ఈ పోస్ట్ లో పసులు గాచేటి కోల పసపుజేల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
పసులు గాచేటి కోల పసపుజేల – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 5
కీర్తన : పసులు గాచేటి కోల పసపుజేల
సంఖ్య : 96
పుట: 66
రాగం: ముఖారి
ముఖారి
84 పసులు గాచేటి కోల పసపుఁ జేల
పొసఁగ నీకింతయేల బుద్ధుల గోల
|| పల్లవి||
కట్టిన చిక్కపు బుత్తి కచ్చకాయల తిత్తి
చుట్టిన పించెపుఁబాగ చుంగుల సోగ
ఇట్టి సింగారము సేయ నింత నీకుఁ బ్రియమాయ
వెట్టి నీచేఁతల మాయ విట్టలరాయ
||పసులు||
పేయలఁ బిలుచుకూఁత పిల్లఁగోవి బలుమోఁత
సేయరాని గొల్లెతల సిగ్గులచేఁత
ఆయెడలఁ దలపోఁత యమున లోపలి యీఁత
వేయరాని మోపులాయ విట్టలరాయ
||పసులు||
కొంకులేని పొలయాట కూరిములలో తేట
అంకెల బాలులతోడి యాట పాట
పొంకపు తుత్తురు కొమ్ము పొలుపైన నీ సొమ్ము
వేంకటనగము చాయ విట్టలరాయ.
||పసులు||
అవతారిక:
విఠల దేవుని విట్టలరాయా అని సంభోదిస్తూ గొప్ప జానపదకీర్తన చెబుతున్నారు అన్నమయ్య. ఇటువంటి కీర్తన నాస్వాదించినప్పటికీ దీని ప్రత్యేకత యేమంటే చాలా మాటలు యధాతధంగా నిఘంటువులలో దొరకవు. “పసపు జేల” అంటే ఏమిటి? పసుపురంగు చేలము అని అర్థం చేసికోవాలి, అంటే పీతాంబరుడైన కృష్ణుడు, దూడలను కాచే ఈ విట్టలరాయుడు వింతకూతవేసి ఆ దూడల్ని తన దగ్గరకు పిలుస్తాడట. ఎంతని చెప్పను? గొప్ప వర్ణన. మీరే రుచి చూడండి.
భావ వివరణ:
ఈ విట్టలరాయడు (విఠలుడు) యెలావున్నాడంటే ఈతడు పసుపుజేల (పీతాంబరము) కట్టిన శ్రీకృష్ణుడు ఇతని చేతిలో పసులుగాచే కోల (ముల్లుకఱ్ఱ) వుంటుంది. స్వామీ! పొసగ (అతిశయించుటకు) నీకింత బుద్ధుల గోల యెందుకయ్యా!
ఇతడు తన బుత్తి (భోజనము) చిక్కములో (చిన్న వుట్టిలో) కట్టి తెచ్చుకొన్నాడు. గచ్చకాయలు తిత్తి (గచ్చకాయరంగులో వుండె తన వుంగరాల జుట్టును కుచ్చులుగా కట్టుకొన్నాడు. చుట్టిన తలపాగలో నెమలిపింఛము గుచ్చి అలంకరించుకొన్నాడు. ఇటువంటి సింగారము నీకు ఇంత ప్రియమా విట్టలరాయా! నీచేతలు యెంతవెట్టి (పనికిమాలిన) వో చెబుతాను, వినవయ్యా!
ఈ విట్టలరాయుడు తన ఆవు పేయలను (దూడలను) ఒక వింతయైన ‘కూత’తో పిలిచి ఒకచోట చేరుస్తాడు. అతని పిల్లఁగోవి (మురళి) బలు మోత (పెద్ద ధ్వని చేస్తుంది). అతడు గొల్లెతలతో చేయరాని సిగ్గుల చేతలు చేస్తాడు. ఆపైన యమునాతటిలో అతని లీలలు తలపోతలు వేయరాని మోపులు (ఆరోపణలకు) దారితీశాయి.
కొంకులేని (ఏమాత్రమూ జంకులేని) అతని పొలయాట (రాసలీల) కూరిములలో తేట (ప్రణయమాధుర్యపు తేట). అంకెల బాలులతోటి (తన ఈడు గొల్ల బాలురతో) నిత్యమూ ఆటపాటలతో కాలక్షేపం చేస్తాడు. ఈ వేంకటాద్రి నీడలోని విట్టలరాయా! నీ పొలుపైన సొమ్ము (ఒప్పయిన ఆభరణం) యేమిటో తెలుసునా స్వామీ? నీ పొంకపు తుత్తురుకొమ్ము (నీ అందమైన తూతూ ధ్వనిచేసే శృంగనాదము). దానినే కొందరు “కొమ్ముబూర” అంటారు.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: