Hari Neeve Sarvatmakudavu In Telugu – హరి నీవే సర్వాత్మకుడవు

కీర్తన తెలుగు భాషలో ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు. ఈ పోస్ట్ లో హరి నీవే సర్వాత్మకుడవు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరి నీవే సర్వాత్మకుడవు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి : 4
కీర్తన : హరి నీవే సర్వాత్మకుడవు
సంఖ్య : 441
పుట : 297
రాగం : దేశి

దేశి

32 హరి నీవే సర్వాత్మకుడవు
యిరవగు భావన యియ్యగదే ॥

||పల్లవి||

చూడక మానవు చూచేటి కన్నులు
యేడనేవైనా యితరములు
నీడల నింతా నీ రూపములని
యీడువడని తెలి వియ్యగదే ॥

||హరి||

పారక మానదు పాపపు మనసిది
యీరసములతో నెందైనా
నీరజాక్షయిది నీమయమేయని
యీ రీతుల తల పియ్యగదే ॥

||హరి||

కలుగక మానవు కాయపు సుఖములు
యిలలోపలగల వెన్నైనా
అలరిన శ్రీవేంకటాధిప నీకే
యిలనర్పితమను యిహమియ్యగదే ॥

||హరి|| 441

అవతారిక:

మనం వేరు, పరులు వేరు అనే భావనవుండటం వల్లనే మనం కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ద్వేషిస్తాము. కానీ శరీరాలు వేర్వేరైనా ఆత్మలన్నిటికి మూలకారణం పరమాత్మ అనే తత్త్వం తెలిసనవాడు సర్వాత్మకుడైనవాడు శ్రీహరి ఒక్కడే అని తెలిసికొని ఎవ్వరినీ ద్వేషించడు. ఓ దేవదేవా నాకు కూడా అటువంటి భావనే ఇయ్యవయ్యా! అంటున్నారు అన్నమాచార్యులవారు. ఈ ప్రపంచంలోవున్నవన్నీ నీ అర్పణ కొరకే స్వామీ! అంటున్నారు. ఈ భావవివరణ వ్రాసేటప్పుడు నాకు కలిగిన తృప్తి నేను మాటలలో వర్ణించలేను.

భావ వివరణ:

ఓ శ్రీహరీ! నీవే సర్వాత్మకుడవు (అన్ని ఆత్మలకు మూలమైనవాడవు). నాకునూ అట్టి నీవే అన్ని ఆత్మలలోగలవనె ఇరవగు భావన (సుస్థిరమైన అభిప్రాయమును) ఇయ్యగదే (ఈయవయ్యా!)

నాకు చూడాలనే కోరిక కలిగితే చాలు నా కన్నులు దేన్ని పడితే దాన్ని చూస్తాయి. ఇతరములు (అనవసరమైన ఇతర విషయములన్నింటినీ, యేడ నేవైన (యెక్కడైనా యేమైనా) చూస్తాయి. అవి చూడటం మానవు. నీడలన్ (నీ ఆశ్రయంలో) అన్నీ నీ ప్రతిరూపాలే అనునట్టి, ఈడువడని (చెడిపోని) తెలివి (జ్ఞానమును) ఈయగదే (ఇమ్ము ప్రభూ!).

నేను నాకళ్లుమూసుకున్నా నన్ను చెడగొట్టే ఇంకొకటుంది. అదే నా మనస్సు. పాపచింతనతో కూడిన నా మనస్సు అనవసరమైన వాటిమీద పారక మానదు (ప్రసరించక వదలదు). ఈ రసములతో యెందైనా యెవరికైనా యెన్నో పాపపు ఆలోచనలే వస్తాయి. ఓ నీరజాక్షా! ఈ రసములు కూడా నీమాయలే (నీవలననే కలిగినవి) అనునట్టి తలపును ఇయ్యగదే (ఈయరాదటయ్యా!)

ప్రభూ! నా కళ్ళూ మనస్సు ఒక్కసారి విజృంభించాయంటే, నా కాయము (దేహము) వున్నదే అది తగులుకొంటుంది. దానికెప్పుడూ సుఖం కావాలి. దానికి ఒక సుఖం చాలదు. ఎన్నయినా కావాలి కావాలి అనే అంటుంటుంది. దానికి ఈ ప్రపంచమంతా ఇచ్చినా చాలదు. అలరిన శ్రీవేంకటాధిప (ఏడు కొండలపై శోభించుచున్న) ఓ శ్రీవేంకటేశ్వరా! ఈ ప్రపంచంలో వున్నవన్నీ నీకు అర్పితమైనవే అనే ఇహము (ఈ ప్రాపంచిక జ్ఞానమును) ఇయ్యవయ్యా తండ్రీ!.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment