ఈ పోస్ట్ లో భక్తి నీపై దొకటె పరమసుఖము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
భక్తి నీపై దొకటె పరమసుఖము – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: భక్తి నీపై దొకటె పరమసుఖము
సంఖ్య : 322
పుట: 218
రాగం: శుద్ధవసంతం
శుద్ధవసంతం
76 భక్తి నీపైదొకటె పరమసుఖము
యుక్తిచూచిన నిజం బొక్కటే లేదు.
||పల్లవి||
కులమెంత గలిగె నది కూడించు గర్వంబు
చలమెంత గలిగె నది జగడమె రేఁచు
తలఁపెంత పెంచినాఁ దగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటా లేదు.
||భక్తి||
ధన మెంత గలిగె నది దట్టమౌ లోభంబు
మొనయుఁ జక్కందనంబు మోహములు రేఁచు
ఘనవిద్య గలిగినను కప్పుఁ బైపై మదము
యెనయఁగఁ బరమపద మించుకయు లేదు.
||భక్తి||
తరుణు లెందరుఅయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు
యిరవయిన శ్రీవేంకటేశ నినుఁ గొలువఁగా
పెరిగె నానందంబు బెళకు లిఁకలేవు.
||భక్తి||322
అవతారిక:
ప్రభూ! పరమసుఖమిచ్చేది ఈ ప్రపంచంలో యేదన్నా వున్నదంటే అది నీపై కలిగిన భక్తి మాత్రమే. అయితే ప్రాపంచిక సుఖాలు మాత్రమే అవసరం అనుకొన్నంత కాలమూ భక్తి రుచి మనిషి గ్రహించలేడు. యుక్తాయుక్త విచక్షణ వున్న వారికి నిజమైన సుఖము ఒక్క భక్తియేనని తెలుస్తుంది. శ్రీవేంకటేశ్వరుని కొలిచిన ఆనందము పెరగటమే కాదు ఆపైన ఇక బెళకులుండవుట. కులము, ధనము, పేరు ప్రతిష్ఠలు, విద్యావైశిష్ట్యమూ… యేవీ శ్రీహరి భక్తికి సాటిరావంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! మాకు నీపై భక్తియొక్కటే పరమ సుఖము (దైవికమైన సౌఖ్యమును) ప్రసాదించును. యుక్తి జూచిన (విచక్షణతో పరికించిన) ఆ పరమసుఖము ఒక్కటే నిజమైనది. మరియేదియును లేదు.
ఎవ్వరి“కులమై”నా యెంతగొప్పదైనా ప్రయోజనమేమిటి? దానివల్ల గర్వం పెరుగుతుంది, అంతేకద! జగడమెందుకువస్తుంది? యెంత ‘చలము’ (ద్వేషము) వుంటే, అది అంత వస్తుంది. ‘తలపు’ అధికమయిందంటే కోరిక తగులుకొంటుంది. అవన్నీ పీడిస్తున్నవాడికి యెలమి (అతిశయించిన విజ్ఞానము (భగవత్సంబంధమైన జ్ఞానము)
యెలాకలుగుతుంది?
ఇంకొక వింత యేమిటంటే ధనమెంత పెరుగుతుంటే లోభత్వం అంత యెక్కువవుతుంది. స్త్రీ పురుషులలో సౌందర్యమెక్కువైతే మోహము వారిపై పెరుగుతుంది. పోనీ విద్య వలన కూడా మంచి జరుగదు. భక్తిలేనివాడికి యెంత విద్యవున్నా అది మదమును పెంచటానికి తప్పించి ఇంకెందుకు ఉపయోగిస్తుంది? ఎనయగ (అవన్నీ వృద్ధిచెందివున్నచోట) పరమపదము ఇంచుకయినా సాధ్యంకాదు.
తరుణులు (స్త్రీలు) యెంతమందివున్నా పురుషులకు మదనతాపము కలుగుతూనే వుంటుంది. ఏమాత్రం తగ్గదు. సిరిసంపదలెన్నివున్నా చింతలు (దిగులు) పెరుగుతుందేకాని తరుగదు. స్థిరమైన శ్రీవేంకటేశ్వరా! నిన్ను కొలిచినయెడల ఆనందము పెరుగుతూనే వుంటుంది. వారికి బెళకులు (చలించిపోవుటలు) లేవు (వుండవు).
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: