కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో మేలుకొనవే కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
మేలుకొనవే – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 4
కీర్తన : మేలుకొనవే
సంఖ్య : 21
పుట : 375
రాగం : భూపాలం
భూపాలం
31 మేలుకొనవే
భూలలనాధిప భోగిశయన
||పల్లవి||
లేదు వేదవిధి లేశమును
మేదిని భరమై మించినది
పాదుపడదు చూపరకు భువి
గాదిలిసుతుపై గనలె జనకుఁడు
||మేలు||
కనకము చవి చెడెఁ గడుఁగడును
ఘననృపబాధలు గదిమినవి
దనుజుల కతివలు దలఁకెదరు
ఎనయ బలాధికులెవ్వరు లేరు
||మేలు||
అసుర సతుల పుణ్యము ఘనము
కస (సి?) మసఁగెడి కలికాలమహిమ
పసగల వేంకటపతి యిఁకను
వసుధలోని నెవ్వగలుడుపఁగను
||మేలు||21
అవతారిక:
అన్నమాచార్యులవారు చెప్పిన ఒక మేలుకొలుపు కీర్తననాస్వాదించండి. 600 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇంత ఘోరంగావుంటే నేడు యెవరికివారే యమునాతీరే అనే రోజుల సంగతి చెప్పేదేముంది? కన్నకొడుకులపై తండ్రి కక్షకడుతున్నాడు. బంగారం బంధువైపోయింది. ఆడది అసురులవంటి వారి చేతిలో అల్లాడిపోతుంది. “కసిమసగెడి కలికాలం” మహిమ యేం చెప్పగలం? ఒక్క శ్రీవేంకటేశుడే వసుధలోని పగను నెవ్వగలడు అంటున్నారు. భావవివరణతో పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. అవునా?
భావ వివరణ:
ఓ భూలలనాధిప! (భూసతీరమణా!) భోగిశయనా! (శేషతల్పశాయీ!) మేలుకొనవే. (నీవు సృష్టించిన ఈలోకం యెంత ఘోరంగా వున్నదో ఒకసారి పరికింపుము).
వేదువిధి లేశమును లేదు (ఎవ్వడూ వేద విధానములను పాటించుట లేదు). భూమి మీద భరమై మించినది (అతిశయము యెక్కువైపోయింది). చూపరులకు భువిపాదుపడదు (కాళ్ళకింద భూమి కనపడదు. అంటే అంత పొగరుబట్టి వుంటారు). ప్రేమించవలసిన కన్నకొడుకుపైన తండ్రే కనలె (మండిపడుతుంటాడు).
కనకము చవిచెడెన్ కడునేకడున్ (బంగారమునకు వుండవలసిన నిబద్ధతతో కూడిన మక్కువ వుండదు. అనగా ప్రతివాడూ బంగారం కోసం వెంపర్లాడుతుంటాడు). గొప్పవాళ్ళయిన నృపుల (పరిపాలకుల) బాధలు గదిమినవి (భయపెడుతునవి). దనుజులకు (రాక్షసులవంటి మగవారి దౌర్జన్యాలకు) అతివలు (స్త్రీలు) తలకెదరు (భయపడుతుంటారు). లోకంలో ఈ పరిస్థితిని ఎనయు బలాఢ్యులు (సవరించగల దిట్టలు) యెవ్వరూ లేరు.
కాని అసురసతులు (దుర్మార్గుల భార్యలు) ఘనమైన పుణ్యములు చేస్తుంటారు. కలికాల మహిమ (కలియుగ ప్రభావముచేత) కసమసగెడి (పాపము విజృంభిస్తుంటుంది). హతవిధీ!! ఇక గత్యంతరం యేమిటి? పసగలవేంకటపతి (సర్వ సమర్ధుడైన శ్రీవేంకటేశ్వరుడు) ఇకను (ఇకపై) వసుధలోని పగను, నెవ్వగలడు (ఆపద తప్పించగలడు.)
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: