ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
వేడుక కాడితడు విట్టలేశుడు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 14
కీర్తన : వేడుక కాడితడు విట్టలేశుడు
సంఖ్య ; 590
పుట : 340
రాగం: రామక్రియ
రామక్రియ
9 వేడుకకాఁ డితఁడు విట్టలేశుఁడు
వీడని పొందులు సేసీ విట్టలేశుఁడు
||పల్లవి||
వెన్నదిన్న మదమున వెలఁదులుఁ దానును
వెన్నెలలో నాడీ నిదె విట్టలేశుఁడు
పన్ని రతుల కింతులఁ బాంచజన్యరవమున
సన్న సేసి పిలిచీని సారె విట్టలేశుఁడు
॥వేడు॥
ఆసపడి కొలువులో నాడువారి మీఁదట
వేసీ విరులఁ గొని విట్టలేశుఁడు
వేసరక పదారువేలు సతులయిండ్ల
సేసవెట్టి పెండ్లాడీఁ జేరి విట్టలేశుఁడు
॥వేడు॥
మెల్లనె గందమిచ్చేటి మెలుతను గాఁగిలించి
వెల్లవిరిగాఁ గూడె విట్టలేశుఁడు
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డితఁడె తానై వుండి
యెల్లగాఁ గోనేట వరాలిచ్చె విట్టలేశుఁడు
॥వేడు॥590
అవతారిక:
వేడు కాడంటే నేటి పరిభాషలో ‘జల్సారాయుడు’ అన్నమాట. అట్లాంటి ఈ విట్టలేశుడు వీడని పొందులు సేసీ నంటున్నారు. అన్నమాచార్యులవారు. మెలత యొకతె మెల్లగా గంధమియ్యబోయిందట. ఈ విట్టలేశుడు వూరకుంటాడా? వెల్లవిరిగా ఆమెను కౌగలించి కూడినాడట. ఆ సంతోషంలో కోనేటి ఒడ్డున యెల్లగా వరాలిచ్చేస్తున్నాడట. అంతే కాదండీ ఈ విట్టలేశుడే ఆ శ్రీవేంకటేశ్వరుడూనూ అంటున్నారు. పండరంగి విట్టలునిపై చక్కటి సరస శృంగార కీర్తన ఇది. ఇదే బ్రహ్మానందం. అవునా?
భావ వివరణ:
ఓ భక్తులారా! ఈ విట్టలేశుడు గొప్ప వేడుకకాడు (విలాసపురుషుడు). ఈయన వీడని పొందులు సేసి (విడుపులేని రతి కూటములు గల శృంగార పురుషుడు).
ఈ విట్టలేశుడు వెన్నలనారగించి. అటు పిమ్మట సంతోషముతో పండువెన్నెలలో వెలదులతో (రమణులతో) ఆడిని రాసక్రీడల దేలినాడు. రతుల కొరకు ఈయన ఇంతులను, పన్ని (పన్నుగడతో) పాంచజన్య శంఖానాదము సంకేతముగా, సారెకు (ప్రతిసారీ) సన్నసేసి (సైగజేసి) పిలిచీని (పిలుస్తాడు). ఎంత టక్కరివాడో చూడండి.
ఈ విట్టలేశుడు ఆసపడి (వ్యామోహము కలవాడై) అంతమంది స్త్రీల గుంపులోనున్న ఆడువారిపై కూడా విరులవేసి (పూవులను జల్లి) తన వశము చేసికొంటాడు. వేసరక (విసుగు అనే మాటలేక) పదియారువేలమంది సతుల ఇండ్లలో, సేసవెట్టి (అక్షతలు జల్లి) మరీ వారిని పెండ్లాడినాడు. (ఇందులో పెండ్లాడాలనే కోర్కె ఇంతులదే సుమా!) స్వామికి యేనాడు, యెవరిపైనా, యే కోరికా వుండదు. ఎందుకంటే ఆ దేవదేవుడు నిరంజనుడు, అవునా?
ఈ కొంటె కోణంగి ఇంకా యేమిచేస్తాడో తెలుసా? తనకు గంధము పూస్తున్న పడతులను మెల్లగా సందిటజేర్చి వెల్లవిరిగా (విజృంభించి) కూడి ముచ్చట దీరుస్తాడు. ఇల్లిదే (ఇదే) శ్రీవేంకటాద్రిపై శ్రీ వేంకటేశుడైన ఇతడే నేడు ఈ కోనేటి ఒడ్డున విటలేశుడై యెల్లగా వరాలచ్చీ (అంతులేని వరములనను గ్రహించుచున్నాడు).
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- జగములేలేవాడవు జనార్దనుడవు
- వీఁడివో లక్ష్మిపతి వీఁడివో సర్వేశుఁడు
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ