Kalige Makide Kaivalyasaramu In Telugu – కలిగె మాకిదె కైవల్యసారము

ఈ పోస్ట్ లో కలిగె మాకిదె కైవల్యసారము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కలిగె మాకిదె కైవల్యసారము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : కలిగె మాకిదె కైవల్యసారము
సంఖ్య : 419
పుట: 281
రాగం: బౌళిరామక్రియ

బౌళిరామక్రియ

98 కలిగె మాకిదె కైవల్యసారము
ఫలించె నాడెదఁ బాడెద నేను

||పల్లవి|||

నీపాదతీర్థము నీరజభవుని
పైపై కమండలపానీయము
చేపట్టి శంభుని చిరుజడలలో
దీపించుగంగాతీర్థరాజము

||కలిగె||

ఘన నీ నామమె గౌరినాలిక పై
పనిగొన్న మంత్రపాఠము
అనుఁగువాణికి నాదిచదువులం
బెనఁచే మొదలి బీజాక్షరము

||కలిగె||

శ్రీవేంకటేశ్వర చేరి నీదాసుల
సేవ నాపాలిఁటి జీవనము
ఆవిటించి శరణాగతులకును
త్రోవయైన దిదె దోషహరము

||కలిగె|| 419

అవతారిక:

తనకు కైవల్యసారం సిద్ధించినదని ఆనందంతో ఉత్తుంగ తరంగమై కీర్తన నాలాపిస్తున్న అన్నమాచార్యులవారిని వినండి. తన ఆశయం ఫలించింది కావున ఆడెదను, పాడెదను అని నృత్యం చేస్తూ ఈ కీర్తన నాలాపిస్తున్నారు. త్రివిక్రముడైన శ్రీమన్నారాయణుని పాదాలను కడుగవలెనని బ్రహ్మదేవుడు తన కమండలంలోని నీళ్ళను పోస్తే అది ఆకాశగంగయై ప్రవహించి భగీరథుని కోసం భూమిమీదకు చేరటానికి శివుని తలపై చేరి అక్కడనుండి భూమిపై దూకి ప్రవహించి యావత్ ప్రజానీకాన్ని పునీతుల్ని చేస్తున్నదట. గౌరీదేవి శ్రీహరి నామమంత్రం జపిస్తుందట. వాణికి మొదటి బీజాక్షరాలను ఆదేవ దేవుడే ఇచ్చాడట ప్రభూ! అట్టి నీదాసులను సేవించే భాగ్యం కలిగింది. అదే మాకు కైవల్యసారము అంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! ఇదే మాకు కైవల్యము యొక్క సారము కలిగినది. మా కల ఫలించినది. ఇక నేను ఆడెద (నాట్యం చేస్తాను) పాడెద (కీర్తనలాలాపిస్తాను). ఇంతకీ నాకు సిద్ధించినదేమిటో వినవయ్యా!

ఓ ప్రభూ! నీరజభవుని (బ్రహ్మదేవుని) కమండలంలోని పానీయము (త్రాగేనీరు) శ్రీహరి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయుటకు త్రివిక్రముడైనాడు. అప్పుడు వున్నపళంగా ఆయన కాళ్ళు కడగాలని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళు పోసినాడట. ఆ శ్రీహరి పాదజలము ఆకాశగంగయై దివిలో ప్రవహించి భగీరథునికోసం భూమి చేరుటకు శంభుని శిరసుపై దూకి అచ్చటనుండి ఒక పాయ భూమిపై దూకి కోట్లాది ప్రజలు గంగా తీర్థమని సేవించు, గంగానదియై తీర్థరాజమైనది.

ఓ దేవా! నీ ఘననామము గౌరీదేవి నాలుకపై పనిగొన్న (పూనుకొనిన) మంత్రపఠనమైనది. ఆమె నిత్యమూ చేసే నీ నామసంకీర్తన మాకూ దిక్కైనది. నీ అనుగు కోడలైన వాణికి (సరస్వతీదేవికి) ఆనాడు | సోమకాసురుని జంపి తిరిగి తెచ్చిన ఆది చదువులను (వేదములను) | మొదటి బీజాక్షరములుగా నేడు మాకు విద్యనందించి ఆమెను చదువుల రాణిని చేసినది.

ఓ శ్రీవేంకటేశ్వరా! చేరి నేడు నీదాసులను సేవించుటే నా పాలిట జీవనమైనది. ఆవిటించి (వ్యాపించి) నీ శరణాగతులమైన మాబోటి వారికి | అది దోష రహితమై కైవల్యమునకు త్రోవ యైనది. తండ్రీ! నాబోటి అల్పుడు కూడా నిన్ను చేరే ఆధారమైనది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment