ఈ పోస్ట్ లో భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 3
కీర్తన: భూమిలోన గొత్తలాయ బుత్రోత్సవ మిదివో
సంఖ్య : 17
పుట: 12
రాగం: రామక్రియ
రామక్రియ
77 భూమిలోనఁ గొత్తలాయఁ బుత్రోత్సవ మిదివో
నేమపు కృష్ణజయంతి నేఁడే యమ్మా
||పల్లవి||
కావిరి బ్రహ్మాండము కడుపులోనున్నవాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుఁడు యెట్టు గనెనమ్మా.
||భూమి|||
పొడవుకుఁ బొడవైన పురుషోత్తముఁడు నేఁడు
అడరి తొట్టెలబాలుఁడాయ నమ్మ
వుడుగక యజ్ఞ భాగమొగి నారగించేవాఁడు
కొడుకై తల్లిచన్నుగుడిచీనమ్మా.
||భూమి||
పాలజలధియల్లుండె(డై?) పాయకుండేయీతనికి
పాలవుట్లపండుగ బాఁతే (తా?) యనటే
ఆలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చుపెరిగీనమ్మా
||భూమి||17
అవతారిక:
శ్రీకృష్ణజయంతి పర్వదినాన అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తన ఇది. “ఓ అమ్మలారా! మనం అంతా నియమంతో జరుపుకొనే కృష్ణజయంతి వేడుక నేడు నందుని ఇంట పుత్రుడుదయించాడనె వుత్సవం భూమిపై ప్రతియేడూ జరుపుకొంటున్నా అది యెప్పటికప్పుడు కొత్తలాయె” అంటున్నారు అన్నమాచార్యులవారు. ఆ అల్లరి కృష్ణుడు శ్రీవేంకటాద్రిపై ఆటలాడుట మరిగిపేలరియై కడుపెచు పెరిగీనమ్మా! అంటున్నారు. అంటే యేమిటి? ‘పేలరి’ అంటే వదరుబోతు అని అర్థం. వాగుడుకాయ అన్నమాట. మరి “బాత్రేయనటే” అంటే….?
భావ వివరణ:
ఓ అమ్మలారా! ఇదివో ఈ పుత్రోత్సవము (పుత్రుని పుట్టుక సందర్భంగా చేయు పండుగ) భూమిపై కొత్తలాయ (ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది). నేడే అట్టి కృష్ణజయంతి. ఇది నేమపు పండుగ (నియమం ప్రకారం జరిపే పండుగ).
కావిరి బ్రహ్మాండము (అనంత నిశీధిలో యెడతెగక విస్తరించే విశ్వము) తన బొజ్జలో దాచుకొన్న ఈ విశ్వరూపుని కంసుడి చెల్లెలు దేవకీదేవి తన గర్భమున మోసిందమ్మా! అద్దిర! (అదిరా… ఎంతంటే) దేవతలంతా త్రిభువనాలు వెదకినా కనబడని ‘పరమాత్మ’ యీ యాదవరాజు వసుదేవుడికి యెట్లా కనుపించాడో కదా!
ఆ దేవదేవుని లీలలు చెప్పలేమమ్మా!
పొడవుకు బొడవైన (ఉన్నతోన్నతుడైన ఈ పురుషోత్తముడు నేడు, అడరి (అతిశయించి) తొట్టెలో బాలుడు (ఉయ్యాలలో శిశువు) యైనాడమ్మా! ఈ ప్రపంచంలో యెక్కడ యే యజ్ఞం జరిగినా ఆ యజ్ఞభోక్త (యాగఫలములో మొదటిభాగం ఈయనకే అర్పిస్తారు. దానిని ఆయన వుడుగక (వదలక) నారగించీ (స్వీకరిస్తాడు). అట్టి యజ్ఞపురుషుడు, కొడుకై చనుబాలుత్రాగుతున్నాడే… ఆహా! ఏమిఈ పరమాత్ముని లీల.
ఈయన యెవరో తెలుసునటే? క్షీరసాగరునికి స్వయంగా అల్లుడు. పైగా ఆయన నివాసస్థానంకూడ పాలసముద్రమే. అటువంటి వాడికి పాలవుట్లు తెంచేపండుగ ‘బాతేయనటే’ (ప్రేమకలిగిందటనే?) ఎంతెంత మనం పండుగ చేసికొంటే అదే ఆయనకు పండుగ. ఇవన్నీ ఆవిశ్వాత్మునికెందుకమ్మా? నేడు ఈ తిరుమలలో ఆలరి (అల్లరిపిల్లవాడే) శ్రీవేంకటాద్రిపై ఆటలాడమరగినాడు. పేలరియై (అతివాగుడుకాయయై) ఈ పిల్లవాడు కడుపెచ్చుపెరిగీనమ్మా (తెగ విజృంభిస్తున్నాడమ్మా!)
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: