Varidhi Shayana Vo Vatapatra Pariyanka In Telugu- వారిధిశయన వో వటపత్రపరియంక

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో వారిధిశయన వో వటపత్రపరియంక కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వారిధిశయన వో వటపత్రపరియంక – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : వారిధిశయన వో వటపత్రపరియంక
సంఖ్య : 465
పుట: 314
రాగం: దేవగాంధారి

దేవగాంధారి

13 వారిధిశయన వో వటపత్రపరియంక
గారవాన మేలుకొని కన్నులు దెరవవే

॥పల్లవి||

ఘనయోగిహృదయపుకమలాలు వికసించె
వొనర విజ్ఞానసూర్యోదయమాయ
మును జీవపరమాత్మములజక్కవలు గూసె
వనజాక్ష మేలుకొని వాకిలి దెరవవే

॥వారిధి॥

కలుషములనేటిచీఁకట్లెల్లఁ బెడఁబాసె
నలువంక వేదకీరనాదము మ్రోసె
అలరి యితరధర్మాలనేటిచుక్కలు మాసె
జలజాక్ష మేలుకొని సతిమోము చూడవే

॥వారిధి||

కపటరాక్షసనేత్రకలుహారములు మోడ్చె
యిపుడే సుకర్మముల యెండలు గాసె
అపురూప శ్రీవేంకటాద్రీశ మేలుకొని
నిపుణుఁడ యిందిరయు నీవు మమ్ముఁ గానవే

॥వారిధి|| 465

అవతారిక:

“వటపత్రపరియంక” అంటే మఱియాకు తల్పముగా శయనించువాడని అర్థం. జక్కువలు అంటే చక్రవాక పక్షులు. కల్హారము అంటే తెలుపు రంగు మిళితమైన ఎఱ్ఱనికలువపూవు. తేలిక అని భ్రమ కలిగించే క్లిష్టమైన కీర్తన ఇది. వటపత్రశాయియైన జలధిశయన ఆదినారాయణునిపై అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తన ఇది ఆయన యోగీశ్వరుల హృదయకమలాలలో వుంటాడు. అన్య మతధర్మములను నక్షత్రాలు మాసిపోవునట్లు చేసే పూర్యోదయం అవుతుంది ఈయన నిదుర మేలుకొంటే. కపటులైన రాక్షసుల కన్నులనే కల్హారములు మ్రోడువారిపోతాయట. అంటే రాక్షసులు నశిస్తారని అర్థం.

భావ వివరణ:

ఓ వటపత్రపరియంకా! (మఱియాకు శయ్యగా పరుండిన వాడా!) వారిధిశయనా! (క్షీరసాగరముపై శయనించు దేవా!) గారవాన (మంగళప్రదుడవై) మేలుకొని కన్నులు తెరవవయ్యా!

ఓ ప్రభూ! నిన్ను జూచి ఘనులైన యోగేశ్వరుల హృదయ కమలములు వికసించినవి, యెందుకంటే వారిలో నిన్ను గూర్చిన విజ్ఞాన సూర్యోదయమైనది కదా! ఆ విజ్ఞాన సూర్యోదయమున జీవాత్మ పరమాత్మ అనే జక్కువలు (చక్రవాక పక్షులజంట) ఆనందముగ కూసినవి. (అంటే ఆ జంట నిజానికి తామొక్కటే అని కూస్తూన్నాయి అని భావము). ఓ వనజాక్షా! (పద్మనయనా!) నీ వైకుంఠద్వారపు వాకిలి తలుపులు తెరిపించి నిదురమేలుకొనవయ్యా!

ఓ జలజాక్షా! నీవు మేలుకొంటే దుర్మార్గము అనే చీకట్లన్నీ తొలగిపోతాయి నలుదెసలా చతుర్వేదములనెడి కీరములు (చిలుకలు) నాదముతో రవళిస్తాయి. ఈ లోకంలోవున్న వేద విహిత ధర్మములన్నియు నింగిలోని చుక్కలవలె (నక్షత్రముల తీరుగా) అదృశ్యమవుతాయి. ఓ దేవా! నిదురమేల్కొని ఒకపరి నీసతి మోమును పరికించుము.

ఓ దేవదేవా! నీవు మేలుకొంటే, కపటులైన రాక్షసుల నేత్రకలుహారములు (కన్నులనే లేత ఎఱుపురంగు కలువపూలు) మోడ్చె (ముడుచుకుపోతాయి). సుకర్మములు (వేదయుక్తమైన పనులు) అనే ఎండలుకాస్తాయి. అపురూపుడవైన శ్రీవేంకటేశ్వరా! నీవు నిదుర మేల్కొని ఇందిరాదేవితో కూడి నిపుణుడవై మమ్ము రక్షించి పరిపాలింపుము తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment