Accutum Daniyedi Namamu Galiginayatti In Telugu – అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి
సంఖ్య : 104
పుట: 70
రాగం: సామంతం

సామంతం

1 అచ్చుతుఁ డనియెడి నామముగలిగినయట్టి నీవెకాక
కుచ్చి నీకు నేశరణని కొలిచితి గురుతుగఁ గావఁగదే

||పల్లవి||

అణురూపగు మశకములోపల నణఁగిన నీకంటే
గుణించి యెంచి చూచినను కొంచె మింక నేది
ప్రణుతింపంగ బ్రహ్మాండకోట్లు భరియించు నీకంటే
గణనకు నెక్కుడు నీవేకాక ఘన మిఁక నేది

||అచ్చు||

దాకొని జగములు పుట్టించుబ్రహ్మకు తండ్రివి నీవే
కైకొని చదువులఁ దెలిసిచూడ రక్షకు లిఁక మరి వేరీ
యేకోదశముగ వటపత్రమున యీఁదేటి నీకంటే
దీకొని పలికిన కాలంబులు కొనదేవుఁడు మఱి వేఁడీ

||అచ్చు||

శ్రీవేంకటమున వరము లొసఁగేటి శ్రీపతి నీకంటే
తావునఁ గన్నులఁజూడఁగఁ బ్రత్యక్షదైవము మరివేఁడీ
వేవేలకు వైకుంఠవిభుఁడవై వెలసిన నీకంటే
భావించి చూచిన నంతరంగమునఁ బరోక్షదైవము మరివేఁడీ

||అచ్చు||

అవతారిక:

శ్రీమన్నారాయణుని స్తుతిస్తున్నారు అన్నమాచార్యులవారు. ‘కుచ్చి’ అంటే కుచించుకుపోయి, లేక బాగా తగ్గిపోయి అని అర్థం. అచ్చుతుడంటే ‘చ్యుతి’ లేక నాశనమెరుగనివాడు. “ఓ ప్రభూ! అచ్చుతుడనే పేరుగల నీవు కాక, రక్షించే వారెవరు వున్నారు? అణకువతో నిన్ను శరణని కొలిచితేచాలు. ఈ మాటే గుర్తుగా మమ్ము గావగదే!” అంటున్నారు భక్తిని ప్రకటించాలి అంటే శరణాగతిని మించిన ఉపాయము లేదు. ఈ కీర్తన వివరణ అనుకున్నంత తేలికకాదని పల్లవి చదవంగానే అర్థం అయింది. అయితేనేమి ఆదిలోనే ఆదిదేవునితో అంతయు నీవేహరి పుండరీకాక్ష! అన్నాము కదా! ఇంకా భయమెందుకు? పదండి ముందుకు.

భావ వివరణ:

ఓ దేవదేవా! అచ్చుతుడు (అచ్యుతుడు) అనే పేరుగల నీవు తప్పించి, మాకు మరొక దిక్కులేదు. నీకు నేను కుచ్చి (వినమ్రుడనై) నీవే శరణని కొలిచితిని. నన్ను గురుతుగ (నన్నే లక్ష్యముగా) కావగ (రక్షింపు తండ్రీ)

అణురూపములోనున్న (అత్యల్ప పరిమాణముగల) మశకము (దోమ) లోపలకూడా అణగియున్న నీకంటే లెక్క కట్టటానికి, కొంచెమింకనేది (అల్ప ప్రాణియేదీ?) ప్రణుతింపగా (కీర్తించగా) అనంత కోటి బ్రహ్మాండములను నీ వుదరములో భరిస్తున్నావు. గణనకు నెక్కిన (ప్రసిద్ధుడైన) దెవరు? ఎవ్వరూ లేరయ్యా!

దాకొని (అవ్యక్తుడవై) జగములనన్నింటినీ సృజించు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని సృజించి నీవు ఆయనకు తండ్రిగారైనావు. ఆనాడు సోమకుడు అనే రాక్షసుడు ఆయన దగ్గరనుంచి చదువులను (వేదములను కాజేస్తే నీవు కైకొని (పూనుకొని) వాడిని చంపి, వాటిని కాపాడినావు. నీకంటే రక్షకులెవరు?

ఏకోదకముగా (ఒక్క నీరు తప్ప ఇంకేమీ లేనట్లుగా వున్నప్పుడు, వటపత్రశాయివై (ఒక్క మఱియాకుపై పవ్వళించిన శిశువు వలె యీదేటి (తేలిన) నీకంటే దీకొని పలికిన (ధైర్యంగా చెప్పాలంటే) కాలంబుల కొనదేలిన (యుగాంతాలలో కూడావుండే దేవుడు మఱివేఁడి (ఇంకలేడయ్యా!)

శ్రీవేంకటాద్రి మీద వెలసి వరములనొసగే శ్రీపతీ! నీకంటే తావున గన్నుల జూడ (నెలకొని చూడాలంటే) ఇంకొక ప్రత్యక్షదైవము లేనేలేడు. వేవేలకు (వేలకొద్దీ శరణాగతుల కొరకు) వైకుంఠపతివై ఈ తిరుమలలో వెలసిన నీకంటే అంతరంగమున (మానసాకాశమున) భావించి చూచిన (భావనలో నిలిపి సందర్శించిన) ఇంకమరి యొక పరోక్షదైవము (ఇంద్రియములకు _గోచరింపని పరమాత్మ) మరి వేఁడీ (ఇంకాయెవ్వరున్నారు?)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment