కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో నాలం వా తవ నయవచనం కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
నాలం వా తవ నయవచనం – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : నాలం వా తవ నయవచనం
సంఖ్య : 157
పుట : 113
రాగం : రీతిగౌళ
రీతిగౌళ
27 నాలం వా తవ నయవచనం
చేలం త్యజ తే చేటీ భవామి
||పల్లవి||
చల చల మమ సంసర్ఘటనే కిం
కులిశహృదయ బహుగుణవిభవ
పులకిత తనుసంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి.
||నాలం||
భజ భజ తే ప్రియాభామాం సతతం
సుజన స్త్వం నిజసుఖ నిలయ
భుజ రేఖా రతి భోగిభవసికిం
విజయీభవ మద్విధిం వదామి.
||నాలం||
నయ నయ మా మనునయనవిధం తే
ప్రియకాంతాయాం ప్రేమభవమ్
భయహార వేంకటపతే త్వం మ-
త్రియో భవసి శోభితా భవామి.
||నాలం||
అవతారిక:
జయదేవకవి స్ఫూర్తితో చాలామంది గీర్వాణలో శృంగార కీర్తనలు రచించారు. అన్నమాచార్యులవారు సాళ్వ నరసింహరాయలు కొలువులో వున్నప్పుడూ అసంఖ్యాకమైన సరసశృంగార కీర్తనలు చెప్పారు వేంకట మకుటంతో రాజుగారి ఆస్థానంలో విద్వత్ గోష్ఠులు జరిగే తరుణంలో పాండితీ ప్రదర్శనకు కవులు సంస్కృతంలో కవిత్వం చెప్పేవారేమో అనిపిస్తుంది. ఈ కీర్తనలో నిందాస్తుతిని ఇతివృత్తంగా యెన్నుకొన్నారు. నాయిక విర హెూత్కంఠితయై స్వామిని నిందిస్తున్నది. దెప్పి పొడుస్తున్నది. చివరికి రాజీకి రాక తప్పలేదు. నీవు నా ప్రియుడివైతే నేనూ శోభిస్తాను కదయ్యా! అంటున్నది.
భావ వివరణ:
నీయొక్క నయవంచనతో కూడిన మాటలు ఇక చాలించవయ్యా! ముందు నా పైట కొంగును విడిచిపెట్టు. నీదాసినౌదునులే. నన్ను వదలిపెట్టు.
ఓ కులిశహృదయా! (కఠినహృదయుడా! నీకు నాతో పొత్తు యెందులకు? చాలు చాలు. పో పొమ్ము. ఓ బహుగుణ విభవా! (అనేక గుణములు పుణికి పుచ్చుకున్నవాడా!) చాలు చాలు పో పో. నేను పులకించిన గాత్రము (శరీరం) వలన పొందిన వేదన యొక్క మాలిన్యమును ధరించియున్నాను. ఇక నా అహమును విడనాడి నీకు వశమైతిని.
నీవు యెల్లప్పుడూ నీ వలపుకత్తెనే స్మరిస్తుంటావు. నీవు గొప్పవాడివి కదా! గొప్పవాళ్ళకి స్త్రీ వ్యసనం సహజమేలే. పైగా నీవు బ్రహ్మానందానికి నిలయుడవట కదా! నీ భుజములపై రతికూటముల చిహ్నములు కొట్టవచ్చినట్లు కనబడుతూనే వున్నాయి కదా! పోనీలే. నీకు అంతా విజయమేలే. నా తిప్పలు నీకెందుకు పట్టాయి గనుకా!
నన్ను బుజ్జగించే విధానమును కూడా కాస్త నీవు తెలుసుకోకూడదటయ్యా! నీ ప్రియకాంతకే నీవలపులనందించుకో. మధ్యలో నిన్ను కాదన్న వాళ్ళెవరు? నాకేమి పట్టింది? భయహరుడవైన ఓ శ్రీవేంకటేశ్వరా! నీవు నా ప్రియుడవైనచో నేను కూడా శోభించెదను కదా! స్వామీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: