కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో యెన్ని మారులు యిట్టె నీపనులు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
యెన్ని మారులు యిట్టె నీపనులు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి : 6
కీర్తన : యెన్ని మారులు యిట్టె నీపనులు
సంఖ్య : 58
పుట : 43
రాగం : సామంతం
సామంతం
30 యెన్ని మారులు యిట్టె నీపనులు
ఇన్ని మాయలు నన్ను నేఁచనేఁటికిరా.
||పల్లవి||
నీళ్లే నమలేవు నీలోనె సన్నల
వేళ్లే చూపేవు వెలుపలికి
పేళ్లె తప్పేవు బిరుసుగ, నింతేసి
గోళ్ల రాచేవు కోపమేఁటికిరా.
॥యెన్ని॥
మేనె దాఁచేవు మెస్తిర గొడ్డలి
నానం బెట్టేవు నయముననే
పోని తెరువుల పోకులఁ బోయేవు
కానిరా యేటివంకలు తిద్దవశమా.
॥యెన్ని॥
చేరి కపటాలె చేసేవు యిఁకనైనా
సారెం బరువులు చాలించరా
ధీరుండవుగాన తిరువేంకటపతి
కూరి మెఱిఁగి నన్నుఁ గూడితి విపుడూ.
॥యెన్ని॥ 58
అవతారిక:
ఇదికూడా జానపదుల శైలిలో కొనసాగే దశావతార కీర్తన. నా అభిప్రాయంలో ఇది బహుక్లిష్టమైనది. ఎందుకంటే కొన్ని మాటలకు యే నిఘంటువులోనూ అర్ధ వివరణ సూచన ప్రాయంగా కూడా లభించలేదు. అది ఏ అవతార వివరణో వూహించగలుగుట వలన భావసమన్వయం ఆవశ్యకమైనది. అంటే. ఉదాహరణకి “పెళ్లె తప్పేవు బిరుసుగ” అంటే వరాహవతారంతో సమన్వయపరచుటెట్లు సాధ్యం. యేటివంకలు తిద్దవశమా? అంటే కృష్ణావతారంతో యెట్లా ముడిపెట్టాలి? దీని అర్థం ఏమిటో ఎలా తెలుస్తుంది? ఓ దేవదేవా! అన్నమయ్య ఈ కీర్తన పల్లవిలో అన్నమాట నిజం చేస్తున్నావు కదటయ్యా! “ఇన్ని మాయల నన్ను నేచనేటికిరా”. అంటే ఏమిటో తెలియాలంటే ఏమిటి చేయాలి? మీకు తెలుసునని నాకు తెలుసు.
భావ వివరణ:
నీ పనులు (నీవు చేసే లీలలు యెన్ని మారులు? (ఎన్ని విధములో) చెప్పుట యెట్లు సాధ్యము? నన్ను ఇన్ని మాయలతోన్ చేయనేటికిరా? (అతిశయించుట యెందులకయ్యా? )
ఒకసారి నీలోనే నీళ్ళు నములుతుంటావు (మత్స్యావతారము); ఇంకొకసారి వెలుపలికి వచ్చి సన్నల (సైగలతో) వేళ్ళను చూపింతువు (కూర్మావతారము); ఇంకొకసారి, బిరుసుగ పేళ్లె తప్పేవు (కాఠిన్యంతో వేగిపోతూ తపించిపోయేవు)… అనగా (వరాహావతారం). ఇంకొకసారి, ఇంతేసి గోళ్ళ రాచేవు (ఇంతింత పొడుగువున్న గోళ్ళతో చీరివేసెదవు. కోపమేటికిరా? కోపమెందులకయ్యా? (నరసింహావతారం).
ఒకసారి, మేనెదాచేవు (చూడటానికి పొట్టి పిల్లవాడిలావున్నా, భూనభాంతరములు నిండిపోగల శరీరాన్ని దాచివుంచినావు)… అనగా (వామనావతారం).; మెస్తిర గొడ్డలి నయముననే నానం బెట్టేవు (బాగా పదునైన పరశువును బాగా రక్తంలో నానబెట్టినావు)… అనగా (పరశురామావతారము); పోని తెరువుల పోకల బోయేవు (చొరరాని కీకారణ్యములబట్టి పోయేవు)… అనగా (శ్రీరామవతారం); కానిరా, యేటివంకలు తిన్దవశమా (కానీయవయ్యా! వంకరటింకరగా పోయే ఏరుయొక్క మార్గాన్ని కట్టడి చెయ్యగలమా? … అనగా (శ్రీకృష్ణావతారపు గోపీలోలత్వం).
ఒకసారి, చేరి కపటాలే చేసేవు (పురసతులను మోసగించినావు)… అనగా (బుద్ధావతారము). ఇకనైనా సారెం పరువులు చాలించరా (ఇప్పటికైనా, మాటిమాటికీ పరుగులు తీసే అలవాటు మానుకోవయ్యా!)… అనగా (కల్కి అవతారము); ధీరోదాత్తుడవు కావున ఓ తిరువేంకటేశ్వరా! కూరిమి యెరిగి నన్ను కూడితివి. ఇప్పుడు నీమాయలను మెచ్చక యెలా వుండగలను ప్రభూ!.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: