కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 3
కీర్తన : ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
సంఖ్య : 193
పుట : 130
రాగం : లలిత
లలిత
21 ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
ఆదిగొని భూభార మణఁచీనోయమ్మా.
||పల్లవి||
చందురునుదయవేళ సవరేతిరి కాడ
కందువ దేవకి బిడ్డఁ గనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుఁటింటి వాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మా.
|| ఆది ||
వసుదేవునియెదుట వైకుంఠనాథుఁడు
సిసువై యవతరించి చెలఁగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాఁ డభయమిచ్చీనమ్మా.
|| ఆది ||
కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూఁక అణఁచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితొడ
పన్ని నిచ్చకల్యాణాలఁ బరిగీనమ్మా.
|| ఆది || 193
అవతారిక:
భూభారాన్ని తగ్గించడానికి భువిపై అవతరించిన ఆదివిష్ణువే ఈ కృష్ణుడు అని ఆ అవతార విశిష్టతను కీర్తిస్తున్నారు అన్నమాచార్యులవారు.
సవరేతిరి అంటే అర్ధరాత్రి అని అర్థం. సిసువు అంటే శిశువు అని అర్థం. కన్నతల్లిదండ్రుల కర్మబంధాలను పటాపంచలు చేశాడట ఆయన. రాకాసి మూకలు అంటే రాక్షసులగుంపు అని అర్థం. ఈ కృష్ణయ్యే కలియుగంలో శ్రీవేంకటాద్రిపై అలమేల్మంగమ్మతో వెలసి నిత్యకళ్యాణాల చక్రవర్తియై శోభలీనుతున్నాడు అంటున్నారు. ‘ఆదికొనుట’ అంటే కన్నువేయటం అని అర్థం.
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఈతడే ఆదివిష్ణువట. ఈ మహానుభావుడు, ఆదిగొని (కన్నువేసి… అంటే… నిశ్చయించుకొని) భూభారము నణచినాడమ్మా!
చందురునుదయవేళ (చంద్రుడు వుదయించుచున్న సమయమున) సవరేతిరి కాడ (అర్థరాత్రి తరుణమున) దేవకీదేవి, కందువ బిడ్డ గనెనమ్మా! (సామర్థ్యముగల శిశువునకు జన్మనిచ్చింది. బ్రహ్మాది దేవతలు అప్పుడు పొందుగా (ఉద్ధతితో) ఆ పురిటింటి గుమ్మంలో నిలబడి ఆ బాలుని స్తోత్రించినారోయమ్మా!
అనంతరం వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు వసుదేవుని యెదుట సిసువుగ (శిశువుగా) అవతరించి చెలగీనమ్మా (కనువిందుజేయు చున్నాడమ్మా!) అప్పుడు ఆ యిసుమంత శిశువు ముసిముసినవ్వులు విరజిమ్ముతూ తనను చూడవచ్చిన మునీశ్వరులకు ఇకపై భయమువలదు అని వారికి అభయమునొసగినాడు ఓయమా! ఏమి ఆశ్చర్యము!!
అప్పుడా శిశువు తన కన్నతల్లిదండ్రులకు వారి గతజన్మల పుణ్య విశేషమును వివరించి తను వారి గర్భమున జన్మించిననూ వారి కర్మఫలము వలన తన బాల్యమును జూచు అదృష్టము వారికి లేదనీ, తిరిగి తను పెద్దవాడయ్యాక జీవితాంతము తనతోనే గడుపుదురని వివరించి వారికి కర్మపాశము నుండి విముక్తి కలిగించెను. ఆ బాలుడే అన్ని విధములైన రాకాసి మూకలను చీల్చి చెండాడినాడు. నేడు ఆతడే శ్రీవేంకటాద్రిపై లక్ష్మీదేవితో నుండి, వున్నతముగా పూని నిత్యకళ్యాణములు జరుపుకొంటూ, పరగీనమ్మా! (వెలయుచున్నాడమ్మా!).
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: