతనికే వొడిగట్టి
అభినవముగ శరణంటే నంటి నిప్పుడు

॥కదిసి||

శరణుచొచ్చిన విభీషణుఁ గాదె నెవ్వఁడు
అరిది యజుని తండ్రి యాతఁడెవ్వఁడు
యిరవై శ్రీవేంకటాద్రి యెక్కి నాతఁడితఁడే
ఆరసి యితనికే శరణంటే నంటి నిప్పుడు

॥కదిసి||

అవతారిక:

అదె యాతనికె శరణంటే నంటి నేను అనిపాడుతున్నారు. అన్నమయ్య. ఇదే ఈనాటి తెలుగులో అయితే ‘అతనికే శరణంటూ నంటిని’ అనే మాటను వుపయోగిస్తాము. ఈ కీర్తన కూడా యెన్నో పురాణ గాథలతో ముడి పెట్టబడియున్నందున మంచి పురాణ వాఙ్మయపరిచయం | వున్నవారికి మాత్రమే ఈ కీర్తనలోని లాలిత్యము అర్థమవుతుంది.

“ఎవని పాదము మోచె నిలయల్లను” అంటే ఎవ్వని పాదము భూమినంతా కొలిచింది అని అర్ధం. అవును ఎవరి పాదం భూమిని కొలిచిందో తెలుసా?

భావ వివరణ:

ఆతడు (ఆ శ్రీహరి) కదిసి (మాకు దగ్గరయై) మమ్ము గాచుగాన (రక్షిస్తాడు కాబట్టి), నేను అదె (అందుచేతనే ఆయనకే ‘శరణంటేనంటి’ (శరణు మహాప్రభో! అన్నాను.)

మేము మామూలు సాధారణమైనవాడిని ఆశ్రయించాలనుకొన్నారా యేమి? ఇన్ని లోకములు (ఈ పదినాలుగు భువనాలు) యెవ్వని వుదరములో (కడుపులో) నున్నవో, ఇలయెల్లను యెవ్వని పాదము మోచెన్? (ఈ భూమినంతా యెవరి పాదము కొలిచింది? (మనపొట్టి వామనమూర్తి). కోట్లాది జంతువులు విచక్షణా రహితంగా ఒకదాన్నొకటి చంపుకొంటూనే వుంటాయి. మరి వాటికి రక్షకుడెవడు? అవి ఇంకా యెందుకు జీవిస్తూనేవున్నాయి? వాడే జగద్విభుడు, వాడే నారాయణుడు. ఇప్పుడే నేను ఆయనకు శరణు మహాప్రభో! అన్నాను.

ఆరోజు, నిండు సభలో వస్త్రములూడదీసి దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయబోతే అక్షయముగా వలువలిచ్చి అభయ హస్తము నిచ్చిన ఆతడెవ్వరు? ఆ సర్వేశ్వరుడెవరు? ఇభవరదుడెవ్వడు (ఆనాడు కారడవి | కొలనులో తన కాలునుపట్టి పీడిస్తున్న మొసలి నుండి తనను రక్షించుకోలేక “నీవే తప్ప నిత:పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అని రోదిస్తున్న గజేంద్రుని హుటాహుటివెళ్ళి రక్షించినదెవ్వరు? ఆతనికే అభినవముగ (కొత్తగా) ఒడిగట్టి (నిశ్చయుడనై) శరణు మహాప్రభో! అన్నాను.

ఎంత నచ్చజెప్పినా వినక, శ్రీరామపత్ని సీతను చెరబట్టి | కులఘాతకుడైన అన్న రావణాసురుని త్యజించి శరణుజొచ్చిన విభీషణుని రక్షించినదెవరు? అరిది (దుర్లభుడైన అజునకు (బ్రహ్మదేవునికే) | తండ్రియైన వాడెవరు? ఇంకెవరండీ… ఇదిగో ఇరవుయై (ఇక్కడ నెలకొని) ఈ శ్రీవేంకటాద్రిని యెక్కిన ఈయనే ఆయన… ఆయనే యీయన. అరసి (అది గ్రహించి) నేను ఇప్పుడు ఈయనకే “శ్రీవేంకటేశవమ్ శరణం ప్రపద్యే”… అని వేడుకొన్నాను. శరణంటేనంటినయ్యా!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment