Kodekadu Gadavamma Govindaraju In Telugu – కోడెకాడు గదవమ్మ గోవిందరాజు

ఈ పోస్ట్ లో కోడెకాడు గదవమ్మ గోవిందరాజు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
సంఖ్య : 95
పుట:57
రాగం: దేశాక్షి

దేశాక్షి

8 కోడెకాఁడు గదవమ్మ గోవిందరాజు
వేడుక మోవులతేనె విందారగించీని

||పల్లవి||

కొలువు కూటములోన గోవిందరాజు వాఁడే
పలుమారుఁ జెలులతోఁ బందేలాడీని
నిలువుల మేడమీఁద నిలిచి గోవిందరాజు
వలపులు చల్లుచును వసంతాలాడీని

||కోడె||

కోరి కేళాకూళిలోన గోవిందరాజు వాఁడే
సారె నింతులతో నీరు చల్లులాడీని
తూరుచు సింగారపుఁ దోటలో గోవిందరాజు
సైరణ లేకందరితో జాజరలాడీని

||కోడె||

గోముల శ్రీవేంకటాద్రి గోవిందరాజు వాఁడె
రామలతోడుతను సరసమాడీని
గామిడై పాన్పుపైఁ గూడి కందువ గోవిందరాజు
మోములు చూచందరితో ముచ్చటలాడీని.

||కోడె||

అవతారిక:

నిఘంటువు సాయం లేకపోతే ఈ కీర్తన వివరించడం దాదాపు అసాధ్యమే. కోడె వయసుగాడైన గోవిందరాజు వేడుకతో అధరామృతాల నాస్వాదిస్తుంటాడట. నిలువులు మేడమీద నిలిచివుంటాడట. కేళాకూళి అంటే జలక్రీడలని అర్థం. అవంటే మహా ఇష్టంట ఆయనకి. సైరణలేక జాజరచల్లుతాడట. రామలతో సరసాలాడతాడట. మోములు చూచి అందరితో ముచ్చట్లాడతాడట. పాన్పుపై గామిడై కూడినాడట. ఒకటారెండా? దాదాపు అన్నీ తెలియని తెలుగుమాటలే. తెలివిగా భావవివరణ చదివేద్దాం. పదండి ముందుకు. ఇంతకీ ఈ కీర్తన తిరుపతిలోని గోవిందరాజ స్వామిపైననే సుమండీ.

భావ వివరణ:

ఓ భామలారా! ఈ గోవిందరాజస్వామివున్నాడే, ఈయన కోడెగాడు గదమ్మా (కోడెవయసువాడు కదుటమ్మా!) ఈయన వేడుకతో భామల మోవితేనెలు (అధరామృతములను) విందారగించీని (విందువలె నాస్వాదిస్తాడు).

ఈ గోవిందరాజస్వామి తన కొలువుదీర్చియున్నాడు. కానీ తన చెలులతో (ఇద్దరు భామలు భూదేవి శ్రీదేవిలతో) పందేలాడీని (పందెములు కాస్తున్నాడు). ఆయన నిలువులు మేడల మీద (ఎత్తయిన మేడలమీద) నిలిచి అందరినీ పరికిస్తుంటాడు. తన చెలియలతో వలపులు చల్లుతూ వసంతోత్సవం చేసికొంటాడు (హెూలీ ఆడుతుంటాడన్నమాట).

ఆ గోవిందరాజస్వామికి ఇంకొక ఇష్టమైన ఆట వున్నది. అదే కేళాకూళి (జలక్రీడ). బహు కోరికతో ఆయన జలక్రీడను ఇంతులతో (స్త్రీలతో) నీరు చిమ్ముతూ చల్లులాడీ (చల్లుతూనే వుంటాడు). ఆయన శృంగార వనములో తూరుచు (దూరిపోయి) సైరణ లేక (ఆపటం అనేదే లేకుండా) జాజరలాడీని (వున్నట్టుండి వెనుక నుండి నీళ్ళు చిమ్మటం లాంటి కొంటె పనులు చేస్తుంటాడు).

ఈ గోవిందరాజస్వామే, గోముల (సౌకుమార్యంతో) శ్రీవేంకటాద్రిపై రామలతో (స్త్రీలతో) సరసములాడీని (సరసములాడుతున్న) శ్రీవేంకటేశ్వరుడు కూడా అయివున్నాడు. గామిడై (సర్వశ్రేష్ఠుడై) ఈ గోవిందరాజస్వామి తన శయ్యపై, కందువ గూడి (సమర్ధుడై కూడి) మోములు చూచి (వారి అందమైన మొగములను తదేకంగా చూస్తూ) ముచ్చటలాడుతుంటాడు. (ఇన్ని చేస్తూ కూడా శరణాగతులను ఒక కంట కనిపెడుతూనే వుంటాడు సుమా!)

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment