Harihari Ni Mayamahima In Telugu – హరిహరి నీ మాయామహిమ

ఈ పోస్ట్ లో హరిహరి నీ మాయామహిమ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరిహరి నీ మాయామహిమ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : హరిహరి నీ మాయామహిమ
సంఖ్య : 293
పుట: 196
రాగం: నారాయణి

నారాయణి

100 హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁగదే

||పల్లవి||

తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు

||హరి||

మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్క సమైనది కడ గనరాదు

||హరి||

చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు

||హరి||293

అవతారిక:

హరిహరీ! నీమాయామహిమ క్రమంగా తెలిసికొనునట్లు నన్ను కరుణించితివి, గదే! నేను ధన్యుడనయ్యాను తండ్రీ! నీవే నాపాలి దైవము, నా తల్లివి, తండ్రివి, గురుడవు. నీవే నా ప్రాణానివి. అందుకని నీవే కౌతుకమున నన్నేలితివి. ఈ జీవితానికి ఇది చాలు స్వామి. నేను కళ్ళు తెరిచినా కళ్ళుమూసినా నీ మూర్తే కనబడుతున్నది ఇక ఈ బ్రతుకునకింతకంటే కావలసిందేమి వున్నది ప్రభూ!

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీమాయామహిమల యొక్క తీరుతెన్నులు యెలావుంటాయో | వాటిని సరవి (క్రమముగ) తెలియునట్లు నన్ను అనుగ్రహింపుము ప్రభూ!

దేవా! నేను నిన్నే దేవునిగా తలచెదను. నిన్నే నా తల్లిగాను తండ్రిగాను తలచెదను. మలసి (తిరిగి) అంతలోనే ఆ విషయం మరచిపోతాను. ఏమిటి ప్రభూ! నీమాయ? ఇంతలోనే కలవలె అన్నీ మరచిపోయి యేదో పోగొట్టుకున్నవాడిలా బాధపడి నలిగిపోతాను. ఈ భ్రాంతికి కడగనరాదు (అంతము కనబడదు).

ఒకపరి (ఒకసారి) వూరకనే నీకు మ్రొక్కెదను. ఒకపరి నీవు నా | ప్రభువువని కీర్తిస్తూ మొక్కుతాను. ఒకపరి సృష్ఠి కంతటికి ఆదిమూలము | నీవేనని నమ్ముతాను. నీవు నా పక్షాన వున్నావని ఉక్కున (స్థైర్యము గలవాడనై) గర్వించి ఉబ్బుదును (సంతోషిస్తాను). అటుపై సగ్గుదును (తగ్గిపోతాను). కక్కసమైనది (యెంతో బాధ కలుగుతుంది). కడకనరాదు (దీనికి అంతూ పొంతూ తెలియదు).

ఓ దేవా! నీ దివ్య సుందరమూర్తిని జూచి నీవు మమ్ము సులభముగా అనుగ్రహింతువని తలచెదను. జగములన్నిటికి ఇది సోద్యము (సంభ్రమకరము) అని చూతును. ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ విధముగా | నన్ననుగ్రహించితివి. నాకు యెంతో కౌతుకము (ఆనందము) కలుగుచున్నది. దానికి కడ కనరాదు (అంతు తెలియకుండా వున్నది). నేను ధన్యుడను తండ్రీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment