కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అంజినీదేవి కొడుకు హనుమంతుడు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
అంజినీదేవి కొడుకు హనుమంతుడు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : అంజినీదేవి కొడుకు హనుమంతుడు
సంఖ్య : 272
పుట : 182
రాగం : మాళవి
మాళవి
16 అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవినిదెచ్చినాఁడు సారె హనుమంతుఁడు
॥పల్లవి||
కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోనలందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు
|| అంజి||
పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధఁ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు
|| అంజి||
వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు
|| అంజి|| 272
అవతారిక:
కలశాపురంలో వెలసిన హనుమంతునిపైచక్కటి కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. అంజినీదేవి కుమారుడైన ఈ రామబంటు సారెగా సంజీవని పర్వతం తీసికొని వచ్చాడు, అంటున్నారు. సారెగా అంటే పెట్టుబడిగా అని అర్థం చెప్పుకోవాలి. ఉద్ద విడి అంటే చాలా గొప్పగా అని భావించవచ్చును. ఈయన ఆయుధం ఏమిటో తెలుసా? ‘పండ్లగుత్తి’ అంటే ముళ్ళలాంటి పొలుసులున్న గద అన్నమాట. ఆయనతోక కదులుతున్నట్లు భావించగలిగిన ఈ పదకవితాపితామహుడు నిజంగా ధన్యజీవి
భావ వివరణ:
ఓ ప్రజలారా! అంజినీదేవి కుమారుడైన ఈ హనుమంతుడు, రామలక్ష్మణులను రక్షించుటకు సారెగా (పెట్టుబడిగా.. లేక… అర్పణగా) సంజీవినీ పర్వతము తీసికొని వచ్చినాడు.
అల (అదిగో) కలశాపురం అనే ఈ వూరిలో కదలీవనాల నీడ (అరటి తోటల చల్లని నీడలలో) వున్న వాడే హనుమంతుడు. ఈ మహానుభావుడు యెక్కడో కొండల కోనలలో వున్న గుహలో వెలసి, కోరి తన భక్తుల ద్వారా కొలువు చేయించుకొనినాడు. ఈ హనుమంతుడు ఈ రీతిని అలరుచున్నాడు.
పసలుగా (మృదువుగా) జంగవెట్టి (కాళ్ళఅంగజాచి), పండ్లగుత్తి (ముళ్ళవంటి పండ్లు వున్న గదను) చేతిలో పట్టుకొని రాక్షసులనందరినీ ఈ హనుమంతుడు చావబాదినాడు. దివ్యత్వముగల ఈ హనుమంతుడు, ప్రతాపించి (ప్రతాపమును చూపి) తనతోకను వడిన్ కదలించి (వేగముగా వూపి) పాలించీ, దెసలెల్లా (దిక్కులన్నీ ఏలుచున్నాడు).
ఆనాడు త్రేతాయుగంలో ఈయన యేమి చేశాడో తెలుసా? వుద్దవిడి (చాలా గొప్పగా) లంకలోకి చొచ్చి (దూరి) శ్రీరామముద్రికయైన వుంగరమును సీతాదేవికిచ్చి అద్దివో (అదిగో ఆయన శ్రీరామచంద్రుని మెప్పించినాడు. ఈనాడు కలియుగంలో, అటు (ఆ తిరుమల శిఖరాలపై) శ్రీవేంకటేశ్వరునకు బంటై తన భక్తులకు వరమిచ్చి కొద్దిమీర (అశేషముగా) సంతోషములను గుప్పించుచున్నాడు. ఈ స్వామిని సేవించి తరించండి.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: