Appadaina Hariyekke Nadivo Teru In Telugu – అప్పడైన హరియెక్కె నదివో తేరు

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో అప్పడైన హరియెక్కె నదివో తేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అప్పడైన హరియెక్కె నదివో తేరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : అప్పడైన హరియెక్కె నదివో తేరు
సంఖ్య : 35
పుట : 24
రాగం : పాడి

పాడి

17 అప్పఁడైనహరి యెక్కె నదివో తేరు
యిప్పుడు తిరువీధుల నేఁగీ తేరు

||పల్లవి||

సముద్రాలమీఁదఁ దోలె సర్వేశ్వరుఁడు తేరు
భ్రమయ జరాసంధుపై ఁ బరపెఁ దేరు
తిమురుచు రుక్మకువై ఁ దిరుగఁ దోలెఁ దేరు
ప్రమదాన సృగాలునిపై ఁ దోలెఁ దేరు

||అప్పఁ||

కమ్మి యక్రూరుఁడు దేఁగా కంసునిపై నెక్కెఁ దేరు
బమ్మరపో దంతవక్త్రుపైఁ దోలెఁ దేరు
దుమ్ములుగా సాల్వునిపై దొడ్డగాఁ దోలినతేరు
దొమ్మి రుక్మిణిపెండ్లికిఁ దోలినట్టితేరు

||అప్పఁ||

మీఱి హంసడిచికులమీఁదఁ దోలినట్టితేరు
తూఱి సంధిమాటలకుఁ దోలినతేరు
ఆఱడి శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ గూడి
చూఱలుగొన నెక్కెను శోభనపు తేరు

||అప్పఁ|| 35

అవతారిక:

శ్రీవేంకటేశ్వరుని తేరు (రథము) తిరుమల తిరువీధులగుండా వూరేగిపోతున్నది. పరవశించిన అన్నమాచార్యులవారు ఆ హరి యేయే సందర్భాలలో నాలుగు అశ్వముల పూన్చి తను తోలే రథమునేకాక పరులు తోలే రథములను కూడా యెప్పుడెక్కాడో పునశ్చరణ చేసికొంటున్నారు ఈ కీర్తన ద్వారా. పురాణవాఙ్మయము బాగాపరిచయంవుంటేకాని ఈ ప్రయత్నం సిద్ధించదు. సృగాలుడు అనేవాడు నక్క రూపంలోవుండే రాక్షసుడు (నరకాసురుడేమో!!) ఇవన్నీ అటువంచి “హంసడిచికుల మీదన్ తోలినట్టితేరు” అన్న చరణంలో నాకేమీ పాలుపోలేదు. స్వామి తనశత్రువుపై యుద్ధానికి రథం పై వెళ్ళాడని తెలుస్తూనే వున్నది. హంస అంటే శివుడు లేక విష్ణుడు. ఆయనపై ఆయనే యుద్ధానికి వెళ్ళడు కదా! కాబట్టి ఆ మాటకు అర్థం శివభక్తుడైన బాణాసురుడని భావించాను. ఇక చదవండి. నేనూ బ్రహ్మెత్సవాలలోనే దీన్ని వివరిస్తున్నాను.

భావ వివరణ:

అదిగో ఈ విశ్వమునకంతటికీ అప్పడు (తండ్రి) అయిన శ్రీహరి, తేరు యెక్కెను (రథము) పైయెక్కినాడు. ఇప్పుడు ఈ తిరుమల తిరువీధులలో ఈ రథము పోతున్నది. కనుల పండువుగా చూచి తరించండి.

ఒకప్పుడు ఈ సర్వేశ్వరుడు తన తేరును సముద్రాలమీద తోలినాడు. (అర్జునునికి తన ఆదినారాయణుని రూపం చూపాలని తన రథముపై శ్రీకృష్ణుడు వైకుంఠం తీసికొని వెళ్ళాడు). జరాసంధుడు భ్రమించి మతిపోగొట్టుకునేట్లు రథం తోలాడీయన. (వాడి అక్షౌహిణీ సైన్యమూ నశించేది). తిమురుచు (ఉద్రేకముతో) రుక్మకుపై (రుక్మిపై తిరగబడితోలిన రథము ఇదే (రుక్మిణీ స్వయంవరంలో). ప్రమదాన (సంతోషముతో) సృగాలునిపై (నక్కరూపంలో వున్నరాక్షసునిపై) తోలిన రథము ఇదే (బహుశా నరకాసురుడు అయివుండవచ్చు).

అక్రూరుడు తీసికొనిరాగా కమ్మి (విజృంభించి) కంసునిపై దండెత్తిన తేరు ఇదే, (ఈ రథముపైననే అక్రూరునికి శ్రీకృష్ణుడు భగవంతుడని అర్థమైంది). దంతవక్త్రుడు భ్రమచెంది నిస్తేజుడగునట్లు శ్రీకృష్ణుడు తోలిన రథము ఇదే, (శ్రీహరిద్వారపాలకుడైన విజయుడే వీడై పుట్టాడు). ఈ రథముపైననే శ్రీకృష్ణుడు దుమ్మురేగునట్లు సాల్వునితో యుద్ధం చేశాడు. (అంబను కాదన్నదీ సాల్వుడే). రుక్మిణీ కళ్యాణము సందర్భంగా రుక్మిణితోలిన రథం ఇదే, (శ్రీకృష్ణుడు శిశుపాలుని చిత్తుచేశాడీ రథంపైనుండే)

మీఱి (విజృంభించి) శివుడు రక్షణగా వచ్చిన బాణుని శ్రీకృష్ణుడు ఓడించినదీ రథముపైననే (ఉషాపరిణయం దీని తరువాతనే జరిగింది). సంధిమాటలు తూఱి (విఫలమై) భారతయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణపరమాత్మ, పార్ధసారధియైనదీ రథముపైననే (భగవద్గీతకు వేదిక ఈ రథమే). నేడు శ్రీవేంకటేశ్వరుడు, అలమేల్మంగను ఆరడిన్ (మించి) కూడ, చూఱలుగొని (ఆదరణపొంది) ఎక్కిన శోభనపు తేరు (కళ్యాణప్రదమైన రథము) ఇదే. (చూచి తరించండి).

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment