ఈ పోస్ట్ లో నరులార నేఁడువో నారసింహజయంతి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
నరులార నేఁడువో నారసింహజయంతి – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 4
కీర్తన : నరులార నేఁడువో నారసింహజయంతి
సంఖ్య : 310
పుట: 208
రాగం: ముఖారి
ముఖారి
6 నరులార నేఁడువో నారసింహజయంతి
సురలకు నానందమై శుభము లొసఁగెను
||పల్లవి||
సందించి వైశాఖశుద్ధ చతుర్దశి శనివార-
మందు సంధ్యాకాలమున నౌభళేశుఁడు
పొందుగాఁ గంభములోనఁ బొడమి కడపమీఁద
కందువ గోళ్ళఁ జించెఁ గనకకశిపుని
||నరుఁ||
నరమృగరూపము నానాహస్తములు
అరిది శంఖచక్రాది ఆయుధాలతో
గరిమఁ బ్రహ్లాదునిఁ గాచి రక్షించి నిలిచె
గురుతరబ్రహ్మాండ గుహలోనను
||నరుఁ||
కాంచనపుగద్దె మీఁద గక్కనఁ గొలువైయుండి
మించుగ నిందిరఁ దొడమీఁదఁ బెట్టుక
అంచె శ్రీవేంకటగిరి నాదిమపురుషుండై
వంచన సేయక మంచివరాలిచ్చీనదివో
||నరుఁ||
అవతారిక:
ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.
భావ వివరణ:
ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.
ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.
ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.
ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: