మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గజేంద్రమోక్షము గురించి భక్తి యోగం లో తెలుసుకుందాం…
పరిచయం
శ్రీరాముడు శాపగ్రస్తురాలై రాయిగా మారిన అహల్యను తన కాలితో తాకగానే తిరిగి అహల్య స్త్రీగా మారినదని ఒక కట్టుకథ ఉంది. హిందువులు శ్రీరాముని దేవుని అవతారమని చెప్పుటకే ఈ కట్టుకథను కల్పించారు. శ్రీరాముని దేవుడంటే తప్పులేదు. కానీ ఈ చరాచర జగత్తునంతా చేసి పోషించి లయంచేసే సృష్టికర్త ధర్త హర్త అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీరాముడు ఏక పత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, వేదవిదుడు. అందువలన ఆయనను దేవుడు – దివ్యగుణములు కలవాడు అంటే దోషమేమీ లేదు. మానవులలోనే విద్వాంసులు, దాన ధర్మములు చేయువారు, వేద విద్యలను నేర్పు ఆచార్యులు, ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయు రాజులు మున్నగు వారు కూడా దేవతలనబడతారు. అందువలన శ్రీరాముడొక దేవుడు. సృష్టికర్తయైన పరమేశ్వరుడు మాత్రం కాడు.
మహాభారత యుద్ధానికి పూర్వమే వేద సిద్ధాంతాలు కనుమరుగైన కారణంగా మానవ సమాజంలో అనేక దురాచారాలు ప్రబలం కాసాగాయి. మన ప్రాచీన ఋషులను, మహాత్ములను నిందించటం, అవహేళన చేయటం కూడా అప్పటినుండే ఆరంభమైనది. ఋషులు, ఋషి పత్నులపై నిందలు వేస్తూ మన ప్రాచీన వైదిక సంస్కృతి – సభ్యతలను సర్వనాశనం చేసే ప్రయత్నంలో ఒక భాగమే ఈ అహల్య శాపం కట్టు కథ. బుద్ధిమంతులు ఆలోచించి ఇటువంటి నిందలను తిరస్కరించాలి.
– సంధ్యావందనం శ్రీనివాసరావు
అహల్య రాయిగా మారలేదు
తులసీరామాయణంలో గౌతమ ఋషిపత్నియైన అహల్యా గౌతమ ఋషి శాపంతో రాయిగా మారినట్లు ఒక కట్టు కథ ఉంది. శ్రీరాముడు రాతిని కాలితో తాకగానే ఆయన పాదధూళి అంటుకొని ఆ రాయి మళ్ళీ స్త్రీగా మారి స్వర్గానికి ఎగిరిపోయింది. చూడండి
గౌతమ నారీ శాపవశ, ఉపల దేహ ధరి ధీర,
చరణ కమల రజ చాహతీ, కృపా కరహు రఘువీర.
గౌతమ ఋషి పత్ని అహల్య శాపం వలన రాయిగా మారింది. ఓ రామా ! నీ పాద ధూళిని కోరుతోంది. నీవామెను కరుణింపుమని విశ్వామిత్ర ఋషి శ్రీరామునితో అనెను. శ్రీరాముడు వనవాసమున కెళ్ళుచున్నపుడు గంగానదిని
దాటుటకై నావ అవసరమైనది.
మాంగీ నావ న కేవట ఆనా, కహా తుమ్హర మర్మమై జానా……… తులసీ రామాయణం)
“శ్రీరాముడు నదిని దాటుటకు నావనడుపువానిని (ముల్లాహ) నావను తెమ్మనగా అతడిట్లనెను – చరణ్ కమల్ రజ్ కహం సబ్ కహ ఈ. మానుష్ కరని మూరి కఛు అహఈ”.
ఓ రామా ! మీ రహస్యం నా కర్ధమైంది. మీ పాద పద్మముల ధూళి మానవులను తయారుచేసే ఔషధమని అంతా అంటుంటారు. మీ పాద ధూళిని తాకగానే రాయి సుందర స్త్రీగా మారింది. రాయి కంటే కర్ర గట్టిది కాదు. రాయే స్త్రీగా మారినపుడు నా కర్రనావ స్త్రీగా మారదా ! ? ఈ నావకూడా ఋషి పత్నిగా మారి పైకెగిరి పోతే నాగతేమిటి? నేనీనావతోనే నాకుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు వేరే పనేదీ రాదు. అందుకని మహారాజా! మీరీ గంగానదిని నా నావపైనే దాటాలనుకుంటే, ముందు నేను మీ పాదాలను నీటితో కడగటానికి అనుమతించండి. కాళ్ళు కడగటంతో మీ పాదాలకంటిన ధాళి పోతుంది. కనుక నా నావ ఎగిరి పోకుండా ఉంటుంది !
ఈ కథ వలన మనకు తెలిసేదేమంటే – శ్రీరాముని పాదాలలో ఆ శక్తి లేదు. ఆయన పాదాలకంటియున్న ధూళి (మట్టి) కాచమత్కారమున్నది. దీనిపైన రహీంకవి దోహ ఒకటుంది. అది ధూరి ధరత గజ శీశ పర్…….
రహీం కవిని ఒకరిలా అడిగాడు – “రహీం ఈ ఏనుగు తన తలపై దుమ్మునెందుకు పోసుకుంటున్నది? అని. అందుకు రహీం : గౌతమముని పత్ని అహల్యా తరించిన ధూళి కొరకు ఈ ఏనుగు వెదుకుతూ తిరుగుతోంది. ఆ దుమ్ము ఎక్కడైనా దొరికితే తాను కూడా తరించవచ్చని దాని ఆశ! అన్నారు.
అహల్య రాయిగా మారటం. అహల్య శ్రీరాముని పాదధూళి తాకగానే స్త్రీగా మారటం వంటి దేమీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అచ్చటిలా ఉంది –
విశ్వామిత్రం పురస్కృత్య ఆశ్రమం ప్రవివేశ హ । (12)
దదర్శ చ మహాభాగాం, తపసా మౌతిత ప్రభామ్ । (13)
రాఘవౌస్తు తదా తస్యాః, పాదౌ జగృహతుర్ ముదా । (17)
పాధమర్ధ్య తథాతిథ్యం, చకార సు సమాహితా । (18)
(వాల్మీకి రామాయణం – బాలకాండ – 49వ సర్గ) విశ్వామిత్ర ఋషితో రామలక్ష్మణులు గౌతమ ఋషి ఆశ్రమమును సందర్శించుట.
ఆశ్రమంలో ప్రవేశిస్తుండగా మహాభాగ్యశాలిని యైన అహల్య తన తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశించుచున్నది.
శ్రీరామలక్ష్మణులు ఎంతో ఆనందంతో అహల్యయొక్క పాదములు రెండింటిని స్పర్శించిరి. (శ్రీరాముడు తన పాదాలతో అహల్యను తాకలేదు) అహల్య ఆ ఇరువురు అన్నదమ్ములను ఎంతో ఆదరంతో అర్ఘ్యపాద్యాదులను (కాళ్ళు ముఖం చేతులు కడుగుకొనుటకు నీళ్ళు) త్రాగుటకు (ఆచమనం) నీళ్ళిచ్చి అతిథి సత్కారమును చేసెను. వాల్మీకి రామాయణంలో అహల్య రాయిగా మారటం శ్రీరాము డారాతిని తాకగానే అది స్త్రీగా మారటం వంటివేవీ లేవు. గౌతమ ఋషి శాపంతో అహల్య రాయిగా మారెనను మాట వాల్మీకి రామాయణంలో లేదు. ఇందుకు విరుద్ధంగా ఇచ్చట ప్రకరణం ఇలా ఉంది. చూడండి –
‘తపసా ద్యోతిత ప్రభా’ తపస్సు చేస్తున్న అహల్య అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తోంది. అని మీరు రామాయణంలోని వాక్యాన్ని చదివే ఉంటారు. శ్రీరాముడామెను దర్శించి అన్నదమ్ములిరువురు ఆమె పాదాలను స్పర్శించిరి.
రామాయణంలో అహల్యా ఇంద్రుల జారకర్మ (వ్యభిచారం) ను గురించి వ్రాసి ఉంది. కానీ రామాయణ కథను చెప్పే భాగవతులు దీనిని రామాయణంలో కల్పినట్లుగా భావిస్తున్నాను. కలపటానికి కారణాలివి –
గౌతమ – అహల్య – ఇంద్రులను గూర్చిన ఈ కథ శతపథ బ్రాహ్మణంలో రూపకాలంకారంలో ఉన్నది –
అహల్యపతి గౌతముడు. ఇంద్రుడు – జారుడు. చూడండి. ‘రాత్రిరహల్యా కస్మా దహర్దినం లీయతే స్యాం తస్మా ద్రాత్రి రహల్యోచ్యతే’
రాత్రి ‘అహల్య’. దినమునకు ‘అహః’ అని పేరు. అహల్యా” “అహః” దినము దీనిలో లయమగును (కలిసిపోవును) కనుక రాత్రికి “అహల్యా” అని పేరు. గౌతముడు – చంద్రుడు. చంద్రుడు రాత్రివేగంగా వెళ్ళుతున్నట్లు కనబడతాడు కనుక – గచ్ఛతి ఇతి గౌ”నడచువాడు – చంద్రుడు- “గౌ” అనబడును. వేగంగా వెళ్ళును. కావున “గౌతముడు” అనబడతాడు. చంద్రుని రాత్రికి పతి అందురు. అందువలన చంద్రుని “నిశా – పతి” అంటారు. నిశా అంటే రాత్రి. చంద్రునకు రాకేశ్ అని కూడా పేరు. రాత్రికి రాకా అనిపేరు. పూర్ణిమకు కూడా రాకా అని పేరు. చంద్రుడు లేని రాత్రి ‘విధవ’వలె కనబడుతుంది. చంద్రునితో కలిసిఉన్న రాత్రి శోభాయమానంగా ప్రకాశిస్తూ అంటే సౌభాగ్యవతియైన స్త్రీలా కనబడుతుంది. అందువలన చంద్రుడు అంటే గౌతముడు రాత్రి అంటే అహల్యకు పతి.
సూర్యుడు ఇంద్రుడు. సూర్యుడు రాత్రిని నశింపజేస్తాడు. (లేకుండా చేస్తాడు) అంటే బలహీనపరుస్తాడు. ఇది జారకర్మ. అందువలన ఇంద్రుడనగా సూర్యుడు, అహల్య అనగా రాత్రితో వ్యభిచరించును. సూర్యోదయం కాగానే రాత్రి బలహీనపడుతూ పడుతూ పూర్తిగా నశించిపోతుంది. ఇదొక విజ్ఞానంతో కూడి యున్న సుందర రూపకాలంకారం.
దీనిని అర్థం చేసుకోకుండా గౌతమ ఋషిపత్ని అహల్యతో ఇంద్రుడు జారకర్మ – వ్యభిచరించాడని పురాణాలలో వ్రాశారు. రామాయణంలో గౌతమ ముని పత్ని అహల్యయొక్క చరిత్రకు సంబంధించిన వర్ణన ఉంది. దానితో బ్రాహ్మణగ్రంథంలోని ఈ రూపకాలంకారాన్ని జోడించి చరిత్ర భ్రష్టు పట్టించారు – నాశనం చేశారు. ఇంద్రుడు – అహల్యకు మధ్య అబద్ధపు వ్యభిచారదోషాన్ని కల్పించారు.
ఈ విధంగా శబ్దాలకు (అనర్థాలను) తప్పుడు అర్థాలను కల్పనచేసి చేసి కథలు చెప్పే మన పౌరాణికులు మన చరిత్ర గాధలన్నింటిని నాశనం చేశారు. రామాయణంలో అనేక చోట్ల తమ ఇష్టం వచ్చిన కల్పిత కథలున్నాయి. వీనితో వాస్తవాలు మరుగున పడ్డాయి. నేటి ఆధునిక యుగంలో ప్రతి విషయాన్ని తర్కబుద్ధితో ఆలోచించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రాతకాలం నాటి మాటలు- “చేపచెట్టెక్కిందని పండితుల వారంటే. భక్తబృందం సత్యం మహరాజ్’ అన్నారు. ఇటువంటి భ్రమలు కలిగించే అబద్ధపు కథలు చదివి చదివి నేటి యువతీ – యువకులు రామాయణ, మహాభారత ఇతిహాసాలకు తిలాంజలులివ్వటానికి తయారౌ తున్నారు. కనుక విద్వాంసులంతా ప్రతివిషయాన్ని సత్యంతో పరీక్షించి యుక్తి-యుక్తంగా వ్రాయాలి. మన దేశ చరిత్ర, ధర్మగ్రంథాలలో ఎటువంటి దోషాలూ రానివ్వరాదు.
ఒక ధర్మము, ఒక భాష, ఒక లక్ష్యము భారతవాసుల కేర్పడనంతవరకు భారత దేశమునకు పూర్ణహిత మేర్పడజాలదు. ఉన్నతియు జరుగదు.
(మహర్షి దయానంద సరస్వతి).
మరిన్ని భక్తి యోగాలు: