Svatantrumdavu Nivu Sarileni Doravu Ne In Telugu – స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే

ఈ పోస్ట్ లో స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే- కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే-
సంఖ్య 431
పుట:290
రాగం: తోడి

తోడి

97 స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే-
నతికమై యాడినట్లు ఆడఁబోయేవా

||పల్లవి||

యెత నీమనసునను యెట్టుండె నట్లనే
అంతయుఁ జేయవయ్య మాకదే చాలు
అంతకంటే నెక్కుడు నేమంటిమివో యటమీఁదఁ
జెంతల మా చెప్పినట్టు సేయఁబోయేవా

॥స్వతం॥

కమ్మి నీవు మునుప సంకల్పించినట్లనే
కిమ్ముల నారీతిఁ జిత్తగించవయ్య
అమ్మరో నేమందుకుఁ గాదనినను నీవు
సమ్మతించి మాతలఁపు సాగనిచ్చేవా

॥స్వతం॥

పొంచీదేహమున మమ్ముఁ బుట్టించినట్లనే
పెంచి నీపై భక్తిమాకుఁ బెనచవయ్య
నించిన శ్రీవేంకటేశ నేనే పదరితిఁగాక
మంచితనములు నీవు మానఁబోయేవా

॥స్వతం॥ 431

అవతారిక:

అన్నమాచార్యులవారి అద్భుత సృష్టి ఈ కీర్తన. స్వామీ! నీవు సర్వస్వతంత్రుడవు. నీకెవరన్నా ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని నిర్దేశించగలరా? నీకు సమానమైన యెవ్వరూలేని ప్రభువు నీవే. నేను ఆడమన్నట్లు ఆడతావా యేమిటి? నీ ఇష్టమొచ్చినట్లే చేస్తావు. ఏదో అజ్ఞానిని పైగా వదరుబోతును. నీ మంచితనం నీకే వుంటుంది. కాస్త నన్ను బాగుచేయవయ్యా! నీపై మాకు భక్తి పెంచవయ్యా! ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో తరిస్తాను. నన్ను మాత్రం నీ భక్తి నుండి విడదీయకు. నీనుండి విముఖుని చేయకు. నీకు పుణ్యం వుంటుంది. నాకు నీ భక్తి చాలు అంటున్నారు.

భావ వివరణ:

ప్రభూ! నీవు సర్వస్వతంత్రుడవు. నీకు సమానమైన వారెవ్వరూ లేని దొరవు (యేలికవు). నేనూ అతికమై (నిన్ను మించి) ఆడమన్నట్లు ఆడబోయేవా? (ఆడెదవా యేమి?) చివరికి నీ ఇష్టం వచ్చినట్లే నీవు చేస్తావు.

నీ మనసున యెంత యెట్లావుంటే అట్లనే అంతా చేయవయ్యా! నిన్ను | కాదనగలవారెవరు? నీవేమి చేస్తే మాకు అదే చాలు. అంతకంటే యెక్కువ యేమాత్రం యేమన్నాము? వో అటుమీద మేము చెప్పినట్లు చేయబోయేవా యేమి? నీకెట్లా తోస్తే అట్లాగే చేయవయ్యా!

మునుప (మేము అమ్మకడుపులోంచి బయటకు రాక మునుపే) నీవు కమ్మి సంకల్పించావు. (పైకొని నిశ్చయించావు). నాదేమున్నది? కిమ్ముల (రహస్యంగా) నారీతి జిత్తగించవయ్యా (అట్లాగే చేయవయ్యా). అమ్మరో! (అమ్మయ్యో!) నేము (మేము) అందుకు కాదనినను నీవు అంగీకరించి మా | ఇష్టం సాగనిస్తావా యేమన్నానా? అలాగే కానీవయ్యా!

పొంచీ (కావాలని) ఈ దేహము మాకిచ్చి నీవే మమ్ము పుట్టించావు. సరే! అయినదైదో అయింది. నా విన్నపమొక్కటే, మమ్మల్ని పెంచినట్లే మాకు నీపై భక్తిని కూడా పెంచవయ్యా! మంచితనము నిండిన ఓ శ్రీవేంకటేశ్వరా! నేనే పదరితిని (నేనేయేదో వాగాను). నీవు నీమంచితనం మానుకొంటావా యేమి? ఎట్లాగైనా నీవు మమ్మల్ని కరుణిస్తావు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment