Mancivadavantepo Madhavaraya In Telugu – మంచివాడవంతేపో మాధవరాయా

ఈ పోస్ట్ లో అచ్చుతుఁ డనియెడి నామము గలిగినయట్టి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మంచివాడవంతేపో మాధవరాయా – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 14
కీర్తన : మంచివాడవంతేపో మాధవరాయా
సంఖ్య : 237
పుట 138
రాగం: దేసాళం

దేసాళం

7 మంచివాఁడవంతేపో మాధవరాయా
మంచుమాయ మాఁడుకూరి మాధవరాయా

॥పల్లవి||

మోనాననుండిన నన్ను ముట్టి వేఁడుకొనేనంటా
మానమేలంటేవోయి మాధవరాయా
నేనా సారెకు వచ్చి నీతో నెదురాడేదాన
మానవుగా మాఁడుకూరి మాధవరాయా

॥మంచి||

యోగసక్యానకే మాఇల్లుచొచ్చి వచ్చేవు
మగనాలిఁ గదవోయి మాధవరాయా
బగి వాయక కూచుండి పైఁ దొడవేసేవు నీ –
మగువనా మాఁడుకూరి మాధవరాయా

॥మంచి||

పనన్నాఁ బోనీవు వొడివట్టి తీసేవు
మాపుదాఁకా నేలోయి మాధవరాయా
కోపుగా శ్రీవేంకటాద్రిఁ గూడి చూపేవా నీయెమ్మె
మాపైనే మాఁడుకూరి మాధవరాయా.

॥మంచి||237

అవతారిక:

మాడుకూరు అనే గ్రామములో వెలసిన మాధవరాయనిపై సరస శృంగార కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. ఈయన మంచివాడే, కాని మంచుమాయగాడట. మంచువలె చల్లనైనవాడే కాని మాయగాడట. నాయిక మానమునంటి వేడుకొంటాడట. ఇక మౌనంగావుండటం ఆవిడవల్ల యేమవుతుంది చెప్పండి. మహానుభావా! నేను మగని చాటు ‘మగనాలి’ నన్నా వినిపించుకోడట. నేను ‘ఓపను’ అన్నాకూడా వదలడట. శ్రీవేంకటాద్రిపై కూడా ‘యెమ్మెలు’ చూపిస్తున్నావా నామీద అంటున్నారు. కొంచెం తికమకపెట్టే కీర్తనే ఇది. శృంగార భక్తిని రుచి చూడండి.

భావ వివరణ:

ఓ మాధవరాయా! నీవు మంచివాడవు. అంతే… నేను నీకు నిజమే చెబుతున్నాను. మాడుకూరిలో వెలసిన మాధవరాయా! నీవు చల్లే మాయలు మంచు మాయలు. మంచు అస్థిత్వమువలె, నీ వలపు మాయ నీ అస్థిరమైనది.

మోనాన వుండి నన్ను (నేను మౌనంగా వుంటే) ముట్టి వేడుకొంటావు (నన్ను తాకుతూ బ్రతిమిలాడతావు) నా మానము నంటి మరీ మాటలు కలుపుతావు. నేను నీయెదుటకు వచ్చి నా మౌనం వదలి నీతో యెదురుమాట్లాడేదాకా, మానవుగా (వదలిపెట్టవు కదా!) ఓ మాడుకూరి మాధవరాయా! నీతో వేగటం కష్టమే స్వామీ!

ఎగసక్కెములు (పరాచికాలు ఆడుకొంటూ మా ఇంట్లో దూరుతావు. నేను మగనాలిని (మగనిచాటు పెళ్ళాన్ని) అన్నా నన్ను విడిచిపెట్టవు. బగివాయక కూర్చుండి (నాపక్కనే కూర్చుండి) తొడపై చేతులు వేస్తావు. ఇదేమి అఘాయిత్యము? నేనేమి నీ మగువనా? (పెండ్లామునా? ఓ మాడుకూరి మాధవరాయా! ఇదేమన్నా మర్యాదగా వున్నదా ప్రభూ!

స్వామీ! నీ చిలిపి చేష్టలకు నేను ఓపను (తాళను) అన్నా, నన్ను పోనియవు. ఒడిసిపట్టి ఆక్రమింతువు. మాపుదాకా (చీకటిపడేదాకా చీకాకు పెడతావు). ఇట్లా అయితే యెట్లు ముడిపడుతుంది? కోపుగా (అందముగా) శ్రీవేంకటాద్రిమీద కూడి నీవే వేంకటేశ్వరుడవై నీ యెమ్మెలు (వన్నెలు) మాపైన చూపిస్తున్నావా? ఓ మాడుకూరి మాధవరాయా! మేము చరితార్థులమైనాము ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment