Satithoda Sare Sareku Sarasamuladukonta In Telugu – సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 14
కీర్తన : సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
సంఖ్య : 376
పుట : 218
రాగం : కాంబోది

కాంబోది

12 సతితోడ సారెసారెకు సరసములాడుకొంటా
తతితోడనారగించీ తగునె యీదేవుఁడు

॥పల్లవి||

ఒక్కమాటె వంటలెల్లా నొద్దనుండి వడ్డించి
మిక్కిలినలసె నలమేలుమంగ
చెక్కులఁ జెమటగారఁ జేరి యీపె వడ్డించఁగా
చొక్కి చొక్కి యారగించీఁ జూడరె యీదేవుఁడు

||సతితో||

పాఱి పాఱి బంగారుపళ్ళెములు వెట్టించి
మీఱి బుసకొట్టె నలమేలుమంగ
జాఱిన తురుముతోడఁ జవులాకె యడుగఁగ
ఆఱడి గూరలు మెచ్చీనంతలో నీదేవుఁడు

||సతితో||

వాలిన రాజసముతో వంటసాలలోననే
మేలిమిఁ గూచున్న దలమేలుమంగ
యీలోనె శ్రీవేంకటేశుఁడీపెఁ దానునారగించి
తాలమిఁ గాఁగిటఁగూడె దక్కక యీదేవుండు

॥సతితో॥ 376

అవతారిక:

అన్నమాచార్యులవారి వొక్కొక్క కీర్తనకు వొక్కొక్క ప్రత్యేకత వుంటుంది. ఇందులో చూడండి తన ముద్దుల సతితో ముచ్చట్లాడుకుంటూ మాటి మాటికీ సరసాలాడుతూ చాలా ఇష్టంగా భోజనం చేస్తున్నాడట ఆ దేవదేవుడు. తన చెక్కిళ్ళపై చెమటలు కారిపోతుంటే, సడలిన తనకొప్పును సవరించుకోలేక అలమేల్మంగమ్మ, తిప్పలు పడుతుంటే ఆహా! ఓహెూ! అని మెచ్చుకొంటూ ఆరగిస్తున్నాడట స్వామి. ఈలోనే అమ్మవారు కూడా ఆరగించి తాలిమితో యీదేవుని కౌగిట కరిగిపోయిందట. ధన్యోస్మి. ఏమి ఆ పదకవితాసౌరభం!! ఏమి ఆ కల్పనా చాతుర్యం!! ఏమని పొగడుదునయ్యా! అన్నమయ్యా!

భావ వివరణ:

సారెసారెకు (మాటిమాటికీ) సతితోడ (తన భార్యతో) సరసములాడుకొంటూ (చలోక్తులు విసురుతూ) ఈ దేవదేవుడు తగు తతితోడన్ (తగినంత ప్రీతితో) | ఆరగించీ (భుజించుచున్నాడు). ఆ వైనం వినండి.

జగముల తల్లి అలమేలుమంగ తను ఆయనకిష్టమని చేయించిన వంటకాలన్నింటిని ఒక్కటీ వదలకుండా వడ్డించింది. అందుచే ఆ తల్లి మిక్కిలి అలిసిపోయినది. ఆమె చెక్కుల జెమట (చెక్కిళ్ళపై శ్రమవలన చెమట) కారిపోతున్నది. ఆమె చేరి స్వయముగా వడ్డించుచునేయున్నది. ఈ దేవుడు చొక్కి చొక్కి (పారవశ్యముతో) ఆరగించుచున్నాడు. ఈ అద్భుత దృశ్యం మీ మనోనేత్రాలతో చూచి తరించండి.

ఈ తల్లి, పాఱిపాటి (తడవ తడవకూ) వంటకాలన్నీ బంగారు పళ్ళెరములలో పెట్టించి, అలసటతో మీఱి బుసకొట్టీ (పెద్దగా నిట్టూర్చింది) అలమేల్మంగమ్మకు ఆ పరిశ్రమవలన తురుము (సిగకొప్పు) సడలి పోయింది (వదులై విడిపోబోతున్నది). అయినా ఆమె కొప్పు సవరించుకొంటూనే, చవులడుగగా (వంటలెలావున్నాయండీ… అని అడుగుతుంటే) ఈ దేవుడు ఆఱడి (మించి) అంతలో (పూర్తిగా తినకుండానే) కూరలు మెచ్చీ (కూరలు యెంత బాగున్నాయి. ఆహా!! యేమి రుచి అని మెచ్చుకొన్నాడు).

ఆ తల్లి అటుపిమ్మట, వాలిన రాజసముతో (మిక్కిలి అతిశయించిన రాచఠీవితో) మేలిమి వంటసాలలో (స్వర్ణమయమైన ఆ వంటశాలోనే) తానూ భుజించుటకు కూర్చున్నది. ఈలోనె (ఈరీతిగా) శ్రీవేంకటేశ్వరుడు మరియు అలమేల్మంగ, ఆరగించిరి. ఆపై, తక్కక (తప్పకుండా) ఈ దేవదేవుడు తాలిమి (ఉత్సాహముతో) ఆ దేవిని కౌగిట కూడెన్.

శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment